హాకీ శిఖరం... అత్యున్నత పోరాటం

26 May, 2020 02:13 IST|Sakshi

భారత హాకీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా ధ్యాన్‌చందే గుర్తొస్తారు. ఈ మేజర్‌తోపాటు మన హాకీ స్వర్ణయుగంలో మరో దిగ్గజం కూడా ఉన్నారు. ఆయనే బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌. స్వతంత్ర భారతావనిలో ధ్యాన్‌చంద్‌ అంతటి మేరునగధీరుడు బల్బీర్‌. ధ్యాన్‌చంద్‌ ఎవరెస్ట్‌ అయితే... బల్బీర్‌ కూడా ఎవరెస్టే. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో ప్రత్యర్థుల ఎత్తుగడల్ని, గోల్‌పోస్ట్‌ ముందుండే దుర్భేద్యమైన గోడల్ని ఛేదించడంలో ఇద్దరూ ఇద్దరే!

బ్రిటిష్‌ ఇండియా తరఫున హాకీ సమరాల్లో ధ్యాన్‌చంద్‌ ఎలా పోరాడారో... స్వతంత్ర భారతావని తరఫున బల్బీర్‌ అలాగే పోరాడారు. ఇద్దరి సంకల్పం ఒకటే... అదే భారత విజయనాదం. వరుస ఒలింపిక్స్‌ల్లో ఈ ఇద్దరూ పతకం (స్వర్ణం) రంగుమారకుండా అలుపెరగని పోరాటం చేశారు. బల్బీర్‌ ఆటగాడిగా 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో, వైస్‌ కెప్టెన్‌గా 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో, కెప్టెన్‌గా 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. ఈ మూడు పాత్రలకు అస్త్ర సన్యాసం చేశాక మేనేజర్‌ కమ్‌ కోచ్‌ హోదాలో 1975 ప్రపంచకప్‌లో టీమిండియా విజయానికి మార్గదర్శనం కూడా చేశాడు. హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే ఏకైక టైటిల్‌. తదనంతరం భారత్‌ అటు ఒలింపిక్స్‌ పతకానికి దూరమైంది... ఇటు ప్రపంచకప్‌ టైటిల్‌ సాధన భారమైంది.

చేతల మనిషి బల్బీర్‌... 
పంజాబ్‌లోని హరిపూర్‌ ఖల్సా గ్రామంలో 1924లో జన్మిం చిన బల్బీర్‌ మృదుభాషి. మాటలు తక్కువగా చేతల్లో ఎక్కువగా తన ప్రతాపం చూపేవాడు. ఇది ఇట్టే గమనించిన ఖల్సా కోచ్‌ హర్బల్‌ సింగ్‌... బల్బీర్‌ను హాకీ వజ్రంగా సానబెట్టారు. గురువు శిక్షణలో ఆటలో ఓనమాలు నేర్చిన బల్బీర్‌ పెరిగేకొద్దీ ఎదురేలేని యోధుడిగా ఎదిగాడు. భారత హాకీ జట్టులో సెంట్రల్‌ ఫార్వర్డ్‌ మెరికగా మారాడు. స్వరాజ్య భారతావనికి ఒలింపిక్స్‌లో తొలిస్వర్ణం అందించడంలో బల్బీర్‌ సింగ్‌ కీలకపాత్ర పోషించాడు. దీంతో స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది లండన్‌ (1948)లో జరిగిన విశ్వక్రీడల్లో పసిడి భారతమైంది. మరో ఒలింపిక్స్‌ ఆడే సమయానికి ఫార్వ ర్డ్‌ లైన్‌కే వన్నె తెచ్చేంత స్థాయికి ఎదిగిపోయాడు.

ఇప్పటికీ పదిలం... ఆ రికార్డు 
అసాధారణ ఆటతీరుతో తర్వాతి ఒలింపిక్స్‌లో జట్టు వైస్‌ కెప్టెన్‌గా సెంట్రల్‌ ఫార్వర్డ్‌లో ప్రధాన ఆటగాడిగా ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేశాడు. 1952లో జరిగిన అంతిమ పోరాటంలో బల్బీర్‌ చెలరేగాడు. ఆ విశ్వక్రీడల్లో ఈ మాంత్రికుడు ఫైనల్లో తన విశ్వరూపం చూపెట్టాడు. ఆ విశ్వరూపం తాలూకూ బద్దలైన రికార్డు ఇన్నేళ్లయినా పదిలంగా ఉండటం మరో విశేషం. నెదర్లాండ్స్‌తో జరిగిన తుదిపోరులో భారత్‌ 6–1తో జయభేరి మోగించింది. ఇందులో ఒకే ఒక్క గోల్‌ ప్రత్యర్థి జట్టు చేసింది.

మరో గోల్‌ తన జట్టు చేయగా... మిగతా 5 గోల్స్‌ బల్బీర్‌ ఒక్కడే సాధించడం రికార్డు పుటల్లోకెక్కింది. 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో సారథిగా మరో స్వర్ణం అందించాడు. అలుపేలేని పోరాటంతో ఎదురులేని విజయాలందించిన బల్బీర్‌ భారత హాకీలో నిజంగా మాంత్రికుడు. మువ్వన్నెల్ని మురిపించిన ఘనాఘనుడు. ఇతని నిరుపమానమైన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడు బల్బీరే కావడం మరో విశేషం.

1975 ప్రపంచకప్‌తో (ఎడమ)

మరిన్ని వార్తలు