‘చాంపియన్‌’ రాకెట్‌

27 Feb, 2020 05:13 IST|Sakshi
సౌజన్య బవిశెట్టి

సత్తా చాటుతున్న సౌజన్య

భారత ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ జట్టులో చోటు

స్పాన్సర్ల కోసం ఎదురుచూపులు  

ఏడాది క్రితం ఆ అమ్మాయి ఆటను వదిలేయడానికి సిద్ధమైంది! దేశంలోని ఎంతో మంది టెన్నిస్‌ క్రీడాకారుల్లాగే ఆర్థిక పరమైన సమస్యలు కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాలనే ఆలోచనకు కారణంగా నిలిచాయి. అయితే మరొక్క ప్రయత్నం అంటూ మైదానంలో నిలబడిన ఆమెకు ‘డబుల్‌’ జాతీయ చాంపియన్‌ రూపంలో ప్రతిఫలం దక్కింది. దానికి కొనసాగింపుగా భారత సీనియర్‌ జట్టులో చోటు లభించడం కూడా ఆమె శ్రమకు దక్కిన గుర్తింపు. రాకెట్‌ పడేయాలన్న ఆలోచనను పక్కన పెట్టి మరింత గొప్ప ప్రదర్శన ఇచ్చేందుకు ఇవి ఆమెకు స్ఫూర్తినిచ్చాయి. ఇకపై మరిన్ని విజయాలు సాధిస్తానంటున్న ఆ టెన్నిస్‌ క్రీడాకారిణి సౌజన్య బవిశెట్టి. భారత ఫెడ్‌ కప్‌ జట్టులో రిజర్వ్‌ క్రీడాకారిణిగా ఆమె ఎంపికైంది.   

సాక్షి, హైదరాబాద్‌
భారత్‌ తరఫున అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) సర్క్యూట్‌లో అనేక మంది అమ్మాయిలు నిలకడగా రాణిస్తూ విజయాలు సాధిస్తున్నారు. వారిలో సౌజన్య బవిశెట్టి కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత అక్టోబరులో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇదే టోర్నీలో డబుల్స్‌ విభాగంలో కూడా  టైటిల్‌ సాధించడం విశేషం. నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌ అయిన ప్రేరణా బాంబ్రీని సౌజన్య ఫైనల్లో ఓడించడం విశేషం. అదే ఆమెకు భారత ఫెడ్‌ కప్‌ జట్టులో రిజర్వ్‌ ప్లేయర్‌గా కూడా చోటు కల్పించింది. ఆసియా–ఓసియానియా గ్రూప్‌లో భాగంగా దుబాయ్‌ లో మార్చి 3 నుంచి జరిగే పోరులో భారత జట్టు తలపడుతుంది. దీని కోసం సౌజన్య ప్రస్తుతం సన్నద్ధమవుతోంది.  

ఐటీఎఫ్‌లో విజయాలు...
సౌజన్య స్వస్థలం కర్నూలు. ఆమె సోదరి అంజలి టెన్నిస్‌ క్రీడాకారిణి. ఆమె స్ఫూర్తితో రాకెట్‌ పట్టిన సౌజన్య ప్రతిభను చూసి కోచ్‌లు ప్రోత్సహించారు. దాంతో హైదరాబాద్‌లో శిక్షణ కొనసాగించిన సౌజన్య వేగంగా దూసుకుపోయింది. ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల నుంచి జాతీయ క్రీడల వరకు పలు పతకాలు సొంతం చేసుకుంది. ముందుగా ఐటీఎఫ్‌ జూనియర్‌ గ్రేడ్‌ విజయాలతో మొదలు పెట్టి సీనియర్‌ విభాగంలో మంచి విజయాలు సాధించింది. ఐటీఎఫ్‌ కెరీర్‌లో సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో కలిపి 26 ఏళ్ల సౌజన్య ఇప్పటి వరకు 11 టైటిల్స్‌ సాధించింది. మరో 5 టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో రెండు టైటిల్స్‌ గెలుచుకోవడంతో పాటు ఇటీవల జరిగిన దక్షిణాసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.

గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొనే లక్ష్యంతో...
ఎడంచేతి వాటం ప్లేయర్‌ అయిన సౌజన్య బలం ఫోర్‌ హ్యాండ్‌. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత సౌజన్య ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఇటీవల జరిగిన రెండు ఐటీఎఫ్‌ టోర్నీలలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంకింగ్‌ ఉన్న ప్లేయర్లను ఆమె ఓడించగలిగింది. కెరీర్‌లో ఎదిగే క్రమంలో స్పెయిన్‌లో సాంచెజ్‌ అకాడమీలో కూడా సౌజన్య శిక్షణ పొందింది. జట్టు నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ప్రణాళిక ప్రకారం ఫెడ్‌ కప్‌ టోర్నీలో అదృష్టం కలిసొస్తే ఆమె మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా ఉంది. నగరంలోని ఎస్‌కే టెన్నిస్‌ అకాడమీలో ఆమె ఫెడ్‌ కప్‌ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. కోచ్, తన భర్త సురేశ్‌ కృష్ణతో పాటు ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ హర్ష మార్గనిర్దేశనంలో ఆమె మరింత ఫిట్‌గా మారింది. ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చుకొని గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పాల్గొనే లక్ష్యంతో సౌజన్య శ్రమిస్తోంది.  

స్పాన్సర్‌షిప్‌ లేకపోయినా...
చాలా మంది టెన్నిస్‌ క్రీడాకారిణులు ఎదుర్కొనే సమస్య సౌజన్యకు కూడా ఎదురైంది. టెన్నిస్‌ సర్క్యూట్‌లో శిక్షణ మొదలు టోర్నీల్లో పాల్గొనడం భారీ ఖర్చుతో కూడుకున్నది కావడం, ఆర్థికపరమైన అండదండలు లేనిదే సొంత డబ్బులతో ఆటను కొనసాగించడం అంత సులువు కాదు. ఇదే కారణంగా ఆమె తప్పుకునేందుకు కూడా సిద్ధమైంది. ఇప్పటి వరకు సౌజన్యకు ఏ రకమైన ప్రైవేట్‌ స్పాన్సర్‌షిప్‌ లభించలేదు. ఇది ఆమె భవిష్యత్‌ అవకాశాలను దెబ్బ తీస్తోంది. కెరీర్‌ బాగా సాగుతున్న ఈ దశలో యూరోప్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని కూడా ఆమె భావిస్తోంది. గతంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం దక్కలేదు. అయితే టెన్నిస్‌లో మరిన్ని విజయాలు సాధించాలనే సౌజన్య పట్టుదల ముందు ఇవన్నీ పెద్ద అవరోధాలు కాకపోవచ్చు.

సీనియర్‌ స్థాయిలో విజేతగా నిలవడం నా ఆత్మవిశ్వాసాన్ని ఎన్నో రెట్లు పెంచింది. తర్వాతి ఐటీఎఫ్‌ టోర్నీలలో దాని ఫలితం కూడా కనిపించింది. ఫెడ్‌ కప్‌లో చోటు దక్కడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎన్ని ఐటీఎఫ్‌ టోర్నీలు ఆడినా భారత్‌ తరఫున ఒక టీమ్‌ ఈవెంట్‌లో ఆడే అవకాశం రావడం గొప్ప విషయం. ప్రస్తుతం నా కెరీర్‌లో అత్యుత్తమ దశలో ఉన్నాను. ఇదే జోరు కొనసాగించి ర్యాంక్‌ను మెరుగుపర్చుకునేందుకు బరిలోకి దిగుతున్నా. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో బరిలోకి దిగాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను.                        
–సౌజన్య  

కార్పొరేట్‌ కంపెనీల స్పాన్సర్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. ఇంకా ఫలితం రాలేదు. ఆర్థికపరమైన అంశాల ఒత్తిడి లేకపోతే ప్లేయర్‌ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. విదేశీ టోర్నీల్లో ఆడటం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆసియా లోపలే టోర్నీలను ఎంచుకోవాల్సి వస్తోంది. యూరోపియన్‌ సర్క్యూట్‌లో ఆడగలిగితే సౌజన్య ఆట మెరుగుపడుతుంది. ఇప్పటి వరకు ఆమె ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. చిన్న చిన్న లోపాలు సరిదిద్ది మరింతగా రాటుదేల్చే ప్రయత్నంలో ఉన్నాం.
–సురేశ్‌ కృష్ణ (సౌజన్య కోచ్, భర్త)

మరిన్ని వార్తలు