ప్రపంచకప్‌ కాని ప్రపంచకప్‌

3 Jun, 2020 00:04 IST|Sakshi

1985లో భారత్‌ చిరస్మరణీయ వన్డే విజయం

‘వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌’ గెలుచుకున్న గావస్కర్‌ బృందం

ఆస్ట్రేలియా గడ్డపై మధుర జ్ఞాపకం

భారత క్రికెట్‌ జట్టు 1983లో ప్రపంచకప్‌ గెలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తడమే కాదు మన దేశంలో ఆటకు ఒక కొత్త ఊపు తెచ్చింది. ఈ అద్భుత విజయం తర్వాత రెండేళ్లలోపే మన జట్టు మరో గొప్ప గెలుపుతో సత్తా చాటింది. వరల్డ్‌కప్‌లో ఎనిమిది జట్లు పాల్గొనగా... జింబాబ్వే మినహా మిగిలిన ఏడు టెస్టు హోదా దేశాలతో ప్రపంచకప్‌కు ఏమాత్రం తగ్గని రీతిలో, అదనపు హంగూ ఆర్భాటాలతో నిర్వహించిన మెగా టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై ‘వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌’ పేరుతో జరిగిన ఈ టోర్నీలో సునీల్‌ గావస్కర్‌ సారథ్యంలోని టీమిండియా ఒక్క ఓటమి లేకుండా అజేయంగా టైటిల్‌ అందుకోవడం విశేషం. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి అందుకున్న ఈ ట్రోఫీ విజయానికి భారత జట్టు ఘనతల్లో ప్రత్యేక స్థానం ఉంది.

ఆస్ట్రేలియా గడ్డపై యూరోపియన్లు స్థిరపడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ప్రత్యేకంగా ఈ టోర్నీని ప్రకటించింది. ఏడు టెస్టు దేశాలను ఆహ్వానించింది. 22 రోజుల వ్యవధిలో 13 మ్యాచ్‌లు జరిగాయి. జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. టాప్‌–2 టీమ్‌లు సెమీస్‌లో తలపడ్డాయి. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ను ప్రపంచకప్‌కంటే ఆకర్షణీయంగా మార్చేందుకు ఆసీస్‌ బోర్డు అన్ని ప్రయత్నాలు చేసింది. రంగు రంగుల దుస్తులు, తెలుపు బంతులతో నిర్వహించిన మొదటి టోర్నీ ఇదే కావడం విశేషం. ప్రతిష్టాత్మక మెల్‌బోర్న్‌ మైదానంలో (ఎంసీజీ)లో ఫ్లడ్‌ లైట్ల వెలుగులో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు జరపడం కొత్త అనుభూతినిచ్చింది. ప్రపంచ చాంపియనే అయినా భారత జట్టుపై పెద్దగా అంచనాలేమీ లేవు. అంతకుముందు జరిగిన మూడు వరుస వన్డే సిరీస్‌లలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌ల చేతుల్లో భారత్‌ చిత్తుగా ఓడటమే అందుకు కారణం. 1983 ప్రపంచకప్‌తో పోలిస్తే నాయకత్వ మార్పు భారత జట్టులో ప్రధాన తేడా. నాడు కపిల్‌దేవ్‌ సారథిగా ఉండగా, ఈసారి మరో దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.  

అజేయ ప్రదర్శన... 
లీగ్‌ దశలో ఆడిన 3 మ్యాచ్‌లలో కూడా భారత్‌ అద్భుత విజయాలు సాధించింది. పటిష్ట ప్రత్యర్థులపై ఏమాత్రం తడబాటు లేకుండా ఏకపక్షంగా గెలవడం జట్టు సామర్థ్యాన్ని చూపిస్తుంది. పాకిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో, ఇంగ్లండ్‌పై 86 పరుగుల తేడాతో, ఆస్ట్రేలియాపై 8 వికెట్లతో భారత్‌ గెలిచింది. ఓటమి లేకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించిన భారత్‌కు అక్కడ న్యూజిలాండ్‌ ఎదురైంది. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ముందుగా కివీస్‌ 50 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌట్‌ కాగా, భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 44.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మరో సెమీస్‌లో వెస్టిండీస్‌పై 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి పాకిస్తాన్‌ ఫైనల్‌ చేరింది.

అసలు పోరు... 
మార్చి 10, 1985... భారత్, పాకిస్తాన్‌ మధ్య తుది సమరానికి ఎంసీజీ సన్నద్ధమైంది. ఇరు దేశాల మధ్య ఉండే పోటీ తీవ్రత, టోర్నీ స్థాయి దృష్ట్యా సహజంగానే మ్యాచ్‌పై అందరి ఆసక్తి నెలకొంది. చివరకు భారత్‌ బౌలింగ్‌ ముందు పాక్‌ తలవంచక తప్పలేదు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులే చేయగలిగింది. జావేద్‌ మియాందాద్‌ (48), ఇమ్రాన్‌ ఖాన్‌ (35) మాత్రమే ఫర్వాలేదనిపించారు. కపిల్‌ దేవ్, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్‌ 47.1 ఓవర్లలో 2 వికెట్లకు 177 పరుగులు చేసి 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు కృష్ణమాచారి శ్రీకాంత్‌ (67), రవిశాస్త్రి (63 నాటౌట్‌) తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి గెలుపును సులువు చేశారు. భారత్‌ సంబరాల్లో మునిగిపోగా... ఈ టోర్నీ తర్వాత తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ముందే ప్రకటించిన సునీల్‌ గావస్కర్‌ చిరస్మరణీయ విజయంతో నాయకత్వానికి వీడ్కోలు పలికాడు.

విజేతగా నిలిచిన నాటి జట్టులో సభ్యులు 
సునీల్‌ గావస్కర్‌ (కెప్టెన్‌), కపిల్‌దేవ్, శ్రీకాంత్, దిలీప్‌ వెంగ్‌సర్కార్, మొహిందర్‌ అమర్‌నాథ్, రవిశాస్త్రి, రోజర్‌ బిన్నీ, మదన్‌లాల్, అజహరుద్దీన్, శివరామకృష్ణన్, సదానంద్‌ విశ్వనాథ్‌ (వికెట్‌కీపర్‌), చేతన్‌ శర్మ, అశోక్‌ మల్హోత్రా, మనోజ్‌ ప్రభాకర్‌.

రవిశాస్త్రి స్పెషల్‌...

టోర్నీ టాప్‌ స్కోరర్లుగా శ్రీకాంత్‌ (238), అజహరుద్దీన్‌ (187)... అత్యధిక వికెట్లు (10) తీసిన బౌలర్‌గా శివరామకృష్ణన్‌ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించినా, ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అసలు హీరో మాత్రం రవిశాస్త్రినే. బ్యాటింగ్‌లో 3 అర్ధ సెంచరీలు సహా 182 పరుగులు చేయడంతోపాటు 8 వికెట్లు తీసి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. ‘చాంపియన్‌ ఆఫ్‌ చాంపియన్స్‌’గా అభివర్ణిస్తూ ప్రతిష్టాత్మక ‘అడి’ కారును బహుమతిగా అందుకున్న అతడి కెరీర్‌ ఈ టోర్నీ తర్వాత ఒక్కసారిగా దూసుకుపోయింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా