మహాబలుడు

30 May, 2020 00:06 IST|Sakshi

మైక్‌ టైసన్‌ సృష్టించిన ప్రభంజనం

20 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌గా గుర్తింపు

అతను పిడికిలి బిగిస్తే చాలు ప్రత్యర్థి గుండెల్లో దడ మొదలవుతుంది. రింగ్‌లోకి దిగిన తర్వాత అతని రౌద్ర రూపాన్ని చూస్తే ఇక తప్పుకోవడమే మేలనిపిస్తుంది. తొలి పంచ్‌ పడక ముందే ఓటమికి సిద్ధమైపోయినట్లుగా అనిపిస్తుంది. మెరుపులు, పిడుగుల్లాంటి పిడిగుద్దులతో అతను చెలరేగుతుంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది. ఇంతటి పవర్‌ ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యపోయింది. నాటి దిగ్గజం మొహమ్మద్‌ అలీ తర్వాత ఆ స్థాయిలో ఒక తరం మొత్తాన్ని తన పంచ్‌లతో ఊపేసిన వ్యక్తి మైక్‌ టైసన్‌. ఒక దశలో బాక్సింగ్‌ అంటే టైసన్‌ మాత్రమే అన్నంతగా అతని పేరుప్రఖ్యాతులు మోగిపోయాయి. సీరియస్‌గా అయినా, సరదాగా అయినా కాస్త దుందుడుకు స్వభావంతో ఎవరైనా కనిపిస్తే చాలు... ఏరా టైసన్‌ అనుకుంటున్నావా అనడం జనం పరిభాషలో సాధారణంగా మారిపోయింది. అతి పిన్న వయసులో ప్రతిష్టాత్మక వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌గా టైసన్‌ నిలిచిన క్షణం బాక్సింగ్‌ చరిత్రలో ఎంతో ప్రత్యేకం.

అమెరికాలోని బ్రూక్లిన్‌లో నేరగాళ్లు ఎక్కువగా ఉండే బ్రౌన్స్‌విలే ప్రాంతంలో పుట్టి పెరిగిన మైక్‌ టైసన్‌ ‘స్ట్రీట్‌ ఫైటర్‌’గా అప్పటికే తన పంచ్‌లతో ఎంతో మంది పని పట్టాడు. చివరకు ఇది పెద్ద సమస్యగా మారి జైలు తరహాలో ఉండే సంరక్షణ కేంద్రానికి పంపాల్సి వచ్చింది. అతడిలో మార్పు తెచ్చే క్రమంలో ఒక కౌన్సిలర్‌ టైసన్‌కు బాక్సింగ్‌ నేర్పించాడు. అయితే ఇది టైసన్‌ దృష్టిలో ‘చేపకు, నీటికి మధ్య ఉన్న అనుబంధం’ తరహాలో మారిపోయింది. దాంతో తన పట్టుదల, క్రమశిక్షణ, కఠోర శ్రమతో అతను పూర్తి స్థాయిలో బాక్సింగ్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత బాక్సింగ్‌ మేనేజర్‌ డి అమాటో పర్యవేక్షణలో టైసన్‌ దూసుకుపోయాడు. అమెచ్యూర్‌ పోటీల్లో వరుస విజయాల తర్వాత 18 ఏళ్ల వయసుకే ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ బరిలోకి దిగి హేమాహేమీలను గడగడలాడించాడు.

ఆ క్షణం వచ్చేసింది... 

తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ తొలి ఏడాది 1985లో టైసన్‌ 15 బౌట్‌లలో పాల్గొంటే అన్నీ నాకౌట్‌ విజయాలే. తర్వాతి ఏడాది కూడా అదే జోరు కొనసాగింది. వరుసగా మరో 12 బౌట్లు గెలిచిన టైసన్‌ తన రికార్డును 27–0కు పెంచుకున్నాడు. అప్పటికే ఈ మహాబలుడి గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇంత చిన్న వయసులో అతని అద్భుత బాక్సింగ్‌ ప్రదర్శనకు అంతా అచ్చెరు వొందారు. పంచ్‌లలో పదును, వేగంతో కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థులపై నిర్దయగా టైసన్‌ విరుచుకుపడుతున్న తీరు కూడా భవిష్యత్తులో అతను ఎంత పెద్ద స్థాయికి చేరుకోగలడో అంతా ఊహిస్తూనే ఉన్నారు.

అలాంటి అంచనాల మధ్య వరల్డ్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూబీసీ) నేతృత్వంలో హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ చాంపియన్‌ ట్రెవర్‌ బెర్బిక్‌ (జమైకా)తో తలపడే అవకాశం వచ్చింది. విన్‌చెస్టర్‌లోని లాస్‌వెగాస్‌ హిల్టన్‌ వేదికగా 12 రౌండ్ల పోరుకు రంగం సిద్ధమైంది. అయితే టైసన్‌ భీకర ప్రదర్శన ముందు బెర్బిక్‌ నిలవలేకపోయాడు. కేవలం రెండో రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. 2 నిమిషాల 35 సెకన్లలోనే బౌట్‌ ఫినిష్‌ చేసి టైసన్‌ రింగ్‌లోనే గర్జించాడు. కేవలం 20 ఏళ్ల 145 రోజుల వయసులో వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌గా నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు.

తిరుగులేని విజయాల తర్వాత... 
ఈ గెలుపు తర్వాత టైసన్‌ను నిలువరించడం ఎవ్వరి తరం కాలేదు. ఆ తర్వాత ‘హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ సిరీస్‌’ పేరుతో మూడు వేర్వేరు హెవీ వెయిట్‌ కేటగిరీలతో ‘అన్‌ డిస్‌ప్యూటెడ్‌ చాంపియన్‌’ అంటూ పోటీలు నిర్వహించారు. డబ్ల్యూబీసీతో పాటు డబ్ల్యూబీఏ, ఐబీఎఫ్‌ ఏర్పాటు చేసిన బౌట్‌లలో విజేతగా నిలిచి మూడు టైటిల్స్‌ను ఒకేసారి తన ఖాతాలో వేసుకొని టైసన్‌ తనకు ఎదురు లేదని చాటి చెప్పాడు. ఈ ఘనత సాధించిన ఏౖకైక బాక్సర్‌ టైసన్‌ ఒక్కడే కావడం విశేషం. ఈ క్రమంలో వరుసగా తొమ్మిది బౌట్‌లలో తనకు సవాల్‌ విసిరిన వారందరినీ అతను మట్టికరిపిస్తూ హెవీ వెయిట్‌ టైటిల్స్‌ను నిలబెట్టుకున్నాడు. ఎట్టకేలకు 1990 ఫిబ్రవరిలో ఈ అద్భుతానికి విరామం వచ్చింది.

37–0తో అప్రతిహతంగా దూసుకుపోయిన టైసన్‌కు జేమ్స్‌ బస్టర్‌ డగ్లస్‌ రూపంలో తొలి ముప్పు ఎదురైంది. 12 రౌండ్ల పోరులో 10వ రౌండ్‌ వరకు పోరాడి టైసన్‌ తలవంచాడు. తన మూడు హెవీ వెయిట్‌ టైటిల్స్‌ను చేజార్చుకున్నాడు. 54 ఏళ్ల వయసులో టైసన్‌ మళ్లీ రింగ్‌లోకి దిగాలని భావిస్తున్నాడు. ఇటీవల తన ఫిట్‌నెస్‌ వీడియోలను పెట్టి ‘ఐయామ్‌ బ్యాక్‌’ అంటూ టైసన్‌ వ్యాఖ్య పెట్టాడు. వివిధ సహాయ కార్యక్రమాల కోసం టైసన్‌ ఎగ్జిబిషన్‌ బౌట్‌లలో పాల్గొనే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం హాంకాంగ్‌కు చెందిన ఒక సినిమాలో నటించిన టైసన్‌... ప్రస్తుతం యువ రెజ్లర్లను ప్రమోట్‌ చేస్తూ ప్రఖ్యాత రెజ్లింగ్‌ ఈవెంట్‌ ‘డబుల్‌ ఆర్‌ నథింగ్‌’తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.   

పతనం వైపు సాగి...

వ్యక్తిగత సమస్యలు, రేప్‌ కేసులో మూడేళ్ల జైలు శిక్ష, ప్రమోటర్లతో విభేదాలు... ఇలా ఎన్నో దెబ్బలు తిన్న టైసన్‌ ఆ తర్వాత తన ప్రాభవం కోల్పోయాడు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత మళ్లీ డబ్ల్యూబీఏ టైటిల్‌ గెలుచుకున్నా... అతనిలో అంతటి ఊపు కనిపించలేదు. కొద్ది రోజులకే అదీ పోయింది. బౌట్‌లో హోలీఫీల్డ్‌ చెవి కొరికి మరో వివాదం కొనితెచ్చుకున్నాడు. చిన్నాచితకా బాక్సర్ల  చేతుల్లో ఓడి వరుసగా ఓడిపోగా... ఆ తర్వాత కేవలం డబ్బుల కోసమే ఆడిన బౌట్‌లు కూడా ఉన్నాయి. చివరకు 50–6 గెలుపోటముల రికార్డు (44 నాకౌట్‌లు)తో టైసన్‌ ప్రొఫెషనల్‌ కెరీర్‌ ముగిసింది. అయితే అతను బాక్సింగ్‌పై వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోనిది.

మరిన్ని వార్తలు