సౌత్‌జోన్ మహిళల త్రోబాల్ రన్నరప్ తెలంగాణ

18 May, 2015 01:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : సౌత్‌జోన్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల జట్టు మూడో స్థానంలో నిలిచింది. రెండు విభాగాల్లోనూ తమిళనాడు జట్లు టైటిల్స్ సాధించాయి. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఆదివారం సెమీస్, ఫైనల్స్ మ్యాచ్‌ల్ని నిర్వహించారు. మహిళల ఫైనల్లో తెలంగాణ జట్టు 15-11, 12-15, 13-15తో తమిళనాడు చేతిలో పోరాడి ఓడింది. అంతకుముందు సెమీస్‌లో తెలంగాణ 15-2, 15-10తో పుదుచ్చేరిపై, తమిళనాడు 15-5, 15-4తో ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఏపీ జట్టు 10-15, 15-10, 15-10తో పుదుచ్చేరిపై గెలిచింది.

 పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్‌తో సంతృప్తి పడింది. ఫైనల్లో ఏపీ 15-17, 15-12, 6-15తో తమిళనాడు చేతిలో ఓడింది. సెమీస్‌లో ఏపీ 15-6, 15-10తో పుదుచ్చేరిపై, తమిళనాడు 16-14, 15-13తో తెలంగాణపై గెలుపొందాయి. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 15-6, 15-10తో పుదుచ్చేరిపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి ప్రేమ్‌రాజ్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి సోమిరెడ్డి, డీపీఎస్ చైర్మన్ కొమరయ్య, ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, వినోద్ రెడ్డి, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు