బంతులే బుల్లెట్‌లుగా మారి...

24 May, 2020 00:00 IST|Sakshi

తీవ్ర వివాదం రేపిన ఇంగ్లండ్‌ బాడీలైన్‌ బౌలింగ్‌

ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ శరీరమే లక్ష్యంగా బంతులు

1932–33 యాషెస్‌ సిరీస్‌లో ఘటన

డాన్‌ బ్రాడ్‌మన్‌ స్థాయి బ్యాట్స్‌మన్‌ను నిలువరించాలంటే ఏం చేయాలి? యాషెస్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టులో వ్యూహరచన జరుగుతోంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ ఏకంగా 974 పరుగులతో చెలరేగాడు. పైగా రాబోయే మ్యాచ్‌లు జరిగేది ఆస్ట్రేలియా గడ్డపైనే. మళ్లీ ఓటమిని ఆహ్వానించాల్సిందే అనుకుంటున్న తరుణంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ డగ్లస్‌ జార్డయిన్‌ మదిలో ఒక ఆలోచన వచ్చింది. అతను తన ఆలోచనను చెప్పి అందరితో ఒప్పించాడు. చివరకు ఆ సిరీస్‌ అత్యంత వివాదాస్పదంగా నిలిచేందుకు ఆ నిర్ణయం కారణమైంది. అదే బాడీలైన్‌ బౌలింగ్‌. బంతులను బ్యాట్స్‌మెన్‌ శరీరానికి గురి పెట్టి గాయపర్చడమే లక్ష్యంగా సాగిన సిరీస్‌ చివరకు ఇంగ్లండ్‌కు కావాల్సిన ఫలితాన్ని అందించింది.

అంతకుముందు సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ అద్భుతంగా ఆడినా... లెగ్‌సైడ్‌ బంతులను ఆడటంలో అతను కొంత ఇబ్బంది పడినట్లు, శరీరంపైకి దూసుకొస్తే ఆడలేకపోయినట్లు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు గుర్తించారు. తమ ప్రణాళికను అమలు చేసేందుకు కచ్చితత్వం, అమిత వేగంతో బౌలింగ్‌ చేసే బౌలర్లను జార్డయిన్‌ ఎంచుకున్నాడు. వారిలో ముఖ్యంగా లార్‌వుడ్‌ తమ వ్యూహం ప్రకారం చెలరేగి కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెట్టాడు.  

ఇలా అమలైంది... 
ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు మామూలుగానే సాగాయి. బాడీలైన్‌ వాడకుండానే ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌ నెగ్గింది (బోర్డుతో గొడవల కారణంగా బ్రాడ్‌మన్‌ ఈ టెస్టు ఆడలేదు). పునరాగమనం చేసిన బ్రాడ్‌మన్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో తర్వాతి టెస్టును గెలిపించి సిరీస్‌ను 1–1తో నిలిపాడు. అసలు సమరం అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులో మొదలైంది. సాధారణంగా బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌లో నిలబడే చోట లెగ్‌స్టంప్‌ పైకి ఇంగ్లండ్‌ బౌలర్లు అమిత వేగంగా బంతులు విసిరారు.

లార్‌వుడ్‌ అయితే నిరంతరాయంగా వంద మైళ్ల వేగంతో బౌలింగ్‌ చేసినట్లు చెబుతారు. శరీరంపైకి దూసుకొచ్చే వీటిని ఆడాలంటే బ్యాట్స్‌మెన్‌కు అగ్ని పరీక్షే. ఆఫ్‌సైడ్‌ వైపు జరిగితే స్టంప్స్‌ లేచిపోతాయి. తప్పించుకునేందుకు వంగినా, కదలకుండా ఆగిపోయినా తీవ్రంగా గాయపడక తప్పదు. సాహసించి షాట్‌ ఆడితే ఆన్‌సైడ్‌లో ఉండే ఫీల్డర్‌ చేతుల్లో బంతి పడుతుంది. అప్పుడు లెగ్‌ సైడ్‌ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి ఏకంగా 9 మంది ఫీల్డర్లను కూడా అటువైపే నిలబెట్టి ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బౌలింగ్‌ చేశారు.

గాయాల గేయాలు...
ప్రధానంగా బ్రాడ్‌మన్‌ను అవుట్‌ చేయడమే ఇంగ్లండ్‌ లక్ష్యమైనా... ఇతర ప్రధాన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ బిల్‌ వుడ్‌ఫిల్, పాన్స్‌ఫోర్డ్, అలన్‌ కిపాన్స్‌ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లండ్‌ నుంచి వచ్చిన ఈ అనూహ్య వ్యూహరచనకు వారి వద్ద సమాధానం లేకపోయింది. గాయాల నుంచి తప్పించుకోగలిగినా బ్రాడ్‌మన్‌ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఛాతీకి కాస్త పైన తగిలిన దెబ్బతో బిల్‌ వుడ్‌ఫిల్‌ విలవిల్లాడిపోయాడు. బెర్డ్‌ ఓల్డ్‌ఫీల్డ్‌ తల పగిలింది.   ఇక తప్పనిసరిగా వైద్య చికిత్స అవసరమైన బ్యాట్స్‌మెన్‌ జాబితా పెద్దదే.  వీరితో పాటు బయటకు చెప్పని, కనిపించని గాయాలు ఎన్నో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో ఓర్చుకున్నారు.

ముదిరిన వివాదం...
ఇంగ్లండ్‌ వ్యవహారంపై ఆస్ట్రేలియా బోర్డు తీవ్రంగా మండిపడింది. క్రికెట్‌ నియమాలను రూపొందించే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)కి ఫిర్యాదు చేయగా... మేం అంతా చూస్తున్నాం అంటూనే లెగ్‌ సైడ్‌ బౌలింగ్‌ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని ఎంసీసీ తేల్చింది. దాంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను రద్దు చేయాలని భావించినా... ఆర్థికపరంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఆగిపోయింది. రెండు దేశాల అధినేతలు కూడా కల్పించుకోవాల్సి రావడం ఈ సిరీస్‌ వివాద స్థాయి ఏమిటో చూపిస్తుంది. ఎలాగైతేనేం ఇంగ్లండ్‌ అనుకున్న ఫలితం సాధించింది. బాడీలైన్‌ ప్రయోగించిన మూడు, నాలుగు, ఐదో టెస్టులను వరుసగా నెగ్గి సిరీస్‌ను 4–1తో గెలుచుకుంది.

బ్రాడ్‌మన్‌ను 56.57 సగటుతో 396 పరుగులకే ఆపగలగడం ఇంగ్లండ్‌ సాధించిన మరో విజయం. ఇక ఆస్ట్రేలియాకు ప్రాణాంతకంగా పరిణమించిన లార్‌వుడ్‌ కేవలం 19.31 సగటుతో ఏకంగా 33 వికెట్లు పడగొట్టి విజయగర్వాన్ని ప్రదర్శించాడు. అయితే క్రికెట్‌ చరిత్రలో మాత్రం జార్డయిన్‌ రూపొందించిన వ్యూహం అత్యంత వివాదాస్పదంగా నిలిచిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఐసీసీ లెగ్‌సైడ్‌ వెనుకవైపు గరిష్టంగా ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉండేలా నిబంధనలు రూపొందించడంతో ఈ తరహా బౌలింగ్‌ మళ్లీ కనిపించలేదు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు