బుల్లెట్‌ దిగినా... స్టిక్‌ వదల్లేదు

9 Jun, 2020 00:07 IST|Sakshi

భారత హాకీ స్టార్‌ సందీప్‌ సింగ్‌ స్ఫూర్తిదాయక ప్రస్థానం

2006లో రైఫిల్‌ గాయంతో వీల్‌చైర్‌కే పరిమితం

రెండేళ్లపాటు కష్టపడి మళ్లీ మైదానంలోకి

కెరీర్‌ ముగిశాక క్రీడా మంత్రిగా కొత్త పాత్ర

హాకీలో అనూహ్యంగా దూసుకొచ్చిన సందీప్‌ సింగ్‌ ఆటపై ధ్యాసతోనే పయనిస్తున్నాడు. హాకీలో మెరుపులు మెరిపిస్తున్న పిన్న వయస్కుడిగా ఘనత కూడా వహించాడు. అతనికి హాకీ స్టిక్‌ ప్రాణమైంది. ఆటే లోకమైంది. కానీ అంతలోనే ప్రాణం మీదికి తెచ్చింది. తుపాకీ మిస్‌ఫైర్‌తో బుల్లెట్‌ సందీప్‌ వెన్నులోకి దిగింది. ఆట కాదు కదా నడకే కష్టమన్నారు. మంచమే దిక్కన్నారు. అదేంటో మంచం దిగాడు. మైదానంలోకీ అడుగు పెట్టాడు. నడక కాదు మైదానంలో గోల్స్‌ కోసం పరుగు పెట్టాడు. అంతం కావాల్సిన కెరీర్‌ను సందీప్‌ సంచలనంగా మలచుకున్నాడు.

భారత హాకీలో డ్రాగ్‌ ఫ్లికర్‌ మెరికగా, పెనాల్టీ కార్నర్‌ స్పెషలిస్ట్‌గా ఎదిగిన సందీప్‌ నిజానికి తనంతట తానుగా హాకీకి ఆకర్షితుడు కాలేదు. సోదరుడు బిక్రమ్‌జీత్‌ సింగ్‌ వద్ద ఉండే హాకీ కిట్, బూట్లు చూసి అసూయతోనే ఇటువైపు మళ్లాడు. దాంతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా సందీప్‌ సింగ్‌ హాకీ స్టిక్‌ పట్టేలా చేసింది. ఈ విషయాన్ని అతని తల్లి దల్జీత్‌ కౌర్‌ ఓ సందర్భంలో చెప్పింది! అమ్మా... నాకు కిట్లు, బూట్లు కావాలని సందీప్‌ అడిగితే... ఆడితేనే నీకూ కొనిస్తామని ఆమె బదులిచ్చింది. అలా మొదట కిట్‌ చేతికి అందుకున్నాడు. మెల్లిగా మైదానం బాట పట్టాడు. వెంటనే యూత్‌ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆ వెంటే జూనియర్‌... తర్వాత భారత సీనియర్‌ జట్టుకు అమాంతం ఎదిగిపోయాడు. అచిరకాలంలోనే తన చురుకుదనం, అంకితభావంతో ఆటలో ఒదిగిపోయాడు. ఇదంతా కూడా రెండు, మూడేళ్లలోనే జరిగిపోవడం విశేషం.

2003లో టీమ్‌ జెర్సీ...
హాకీలో ఓనమాలు నేర్చుకున్నంత సులభంగా గోల్స్‌ చేయడం కూడా నేర్చుకోవడంతో టీనేజ్‌లోనే సందీప్‌ సెలక్టర్ల కంటబడ్డాడు. అలా 2003లో 17 ఏళ్ల సందీప్‌ సింగ్‌ భారత జూనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. కరాచీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో అతని దూకుడు హాకీ వర్గాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా డజను (12) గోల్స్‌ చేసిన ఈ పెనాల్టీ కార్నర్‌ స్పెషలిస్ట్‌ భారత్‌కు తొలి జూనియర్‌ ప్రపంచకప్‌ విజయాన్ని రుచి చూపించాడు. వెంటనే సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఆలస్యం చేయకుండా ఈ హరియాణా కుర్రాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది. అలా 18 ఏళ్ల వయసులో 2004లో సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్, అదే ఏడాది ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో ఆడటం ద్వారా సీనియర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పిన్న వయస్కుడిగా ఘనతకెక్కాడు.

బుల్లెట్‌ మంచాన పడేసినా... 
నిండా 20 ఏళ్లకు ముందే భారత హాకీ జట్టులో కీలక ఆటగాడయ్యాడు సందీప్‌. ఇక ఈ ఆరడుగుల బుల్లెట్‌ కెరీర్‌ నల్లేరుమీద నడకలా సాగిపోతుందనుకుంటే అనుకోని ఉపద్రవం మిస్‌ఫైర్‌ రూపంలో ప్రాణంమీదికి తెచ్చింది. 2006 ప్రపంచకప్‌ (జర్మనీ)కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఓ ‘బుల్లెట్‌’ అతని వెన్నులోకి దూసుకెళ్లింది. జట్టుతో కలిసేందుకు సహచరుడు రాజ్‌పాల్‌తో కలిసి రైలులో వెళుతుండగా... రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) పోలీస్‌ అధికారి పొరపాటు వల్ల అతని రైఫిల్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. అదికాస్తా సందీప్‌ దిగువ వెన్నెముకను చిదిమేసింది. దీంతో అతని తొలి ప్రపంచకప్‌ కలతో పాటు కెరీర్, జీవితం అన్ని మూలనపడ్డాయి. ఊపిరే కష్టమంటే... చివరకు కొన్ని రోజులు కోమాలో, ఇంకొన్ని రోజులు పక్షవాతానికి గురైన అతన్ని డాక్టర్లు నడవలేడని తేల్చేశారు.

పట్టుదలతో... 
ప్రాణాపాయమైతే తప్పింది కానీ...ఊపిరి ఉన్నంతవరకు మంచమే దిక్కని డాక్టర్లు చెప్పారు. దీంతో జర్మనీలో మైదానంలో ప్రత్యర్థులతో తలపడాల్సిన సందీప్‌... ఇంట్లో మంచంపై ఒంటరితనంతో పోరాడాల్సి వచ్చింది. ప్రతికూల ఆలోచనలతో తల్లడిల్లిపోయేవాడు. కానీ అతనిలోని నేర్పరితనం... ఆటలో అలవడిన సుగుణం... వేగంగా ఎదిగేలా చేసిన వైనం... ఇవన్నీ అతని గాయన్ని మాన్పించాయి. మళ్లీ ఆడాలన్న పట్టుదల తిరిగి హాకీ స్టిక్‌ను పట్టించింది. రెండంటే రెండేళ్లలోనే మైదానంలోకి దిగేలా చేసింది.

ఒలింపిక్స్‌కు నడిపించాడు...
ఇక సందీప్‌ నడవలేడన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా అతను భారత జట్టునే ఒలింపిక్స్‌కు నడిపించాడు. ఇలా అతని ఆట, ఒలింపిక్స్‌ బాట సంచలనంగా మారిపోయింది. 2008లో అజ్లాన్‌ షా కప్‌లో ఆడాడు. ఆడటమే కాదు తొమ్మిది గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో 12 ఏళ్ల తర్వాత భారత్‌ను విజేతగా నిలిపిన ఘనత కచ్చితంగా సందీప్‌దే. భారత కెప్టెన్‌గా పలు టోర్నీల్లో విజయవంతమైన ఈ డ్రాగ్‌ఫ్లికర్‌... భారత్‌ను 2012 లండన్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేలా కీలకమైన గోల్స్‌ చేశాడు. ఈ మెగా టోర్నీ కోసం ఫ్రాన్స్‌తో జరిగిన ఆఖరి క్వాలిఫయర్‌ పోరులో భారత్‌ 9–1తో ఏకపక్ష విజయం సాధించింది.

ఇందులో సందీప్‌ సింగ్‌ ఏకంగా ఐదు గోల్స్‌ చేయడం గమనార్హం. కెరీర్‌ మొత్తంలో వందకంటే ఎక్కువ గోల్స్‌ చేసిన సందీప్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత హాకీ ఇండియా లీగ్‌లో ముంబై మెజీషియన్స్, పంజాబ్‌ వారియర్స్, రాంచీ రేస్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సందీప్‌ సింగ్‌ కెరీర్‌పై 2018లో బాలీవుడ్‌లో ‘సూర్మా’ పేరుతో సినిమా కూడా నిర్మించారు. హరియాణా పోలీసు విభాగంలో ఐదేళ్లపాటు డీఎస్పీగా పనిచేసిన 34 ఏళ్ల సందీప్‌ గతేడాది రాజకీయాల్లోకి వచ్చాడు. బీజేపీ తరఫున హరియాణాలోని పెహోవా నియోజకవర్గం నుంచి పోటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం రాష్ట్ర మంత్రి వర్గంలో క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా