గ‘ఘన్‌’ విజయం

7 Jun, 2020 00:17 IST|Sakshi

మూడో ప్రయత్నంలో ఒలింపిక్‌ పతకం సాధించిన గగన్‌ నారంగ్‌

2012 లండన్‌ క్రీడల్లో దక్కిన ఘనత

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో కాంస్యం

‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారు 80 శాతం మంది ఆటగాళ్లు తమ తొలి ఒలింపిక్స్‌లోనే పతకాలు గెలుచుకుంటారు’... షూటర్‌ గగన్‌ నారంగ్‌తో అతని కోచ్‌ చెప్పిన మాట ఇది. ఈ వ్యాఖ్య గగన్‌ ఆత్మ స్థైర్యాన్ని కొంత దెబ్బ తీసింది. ఎందుకంటే అప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నా అతనికి పతకం దక్కలేదు. దీనికి తోడు 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో తన కేటగిరీనే అయిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో అభినవ్‌ బింద్రా సాధించిన స్వర్ణంతో అంచనాలు, ఒత్తిడి కూడా పెరిగాయి. ఇలాంటి స్థితి నుంచి అతను మరో ఒలింపిక్స్‌ కోసం తుపాకీ ఎక్కుపెట్టాడు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు తన స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో గగన్‌ సాధించిన కాంస్యంతోనే భారత్‌ పతకాల బోణీ కొట్టింది.

గగన్‌ నారంగ్‌కు అంతర్జాతీయ విజయాలు కొత్త కాదు. అప్పటికే ప్రపంచ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో సాధించిన ఎన్నో పతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. అయినా సరే ఏదో వెలితి...! ప్రతీ క్రీడాకారుడు కలలుగనే ఒలింపిక్‌ మెడల్‌ మాత్రం అతని దరి చేరలేదు. సుదీర్ఘ కెరీర్‌లో పలు ఘనతల తర్వాత కూడా అది మాత్రం సాధించలేకపోయాననే భావం అతడిని వెంటాడుతూనే ఉంది. ఏథెన్స్‌లో త్రుటిలో ఆ అవకాశం పోయింది, బీజింగ్‌కు వచ్చేసరికి క్వాలిఫయింగ్‌లోనే ఆట ముగిసింది. కానీ లండన్‌లో మాత్రం ఈ హైదరాబాద్‌ షూటర్‌ గన్‌ గురి తప్పలేదు.

అంచనాలు లేకుండా... 
2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే నాటికి గగన్‌ నారంగ్‌ చెప్పుకోదగ్గ విజయాలేమీ సాధించలేదు. సొంత నగరంలో హైదరాబాద్‌లోనే జరిగిన ఆఫ్రో ఏషియన్‌ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నా... వాస్తవంగా ఆ పతకానికి అంత విలువేమీ లేదు. అందుకే 21 ఏళ్ల వయసులో ఒలింపిక్స్‌కు వెళ్లిన గగన్‌పై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే గగన్‌ గట్టిగానే పోరాడాడు. 47 మంది షూటర్లు పాల్గొన్న 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో 593 పాయింట్లతో 12వ స్థానంతో అతను సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పదును పెరిగినా... 
ఏథెన్స్‌ వైఫల్యం గగన్‌ను పెద్దగా కుంగదీయలేదు. మరింత పట్టుదలతో తన సత్తా చాటేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వరుసగా పాల్గొన్న ప్రతీ ఈవెంట్‌లోనూ పతకం సాధిస్తూ వచ్చాడు. 2005 కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు, ఒక కాంస్యంతో ఇది మొదలై ఆ తర్వాత 2006లో గ్వాంగ్‌జౌలో జరిగిన వరల్డ్‌ కప్‌లో స్వర్ణం వరకు సాగింది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌ కామన్వెల్త్‌ క్రీడలు వచ్చాయి. ఇక్కడ ఏకంగా 4 స్వర్ణాలతో తన జోరు కొనసాగించిన గగన్‌ ఏడాది చివర్లో జరిగిన దోహా ఆసియా క్రీడల్లో 3 కాంస్యాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ఫామ్‌ చూస్తే 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పతకం ఖాయమనిపించింది. కానీ చివరకు అసలు వేదికపై అతను చేతులెత్తేశాడు. ఈసారి క్వాలిఫయింగ్‌లో 9వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు త్రుటిలో అర్హత కోల్పోయాడు. 600కుగాను ఐదుగురు షూటర్లు 595 పాయింట్లు స్కోర్‌ చేయగా... కౌంట్‌బ్యాక్‌లో దురదృష్టవశాత్తూ గగన్‌ 0.1 పాయింట్‌ తేడాతో ఫైనల్‌ చేరే అవకాశం చేజార్చుకున్నాడు. తన 42వ షాట్‌లో అతను 8.9 పాయింట్లు సాధించగా, మరో షూటర్‌ 9 పాయింట్లు స్కోరు చేసి ముందంజ వేశాడు.

పతక సమయం...
బీజింగ్‌ పరాజయం షాక్‌ నుంచి కోలుకునేందుకు గగన్‌కు చాలా సమయం పట్టింది. కొద్ది రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదు. పడుకున్నా నిద్రలోనూ అవే పీడ కలలు. దాంతో కొంత కాలం గన్‌ను పక్కన పడేశాడు. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సహకారంతో మళ్లీ ప్రాక్టీస్‌ మొదలు పెట్టాడు. కొన్నాళ్లకి జరిగిన ప్రపంచకప్‌లో 703.5 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం అతనికి కావాల్సిన స్ఫూర్తిని అందించింది. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌లో తన ప్రధాన ఈవెంట్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌తో పాటు వేర్వేరు ఈవెంట్లలో కలిపి ఏకంగా 6 స్వర్ణాలు, 2 రజతాలు సాధించాడు. ఆపై ఢిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో 4 స్వర్ణాలు, గ్వాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో 2 రజతాలు అతనికి మళ్లీ జోష్‌ను అందించాయి.

దీనికి తోడు ప్రతిష్టాత్మక వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యంతో గగన్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. చివరకు ఇదే లండన్‌ ఒలింపిక్స్‌లో కనిపించింది. ఈసారి వచ్చిన అవకాశాన్ని అతను వదిలి పెట్టలేదు. పాత చేదు అనుభవాలను పక్కన పెట్టి పూర్తి ఏకాగ్రతతో తన లక్ష్యంపైనే గురి పెట్టాడు. క్వాలిఫయింగ్‌లోనే మెరుగైన ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఫైనల్‌లో సరైన దిశలో అతని గన్‌ పేలింది. ఓవరాల్‌గా 701.1 పాయింట్లతో కాంస్యం సొంతమైంది. బహుమతి ప్రదానోత్సవ సమయంలో ఎగురుతున్న భారత జెండాను చూసిన నారంగ్‌ హృదయం ఆనందంతో ఉప్పొంగింది.

మరిన్ని వార్తలు