రెక్కలు తొడిగి... రివ్వున దూసుకెళ్లి

29 Feb, 2020 03:03 IST|Sakshi

అసమానం శిఖా పాండే ప్రస్థానం

ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషిస్తున్న భారత పేస్‌ బౌలర్‌

ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్‌ లెఫ్ట్‌నెంట్‌ హోదా

అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచే కెరీర్‌

చిన్నప్పుడు ఆ అమ్మాయి క్రికెటర్‌ కావాలనుకుంది... మామూలుగా క్రికెట్‌ ఆడటమే కాదు దేశానికే ప్రాతినిధ్యం వహించింది...ఆమెను ఇంజనీర్‌గా చూడాలని అమ్మానాన్న అనుకున్నారు... సీరియస్‌గా చదువుపై దృష్టి పెట్టి ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆ అమ్మాయి తల్లిదండ్రులకిచ్చిన మాటను నిలబెట్టుకుంది... ఎప్పటికైనా ఎయిర్‌ఫోర్స్‌లో పని చేయాలనేది ఆమె కల... అర్హత పరీక్షలో సత్తా చాటి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా ఎంపికైంది... ఒకే అమ్మాయిలో ఇన్ని విభిన్న కోణాలు కలగలిస్తే ఆమె శిఖా పాండే అవుతుంది. ప్రస్తుతం టి20 ప్రపంచకప్‌లో భారత్‌ వరుస విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న పేస్‌ బౌలర్‌. ప్రపంచ కప్‌ గెలిచిన జట్టులో భాగం కావాలనేది శిఖా బలమైన కోరిక. 2017 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తన రనౌట్‌తోనే ఆమె కల చెదిరింది. ఈ సారైనా అది నెరవేరుతుందా అనేది ఆసక్తికరం.

(సాక్షి క్రీడా విభాగం): ప్రొఫెషనల్‌గా ఆటలో సత్తా చాటుతూ మరో వైపు సమాంతరంగా ఉన్నత చదువులను కొనసాగించేవారు క్రికెట్‌ ప్రపంచంలో అతి తక్కువ మంది కనిపిస్తారు. అనిల్‌ కుంబ్లే, అశ్విన్, అంజుమ్‌ చోప్రాలాంటి వారు కూడా ఇంజినీరింగ్‌లు చదివినా దానిని పేరుకు, డిగ్రీ పట్టా అందుకోవడం వరకే పరిమితం చేశారు. మరో వైపు ఆటగాళ్లకు ప్రోత్సాహంగా కొన్ని సంస్థలు ఇచ్చే మేనేజర్‌ తరహా ఉద్యోగాలు కూడా ఉంటాయి. కానీ భారత మహిళా క్రికెటర్‌ శిఖా సుభాశ్‌ పాండే మాత్రం వీటికి భిన్నం. తన సామర్థ్యానికి తగినట్లుగా పోటీల్లో నిలిచి తాను అనుకున్న ఉద్యోగంలో చేరింది. ఒక వైపు క్రికెటర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఎయిర్‌పోర్ట్‌లో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆసక్తి, ప్రతిభ ఉంటే ఎన్ని విజయాలైనా సాధించవచ్చని చేతల్లో చూపించిన శిఖా కెరీర్‌ ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిదాయకం.

జూనియర్‌ క్రికెట్‌ నుంచి... 
శిఖా క్రికెట్‌ కెరీర్‌ గోవాలో మొదలైంది. గల్లీల్లో కుర్రాళ్లతో కలిసి ఆడిన ఆమె స్కూల్‌ క్రికెట్‌లో సత్తా చాటడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో అండర్‌–17, అండర్‌–19 స్థాయిలో వరుసగా మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. అప్పుడప్పుడే ఎదుగుతున్న గోవా క్రికెట్‌లో పెద్దగా పోటీ కూడా లేని సమయం కావడంతో వేగంగా దూసుకుపోవడం సులువైంది. అదే సమయంలో బీసీసీఐ కూడా మహిళా క్రికెట్‌ను గుర్తించడంతో శిఖా ప్రదర్శన అందరి  దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఉమెన్‌ చాలెంజర్‌ టోర్నీ, సౌత్‌జోన్‌ అండర్‌–19 జట్లలో అవకాశాలు దక్కాయి.

అనంతరం గోవా సీనియర్‌ టి20 టీమ్‌లో వచ్చేందుకు కూడా ఎక్కువ సమయం పట్టలేదు. 2011లో భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌ జట్టుతో టూర్‌ మ్యాచ్‌ ఆడిన భారత ‘ఎ’ జట్టులో, ఇంగ్లండ్‌పై ఆడిన బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టులో కూడా చోటు దక్కింది. వరుస వికెట్లతో శిఖా ఈ పోటీల్లో సత్తా చాటింది. ఆపై భారత జట్టులో స్థానం లభించడం లాంఛనమే అయింది. గోవా తరఫున భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా పాండే అరుదైన ఘనత అందుకుంది. ప్రధానంగా పేస్‌ బౌలరే అయినా...లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడుతూ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

చదువులో తగ్గకుండా...

ఆటలో ఎదగాలనుకునేవారికి అందరికంటే ముందుగా కోచ్‌లు, సన్నిహితులు చెప్పే మాట ఒకటే. రెండు పడవల ప్రయాణం మంచిది కాదని, ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలని సూచిస్తుంటారు. కానీ శిఖా అలా అనుకోలేదు. ఆటలో పడి చదువును ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు. స్కూల్‌నుంచి కాలేజీ వరకు మంచి మార్కులతో నంబర్‌వన్‌గా ఉంటూ తనపై నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చింది. అప్లయిడ్‌ మ్యాథమెటిక్స్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం. తల్లిదండ్రుల కిచ్చిన మాట ప్రకారం గోవా కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌నుంచి  ‘ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌’లో పట్టా అందుకుంది. ఆ అర్హతతో పలు పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైనా... క్రికెట్‌లో ముందుకు వెళ్లటమే లక్ష్యంగా పెట్టుకుంది. 2011లో ఎయిర్‌ఫోర్స్‌లోకి ఎంపికైన శిఖా ఏడాది శిక్షణ అనంతరం ఫ్లయింగ్‌ ఏటీసీ ఆఫీసర్‌గా నియమితురాలైంది. అటు క్రికెట్‌ ఆడుతూ, ఇటు సీరియస్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆమె తన కెరీర్‌ను కొనసాగించిన తీరు నిజంగా అద్భుతం. గత టి20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో చోటు కోల్పోయినా...పట్టుదలతో పోరాడి తిరిగొచ్చిన శిఖా పునరాగమనంలో మరింత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొడుతోంది.

కరీంనగర్‌ నుంచి... 
శిఖా తండ్రి సుభాశ్‌ పాండే కేంద్రీయ విద్యాలయ(కేవీ) పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో పని చేసిన ఆయన చివరకు గోవాలో స్థిరపడ్డారు. గతంలో తెలంగాణలోని రామగుండంలో ఆయన పని చేశారు. అదే సమయంలో శిఖా కరీంనగర్‌లోనే పుట్టింది. కేవీ కారణంగానే స్పోర్ట్స్‌పై ఆమెకు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలోని పాలమ్‌ విమానాశ్రయంలో ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 31 ఏళ్ల  శిఖాను పేస్‌ బౌలర్‌గా, యార్కర్‌ స్పెషలిస్టుగా తీర్చిదిద్దడంలో భారత మాజీ పేసర్‌ సుబ్రతో బెనర్జీ కీలక పాత్ర పోషించారు.

మరిన్ని వార్తలు