ఆసీస్‌ను నిలువరించేనా?

6 Jul, 2019 17:38 IST|Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచ కప్‌లో లీగ్‌ దశ ఆఖరి ఘట్టానికి చేరింది. శనివారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచే లీగ్‌లో చివరిది. దాంతో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్టేదో తేలిపోనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాపై ఆసీస్‌ గెలిస్తే టాప్‌ను కాపాడుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఇరు జట్ల ముఖాముఖి రికార్డుల పరంగా చూస్తే 99 వన్డేల్లో తలపడగా ఆసీస్‌ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, దక్షిణాఫ్రికా 47 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మూడు మ్యాచ్‌లు టైగా ముగియగా, ఒక మ్యాచ్‌ రద్దయ్యింది.

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ మినహా ఆస్ట్రేలియాకు టోర్నీలో ఎక్కడా సమస్య ఎదురు కాలేదు. ఇంగ్లండ్‌ రావడానికి ముందు ఎవరూ ఫేవరెట్‌గా పరిగణించని డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒక్కసారిగా పుంజుకొని చెలరేగిపోయింది. ఓపెనర్లు వార్నర్‌ (516 పరుగులు), ఫించ్‌ (504) ఒకరితో మరొకరు పోటీ పడి జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. మరొకవైపు బౌలింగ్‌ విభాగంలో కూడా ఆసీస్‌ తనదైన ముద్రతో దూసుకుపోతోంది. దాంతో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించిన సఫారీలతో పోరులో ఆసీస్‌నే ఫేవరెట్‌గా బరిలోకి దిగింది.  మరి ఆసీస్‌ను దక్షిణాఫ్రికా ఎంతవరకూ నిలువరిస్తుందో చూడాలి.


 

మరిన్ని వార్తలు