బంగ్లాదేశ్‌ను చితక్కొట్టారు

16 Oct, 2017 01:33 IST|Sakshi

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా రికార్డు విజయం

డి కాక్, ఆమ్లా సెంచరీలు

రహీమ్‌ శతకం వృథా

కింబర్లీ: సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లోనూ అదే ధాటిని కొనసాగించింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. వికెట్లేమీ నష్టపోకుండా వన్డేల్లో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో రికార్డు సృష్టించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.

కెరీర్‌లో ఐదో సెంచరీ సాధించిన ముష్ఫికర్‌ రహీమ్‌ (116 బంతుల్లో 110 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) ఏ ఫార్మాట్‌లోనైనా దక్షిణాఫ్రికాపై శతకం నమోదు చేసిన తొలి బంగ్లాదేశ్‌ ఆటగాడిగా నిలిచాడు. రబడకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం సఫారీ ఓపెనర్లు క్వింటన్‌ డి కాక్‌ (145 బంతుల్లో 168 నాటౌట్‌; 21 ఫోర్లు, 2 సిక్సర్లు), హషీం ఆమ్లా (112 బంతులోల్‌ 110 నాటౌట్‌; 8 ఫోర్లు) ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 282 పరుగులు సాధించింది. రెండో వన్డే బుధవారం పార్ల్‌లో జరుగుతుంది.  

♦ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డి కాక్‌ కెరీర్‌లో ఇది 13వ శతకం కాగా... కోహ్లి (166 ఇన్నింగ్స్‌లు)కంటే వేగంగా 26 సెంచరీలు సాధించిన ఆటగాడిగా ఆమ్లా (154) నిలిచాడు.  
♦  దక్షిణాఫ్రికాకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం మరో విశేషం. ఈ క్రమంలో డి కాక్, ఆమ్లా ఆ జట్టు తరఫున వన్డేల్లో ఓవరాల్‌గా కూడా అత్యధిక పరుగులు జోడించిన జంటగా గుర్తింపు పొందారు.  
♦  కెరీర్‌లో 5 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఐదో ఆల్‌రౌండర్‌గా షకీబ్‌ గుర్తింపు పొందాడు.  

మరిన్ని వార్తలు