మద్రాసులో ‘టై’తక్కలాట... 

20 May, 2020 00:04 IST|Sakshi
మణీందర్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాక ఆసీస్‌ ఆటగాళ్ల సంబరం

సమంగా ముగిసిన భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు

చెన్నైలో చరిత్రాత్మక మ్యాచ్‌

అద్భుత విజయాలు, ఏకపక్ష ఫలితాలు... అసాధారణ పోరాటాలు, పస లేని ‘డ్రా’లు... 2384 టెస్టు మ్యాచ్‌ల చరిత్రలో ఎన్నో విశేషాలు జరిగాయి. కానీ రెండు టెస్టు మ్యాచ్‌లకు మాత్రం క్రికెట్‌ పుస్తకంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో ఇరు జట్ల మొత్తం స్కోర్లు సమమై అసాధారణ రీతిలో ‘టై’గా నిలిచాయి. ఇందులో 1960లో బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య మొదటిది కాగా, రెండో దాంట్లో భారత జట్టు భాగంగా ఉంది. మద్రాసులో 1986లో భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు ‘టై’ అయి చరిత్రకెక్కింది.

ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా 1986 సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు మద్రాసులోని చిదంబరం స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్‌ జరిగింది. భారత్‌లో ఏ విదేశీ జట్టుకైనా టెస్టు సిరీస్‌లు పెద్ద సవాలే. ఒకవైపు కొద్ది రోజుల క్రితమే ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించి భారత్‌ అమితోత్సాహంతో ఉండగా... మరోవైపు చాపెల్, రాడ్‌ మార్‌‡్ష, లిల్లీ వంటి దిగ్గజాల రిటైర్మెంట్‌తో బలహీనపడిన ఆసీస్‌ ఈ సిరీస్‌కు వచ్చింది. అసాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత, తీవ్ర ఉక్కపోతతో చెన్నపట్నం ఉడికిపోతున్న వేళ ఈ మ్యాచ్‌ జరిగింది. భారత క్రికెటర్లే తీవ్రంగా ఇబ్బంది పడగా... ఆసీస్‌ ఆటగాళ్ల గురించి చెప్పేదేముంది.

జోన్స్‌ హీరోచితం... 
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. డీన్‌ జోన్స్‌ (క్రీజులో 502 నిమిషాలు; 330 బంతుల్లో 210; 27 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత డబుల్‌ సెంచరీతోపాటు డేవిడ్‌ బూన్‌ (332 నిమిషాలు; 258 బంతుల్లో 122; 21 ఫోర్లు), కెప్టెన్‌ అలన్‌ బోర్డర్‌ (255 నిమిషాలు; 172 బంతుల్లో 106; 14 ఫోర్లు, సిక్స్‌) శతకాలు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌ను ఆ జట్టు 7 వికెట్లకు 574 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 397 పరుగులకు ఆలౌటై 177 పరుగుల భారీ ఆధిక్యం కోల్పోయింది. కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ (214 నిమిషాలు; 138 బంతుల్లో 119; 21 ఫోర్లు) వీరోచిత సెంచరీతో జట్టును ఫాలోఆన్‌ నుంచి తప్పించగా... రవిశాస్త్రి (106 బంతుల్లో 62; 8 ఫోర్లు, సిక్స్‌), అజహరుద్దీన్‌ (64 బంతుల్లో 50; 8 ఫోర్లు), కృష్ణమాచారి శ్రీకాంత్‌ (62 బంతుల్లో 53; 9 ఫోర్లు, సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు.

హోరాహోరీ... 
ఆసీస్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 170 పరుగులు చేసింది. చివరి రోజు ఇరు జట్లు కొద్దిసేపు ఆడుకున్నా మ్యాచ్‌ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. అయితే బోర్డర్‌ భిన్నంగా ఆలోచించాడు. మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాలని భావించి ఓవర్‌నైట్‌ స్కోరు వద్దే డిక్లేర్‌ చేశాడు. దాంతో భారత్‌కు 87 ఓవర్లలో 348 పరుగుల లక్ష్యం ఎదురైంది. మామూలుగానైతే ఇది చాలా కష్టసాధ్యమైన లక్ష్యం కాబట్టి భారత్‌ జాగ్రత్తగా ఆడుకుంటే టెస్టు ‘డ్రా’ కావడం ఖాయం. అయితే టీమ్‌లో ప్రతీ ఒక్కరు విజయం కోసం ప్రయత్నించాలని, దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నారు. సునీల్‌ గావస్కర్‌ (168 బంతుల్లో 90; 12 ఫోర్లు, సిక్స్‌), మొహిందర్‌ అమర్‌నాథ్‌ (113 బంతుల్లో 51; 8 ఫోర్లు), అజహరుద్దీన్‌ (77 బంతుల్లో 42; 3 ఫోర్లు, సిక్స్‌), శ్రీకాంత్‌ (49 బంతుల్లో 39; 6 ఫోర్లు), చంద్రకాంత్‌ పండిత్‌ (37 బంతుల్లో 39; 5 ఫోర్లు) తలా ఓ చేయి వేశారు. ఒకదశలో 5 వికెట్లకు 291 స్కోరుతో జట్టు సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే తక్కువ వ్యవధిలో 4 వికెట్లు పడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఆసీస్‌కు అనుకూలంగా మారిపోయింది. అయితే రవిశాస్త్రి (40 బంతుల్లో 48 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో జట్టును గెలుపు వరకు తీసుకొచ్చాడు.

చివరి ఓవర్‌ డ్రామా...
ఆఫ్‌ స్పిన్నర్‌ గ్రెగ్‌ మాథ్యూస్‌ వేసిన ఆఖరి ఓవర్లో విజయం కోసం 4 పరుగులు కావాలి. అప్పటికే జోరు మీదున్న రవిశాస్త్రి క్రీజ్‌లో ఉండగా, నాన్‌స్ట్రయికర్‌ స్థానంలో స్పిన్నర్‌ మణీందర్‌ సింగ్‌ నిలబడ్డాడు. తొలి బంతిని డిఫెన్స్‌ ఆడిన రవిశాస్త్రి రెండో బంతిని స్క్వేర్‌లెగ్‌ వైపు ఆడాడు. స్టీవ్‌ వా ఫీల్డింగ్‌ వైఫల్యంతో రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతికి సింగిల్‌ తీయడంతో స్కోర్లు సమం కావడంతో పాటు మణీందర్‌ సింగ్‌కు స్ట్రయికింగ్‌ లభించింది. నిజానికి రవిశాస్త్రి ఉన్న ఫామ్‌కు ఆ సింగిల్‌ తీయకుండా మిగతా బంతులు తానే ఆడి మ్యాచ్‌ ముగిస్తే బాగుండేదని అంతా భావించారు. కానీ ఎందుకో శాస్త్రి అలా చేయలేదు. మణీందర్‌ మూడు బంతులు సమర్థంగా ఎదుర్కొంటే మ్యాచ్‌ ‘డ్రా’ అవుతుంది. సింగిల్‌ తీస్తే భారత్‌ గెలుస్తుంది. తొలి బంతిని ఎలాగోలా ఆడిన అతను తర్వాతి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి ప్యాడ్లను తాకడమే ఆలస్యం... అంపైర్‌ విక్రమ్‌ రాజు వేలెత్తేశాడు.

నిజానికి ఆసీస్‌ కూడా గట్టిగా అప్పీల్‌ చేయలేదు. ఇదేంటి ఇలా అంటూ మణీందర్‌ అసహనం ప్రదర్శించాడు కానీ అప్పటికే ఆట ముగిసిపోయింది. బంతి తన బ్యాట్‌కు తాకిందని అతను నమ్మాడు. ఆస్ట్రేలియా జట్టు తాము గెలిచామని భావించి సంబరాల్లో మునిగింది. కాస్త తేరుకున్న తర్వాత టెస్టు ‘టై’గా ముగిసిందని వారికి అర్థమైంది. భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 86.5 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. ఇరు జట్ల ఆటగాళ్లతోపాటు వివాదాస్పద రీతిలో అంపైర్‌ విక్రమ్‌ రాజు కూడా చరిత్రలో నిలిచిపోయాడు. అయితే బంతికి, బ్యాట్‌కు మధ్య చాలా దూరం ఉందనేది స్పష్టంగా చూశానని, మణీందర్‌ వికెట్లకు అడ్డంగా నిలబడ్డాడు కాబట్టి ఇప్పటికీ కూడా తాను సరైన నిర్ణయమే ఇచ్చానని ఆయన చెబుతుంటారు.

మరిన్ని వార్తలు