ప్రొటీస్ పొదిలో ప్రసన్నాస్త్రం!

5 Dec, 2013 01:04 IST|Sakshi
ప్రొటీస్ పొదిలో ప్రసన్నాస్త్రం!

 జొహన్నెస్‌బర్గ్: భారత క్రికెటర్లు బస చేసిన హోటల్లో రెస్టారెంట్... దక్షిణాఫ్రికా టీమ్ డ్రెస్‌లో ఉన్న ఒక వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. అంతే... అక్కడ కూర్చొని ఉన్న కోహ్లి, రోహిత్, పుజారా, జడేజా, ఇషాంత్ కళ్లల్లో ఆనందం... వారంతా ఒక్కసారిగా వెళ్లి అతడిని కౌగిలించుకున్నారు. ఇది చూసిన చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా టీమ్ వీడియో అనలిస్ట్ ప్రసన్న అగోరామ్. స్వస్థలం చెన్నై. 2010 నుంచి అతను దక్షిణాఫ్రికా జట్టుకు సాంకేతిక విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా సభ్యులు అంతగా చేరువ కావడానికి కారణం ఉంది. వీరంతా అండర్-15 స్థాయి నుంచి ప్రసన్నకు బాగా తెలుసు.
 
  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పని చేస్తున్న సమయంలో అండర్-19 స్థాయిలో ఈ కుర్రాళ్ల ఆటను బాగా దగ్గరి నుంచి చూసిన వ్యక్తి ప్రసన్న. 2006 ప్రపంచకప్‌లో భారత అండర్-19 జట్టుతో అతను కలిసి పని చేశాడు. ప్రస్తుత స్టార్ ఆటగాళ్ల అప్పటి రోజులను అతను గుర్తు చేసుకున్నాడు. ‘అండర్-17 స్థాయిలో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసినప్పుడే విరాట్ భారత్‌కు ఆడతాడనుకున్నాను. పుజారాను రేపటి ద్రవిడ్‌గా, రోహిత్‌ను రేపటి మార్క్‌వాగా అప్పుడే అనుకునేవాళ్లం.
 
 ఆ సమయంలో వారి కళ్లలో ఒక రకమైన ఉద్వేగం కనిపించేది’ అని ప్రసన్న చెప్పాడు. గత సిరీస్‌లోనూ ప్రసన్న ప్రొటీస్ టీమ్‌తో ఉన్నా... అప్పుడు ఈ కుర్రాళ్లు భారత జట్టులో లేరు. తమ మధ్య ఒక రకమైన గురుశిష్యుల సంబంధం ఉన్నా వారి కోసం వ్యూహాలకు వెనుకాడనని అతను అన్నాడు. వారి బలాలు, బలహీనతల గురించి అతనికి బాగా తెలుసు. ‘దక్షిణాఫ్రికా వీడియో అనలిస్ట్‌గా వారిని నిలువరించే ప్రణాళికలు రూపొందించడం నా విధి. ఆ సమయంలో ఆ చిన్నారులు నాకు గుర్తుకు రారు. వారు మా జట్టుపై ఒక్క బౌండరీ కొట్టడాన్ని కూడా నేను చూడలేను’ అని ప్రసన్న వ్యాఖ్యానించాడు.
 

మరిన్ని వార్తలు