వెస్ట్‌పై సౌత్‌జోన్ గెలుపు

5 Jun, 2014 00:30 IST|Sakshi
వెస్ట్‌పై సౌత్‌జోన్ గెలుపు

ఎస్‌జేఎఫ్‌ఐ-జేకే బోస్ టి20 క్రికెట్
 సాక్షి, హైదరాబాద్: భారత స్పోర్ట్స్ జర్నలిస్టుల సమాఖ్య (ఎస్‌జేఎఫ్‌ఐ) జాతీయ కన్వెన్షన్‌లో భాగంగా బుధవారం జేకే బోస్ ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సౌత్‌జోన్ 10 వికెట్ల తేడాతో వెస్ట్‌జోన్‌పై గెలుపొందగా, నార్త్‌జోన్ 53 పరుగుల తేడాతో ఈస్ట్‌జోన్‌పై విజయం సాధించింది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, టేబుల్ టెన్నిస్‌లో అర్జున అవార్డీ మీర్ ఖాసీమ్ అలీ ముఖ్య అతిథులుగా విచ్చేసి  టోర్నీని లాంఛనంగా ఆరంభించారు.
 
 సౌత్, వెస్ట్‌ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్‌జోన్ 19.4 ఓవర్లలో 94 పరుగులు చేసి ఆలౌటైంది. తావుస్ రిజ్వీ 22 పరుగులు చేయగా, సౌత్ బౌలర్లలో సత్య 3 వికెట్లు పడగొట్టాడు. సుదర్శన్, భగ్లోత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సౌత్‌జోన్ 13.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 95 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ రోషన్ త్యాగరాజన్ (47 బంతుల్లో 67 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.
 
 మరో మ్యాచ్ స్కోర్లు: నార్త్‌జోన్ 163/5 (సిద్ధార్థ్ శర్మ 62, అమిత్ చౌదరి 54; అబ్దుల్ అజీజ్ 2/24), ఈస్ట్‌జోన్: 110/9 (కిరిటీ దత్త 42; ధర్మేంద్ర పాని 2/22, అమిత్ 2/24, సుధీర్ ఉపాధ్యాయ్ 2/9).
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా