పోలియోను గెలిచి... ఒలింపిక్ వరకు పరుగు

5 Jun, 2020 00:04 IST|Sakshi

స్ఫూర్తిదాయకం విల్మా రుడాల్ఫ్‌ ప్రస్థానం

1960 ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు సాధించిన అథ్లెట్‌

నల్ల జాతి అమెరికన్లకు స్ఫూర్తిగా నిలిచిన మహిళ

పసితనంలోనే ఆమెకు పోలియో సోకింది. ఇక నడవడం కష్టమే అని డాక్టర్లు తేల్చేశారు. ఆపై మశూచి మహమ్మారి కూడా ఆమెను వదల్లేదు. ఇక కోలుకున్నట్లుగా అనిపించిన సమయంలో న్యుమోనియా దాడి చేసింది. ఒకదశలో బతకడం కూడా కష్టమని అనిపించింది. పదేళ్లు వయసు కూడా దాటక ముందే ఇలాంటి గండాలను ఎదుర్కొనే పిల్లల భవిష్యత్తు సాధారణంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా 22 మంది పిల్లల కుటుంబంలో ఆమె 20వ సంతానం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వారిపై ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. కానీ విల్మా రుడాల్ఫ్‌ విధిని ఎదిరించింది. కష్టాలను అధిగమించి ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలిచింది. నల్ల జాతీయుల ప్రతినిధిగా వారికి స్ఫూర్తిగా నిలిచింది.

పరుగు, పరుగు, పరుగు... విల్మా గ్లాడియాన్‌ రుడాల్ఫ్‌ జీవితకాలం ఇష్టపడిన మంత్రం! కొత్తగా రెక్కలొచ్చిన పక్షికి ఎగరాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో బహుశా అదే ఆమెకు స్ఫూర్తినందించి ఉండవచ్చు. ఎందుకంటే పోలియో బారిన పడిన తర్వాత నడవలేనేమో అనుకున్న దశ నుంచి ఆమె కొంత కోలుకుంది. అయితే ఎడమ కాలు బాగా బలహీనంగా మారిపోయింది. కానీ సుదీర్ఘ చికిత్స తర్వాత 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆమె పాదాల్లో చురుకుదనం వచ్చింది. అంతే...ఆ తర్వాత నడకే కాదు పరుగునే విల్మా ప్రాణంగా మార్చుకుంది.

కోచ్‌ దృష్టిలో పడి... 
పాఠశాల స్థాయిలో విల్మా బాస్కెట్‌బాల్‌ ఆడేది. ఆమె చురుకుదనం, వేగంతో స్కూల్‌ టీమ్‌కు పలు విజయాలు అందించింది. అదే సమయంలో విల్మాపై స్థానిక టెన్నెసీ యూనివర్సిటీ అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎండ్‌ టెంపుల్‌ దృష్టి పడింది. ఆమెలోని సహజ అథ్లెట్‌ నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్‌... తమ వేసవి శిబిరంలో చేరాల్సిందిగా సూచించాడు. అక్కడి క్యాంప్‌లో భాగమైన తర్వాత విల్మా పరుగు మరింత మెరుగైంది. ఇదే జోరులో ప్రతిష్టాత్మక అమెచ్యూర్‌ అథ్లెటిక్‌ యూనియన్‌ నిర్వహించిన ట్రాక్‌ మీట్‌లో పాల్గొన్న ఈ అమ్మాయి తాను పాల్గొన్న 9 ఈవెంట్లలో కూడా విజేతగా నిలిచింది. ఆ తర్వాత విల్మా రుడాల్ఫ్‌ అథ్లెటిక్స్‌ కెరీర్‌ అమిత వేగంగా దూసుకుపోయింది. పోలియో నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఆమె అంతర్జాతీయస్థాయిలో పోటీ పడే అథ్లెట్‌గా ఎదగడం విశేషం.

ఒలింపిక్‌ విజేతగా... 
విల్మా స్కూల్‌ చదువు కూడా పూర్తి కాక ముందే 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌ కోసం అథ్లెటిక్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ జరిగాయి. 16 ఏళ్ల విల్మా ఇందులో పాల్గొని సత్తా చాటింది. 200 మీటర్ల పరుగులో పోటీ పడేందుకు జట్టులోకి ఎంపికై, మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న యూఎస్‌ జట్టులో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 200 మీటర్ల పరుగులో హీట్స్‌లోనే విఫలమై వెనుదిరిగినా... రిలే రూపంలో ఆమెకు మరో అవకాశం దక్కింది. అమెరికా మహిళల 4్ఠ100 మీటర్ల రిలే టీమ్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. ఇందులో భాగంగా ఉన్న విల్మా ఖాతాలో తొలి ఒలింపిక్‌ పతకం చేరింది.

బంగారు బాల... 
విల్మా కెరీర్‌ మరో నాలుగేళ్ల తర్వాత శిఖరానికి చేరింది. మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌ అనుభవంతో ఆమె తర్వాతి ఒలింపిక్స్‌కు మరింత పట్టుదలగా, కఠోర శ్రమతో సిద్ధమైంది. దాని ఫలితమే 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు. 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగులో వ్యక్తిగత స్వర్ణాలు గెలుచుకున్న ఈ స్ప్రింటర్‌ 4్ఠ100 మీటర్ల రిలేలో ఈసారి తన పతకం రంగు మార్చుకుంది. విల్మా సభ్యురాలిగా ఉన్న జట్టు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు నెగ్గిన తొలి అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో తొలిసారి ఇదే మెగా ఈవెంట్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీల ప్రత్యక్ష ప్రసారం జరిగింది. దాంతో ఒక్కసారిగా విల్మా పేరు మారుమోగిపోయి స్టార్‌గా మారిపోయింది. అన్ని దేశాలు ఆమె వేగాన్ని ప్రశంసిస్తూ ‘టోర్నడో’... ‘ఫ్లాష్‌’... ‘ట్రాక్‌ స్టార్‌’... ‘ద బ్లాక్‌ పెర్ల్‌’ అంటూ వేర్వేరు ఉపమానాలతో విల్మాను ఆకాశానికెత్తేశాయి.

22 ఏళ్లకే ముగించి... 
రోమ్‌ ఒలింపిక్స్‌ తర్వాత కూడా అనేక మంది మిత్రులు, సన్నిహితుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పలు ఈవెంట్లలో విల్మా పాల్గొంది. కానీ తన కోసం ఎలాంటి ప్రత్యేక లక్ష్యాలను పెట్టుకోలేదు. ‘నేను వచ్చే ఒలింపిక్స్‌లో మరో రెండు స్వర్ణాలు నెగ్గినా ఇంకా ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. నేను సాధించింది చాలు. ఇక పరుగు ఆపడమే మంచిది’ అంటూ కెరీర్‌ అత్యుత్తమ దశలో ఉండగా 22 ఏళ్లకే ట్రాక్‌కు రిటైర్మెంట్‌ చెప్పేసింది. అందుకే 1964 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె పాల్గొనలేదు. ఆట ముగించగానే తన చదువుపై దృష్టి పెట్టి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఆపై పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమైంది. ముఖ్యంగా నల్ల జాతి అమెరికన్స్‌ పౌర హక్కులు, మహిళల హక్కుల కోసం ఆమె పోరాడింది. చిన్నప్పటి వైకల్యాలను అధిగమించి ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలిచిన విల్మా జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు