‘దాయాది’ని గెలిచి... ప్రపంచాన్ని జయించి...

5 May, 2020 04:31 IST|Sakshi
నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు

1975 హాకీ జగజ్జేత భారత్‌

ఫైనల్లో పాక్‌పై గెలుపు

ఏకైక టైటిల్‌ విజయంలో ధ్యాన్‌చంద్‌ తనయుడు అశోక్‌ హీరో 

హాకీలో మన గతం ఎంతో ఘనం. ప్రత్యేకించి ఒలింపిక్స్‌లో అయితే భారతే చాంపియన్‌. ఏ దేశమేగినా... ఎవరెదురైనా... ఎగిరింది మన తిరంగానే. అందుకేనేమో మిగతా జట్లు కసిదీరా ఆడినా పసిడి కోసం మాత్రం కాదు!   రజతమో లేదంటే కాంస్యమో వాళ్ల లక్ష్యం అయి ఉండేది.  సుమారు మూడున్నర దశాబ్దాల పాటు భారత్‌దే స్వర్ణయుగం. విశ్వక్రీడల్లో ఇంతటి చరిత్ర ఉన్న భారత్‌కు ప్రపంచకప్‌ మాత్రం అంతగా కలసిరాలేదు. 1975లో ఒకసారి మాత్రమే భారత్‌ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా టీమిండియా మళ్లీ ప్రపంచాన్ని గెలవలేకపోయింది.

ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ సంబరాలెన్ని ఉన్నా... ప్రపంచకప్‌లో అంతగా లేవు. ఈ వెలితి తీరేలా... ‘ప్రపంచ’ పుటలకు ఎక్కేలా భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి మరీ ‘కప్‌’ కొట్టింది. మలేసియా ఆతిథ్యమిచ్చిన మూడో మెగా ఈవెంట్‌ ఫైనల్‌ కౌలాలంపూర్‌లో జరిగింది. టోర్నీలోని హేమాహేమీ జట్లను ఓడించి భారత్, పాకిస్తాన్‌ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లకిది రెండో ప్రపంచకప్‌ ఫైనల్‌. 1971లో స్పెయిన్‌పై ఫైనల్లో నెగ్గి పాక్‌ తొలిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించగా... 1973లో నెదర్లాండ్స్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత్‌ షూటౌట్‌లో ఓటమి చవిచూసి రన్నరప్‌గా నిలిచింది. చిరకాల ప్రత్యర్థిని ఓడించడం... ప్రపంచకప్‌ సాధించడం... ఈ రెండింటిని రెండు కళ్లతో చూస్తే మాత్రం ఒత్తిడంతా భారత్‌పైనే! మరి టీమిండియా ఏం చేసింది? ఒకేసారి ఇద్దరు ప్రత్యర్థుల్ని (పాక్, ఒత్తిడి) ఎలా జయించింది?

పోరు హోరెత్తిందిలా... 
సరిగ్గా 45 ఏళ్ల క్రితం సంగతి. 1975, మార్చి 15న కౌలాలంపూర్‌లోని మెర్డెకా ఫుట్‌బాల్‌ స్టేడియం (అప్పట్లో ఆస్ట్రోటర్ఫ్‌పై కాకుండా పచ్చిక మైదానంలో హాకీ మ్యాచ్‌లను నిర్వహించేవారు). దాయాదుల ‘ప్రపంచ’ యుద్ధానికి వేదిక. సహజంగా మలేసియాలో హాకీకి క్రేజ్‌ ఎక్కువ. పైగా ప్రపంచకప్‌ ఫైనల్‌! అందుకే ఆ రోజు జరిగిన మ్యాచ్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్ల మేనేజర్లు, ప్రేక్షకులే కాదు క్షణాలు, నిమిషాలు కూడా ఎదురుచూస్తున్నాయి... తొలి పైచేయి ఎవరిదని! ఈ ఎదురుచూపుల్లోనే 16 నిమిషాలు గడిచిపోయాయి.

ఆ మరు నిమిషమే భారత రణ శిబిరాన్ని నిరాశపరిచింది. బోణీతో దాయాది దరువేసింది. పాక్‌ స్ట్రయికర్‌ మహమ్మద్‌ జాహిద్‌ షేక్‌ (17వ నిమిషంలో) సాధించిన గోల్‌తో తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత సేనపై మరింత ఒత్తిడి పెరిగింది. ఆట పాక్‌ ఆధిక్యంతోనే సాగుతూ ఉంది. భారత్‌ దాడులకు పదును పెట్టినా... ఆ ప్రయత్నాలేవీ ఫలించకుండా 43 నిమిషా ల ఆట ముగిసింది. ఆ తర్వాత నిమిషమే భారత విజయానికి తొలి అడుగు పడేలా చేసింది. డిఫెండర్, పెనాల్టీ కార్నర్‌ స్పెషలిస్ట్‌ సుర్జీత్‌ సింగ్‌ (44వ నిమిషంలో) చక్కని ఏకాగ్రతతో గోల్‌ చేశాడు.

తండ్రికి తగ్గ తనయుడు అశోక్‌... 
సుర్జీత్‌ చేసిన ఒకే ఒక్క గోల్‌తో భారత్‌ మూడడుగులు ముందుకేసింది. స్కోరు 1–1తో సమమైంది. ఒత్తిడి తగ్గింది. టైటిల్‌పై కన్ను పడింది. సరిగ్గా ఏడు నిమిషాల వ్యవధిలోనే దీనికి సంబంధించిన సానుకూలత ఫీల్డ్‌లో కనిపించింది. ఒకప్పుడు భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ ఒలింపిక్స్‌ స్వర్ణాలను సాకారం చేస్తే... ఈసారి ఆయన తనయుడు అశోక్‌ కుమార్‌ (51వ నిమిషంలో) ప్రపంచకప్‌ టైటిల్‌ను ఖాయం చేసే గోల్‌ సాధించి పెట్టాడు. కానీ ఈ గోల్‌పై పాక్‌ వివాదం రేపినా... బంతి నిబంధనల ప్రకారం గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిందని రిఫరీ పాక్‌ అప్పీల్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆధిక్యం 2–1కు చేరిన ఈ దశలో భారత్‌ కట్టుదిట్టంగా ఆడింది. రక్షణ పంక్తి పాక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిరోధించింది. మిగిలున్న నిమిషాలన్నీ పాక్‌ను ముంచేయగా... భారత్‌ తొలిసారి విజేతగా నిలిచింది.

ఆ మురిపెమే... ఇప్పటికీ అపురూపం 
తొలి ప్రపంచకప్‌ (1971)లో భారత్‌ కాంస్యంతో పతకాల బోణీ చేసింది. రెండో ఈవెంట్‌ (1973)లో రజతం గెలిచింది. మూడో ప్రయత్నంలో పసిడి నెగ్గింది. ఇలా వరుసగా మూడు ప్రపంచకప్‌లలో 3, 2, 1 స్థానాలకు ఎగబాకిన భారత్‌ చిత్రంగా... ఆ తర్వాత ప్ర‘గతి’ మార్చుకుంది. పతకానికి దూరమైంది. 1975 మెగా ఈవెంట్‌ తర్వాత 11 సార్లు ప్రపంచకప్‌ టోర్నీలు జరిగినా... ఇందులో మూడుసార్లు (1982, 2010, 2018లలో) ఈ మెగా ఈవెంట్‌కు భారత్‌ ఆతిథ్యమిచ్చినా సెమీఫైనల్‌ చేరలేకపోయింది. 

మరిన్ని వార్తలు