ఆసీస్‌ దాసోహం వెనుక!

9 Jan, 2019 00:04 IST|Sakshi

బ్యాట్స్‌మెన్‌ దారుణ వైఫల్యం

పేసర్ల ప్రతాపం శూన్యం

స్పిన్నర్‌ను దెబ్బకొట్టిన టీమిండియా  

సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియా నుంచి అదీ దాని సొంతగడ్డపై ఏమాత్రం ఊహించని స్థాయి ఆట ఇది. స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ లేకపోవడంతో బ్యాటింగ్‌ బాగా బలహీనపడిందని అంతా అనుకున్నదే. అయితే, అనుభవజ్ఞులైన ఉస్మాన్‌ ఖాజా, షాన్‌ మార్‌‡్ష ఆ లోటును కొంతైనా భర్తీ చేస్తారని భావించారు. ఇదేమీ జరగకపోగా, అనూహ్యంగా బౌలింగ్‌లోనూ కంగారూలు తేలిపోయారు. ప్రధాన పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌ తీవ్రంగా విఫలమయ్యాడు. హాజల్‌వుడ్డూ అతడికి తోడయ్యాడు. కాస్తోకూస్తో కమిన్సే నయమనిపించాడు. సహజంగా తమ ఆటగాళ్లను వెనుకేసుకొచ్చే ఆస్ట్రేలియా సీనియర్లకూ ఈ ప్రదర్శనతో చిర్రెత్తినట్లుంది. దీంతో తక్షణమే జట్టులోంచి కొందరిని తీసేయాలంటూ సూచించారు. టెస్టు టెస్టుకూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్, బౌలర్ల సత్తా తగ్గిపోవడంతో భారత్‌ పని సులువైపోయింది. సిరీస్‌ కోహ్లి సేన వశమైంది. 

అతడు నిలవలేదు... 
‘కోహ్లికి దీటుగా పరుగులు సాధిస్తాడు...’ ఈ సిరీస్‌కు ముందు ఉస్మాన్‌ ఖాజాపై ఉన్న అంచనా ఇది. అక్టోబరులో దుబాయ్‌లో పాకిస్తాన్‌పై రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో టెస్టును కాపాడిన ఖాజా ఫామ్‌ను చూస్తే ఈ అంచనాలో తప్పేం లేదనిపించింది. కానీ, వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్లు ఫించ్, హారిస్‌లకు అనుభవం లేనందున, జట్టులో సీనియర్‌గా, కీలకమైన వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా ఖాజా బాధ్యత రెట్టింపైంది. అయితే, అతడు 8 ఇన్నింగ్స్‌లలో ఒక్కటే అర్ధ సెంచరీతో 198 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మొత్తం స్కోరును టీమిండియా వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా అటు ఇటుగా సిడ్నీ టెస్టులో (193)నే చేయడం గమనార్హం. ఇక్కడే రెండు జట్ల మధ్య తేడా తెలిసిపోతోంది. ఇక షాన్‌ మార్‌‡్ష చేసినవి 183 పరుగులే. ఇందులో ఒక్క అర్ధశతకమూ లేదు. ట్రావిస్‌ హెడ్, హ్యాండ్స్‌కోంబ్, ఫించ్‌ల ఇన్నింగ్స్‌లు జట్టుకు ఏమాత్రం ఉపయోగ పడలేకపోయా యి. వీరికంటే, కొత్తవాడైనా హారిసే నయం అనిపించాడు. పైన్‌ బ్యాటింగ్‌ సామర్థ్యం అంతంతే కావడం, మిషెల్‌ మార్‌‡్ష వంటి ఆల్‌రౌండర్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోవడం ఆసీస్‌ వనరులను పరిమితం చేశాయి. వీరంతా రాణించి ఉంటే లోయరార్డర్‌లోనూ ఆత్మవిశ్వాసం పెంచి ఉండేవారు. కానీ, అదేమీ జరగలేదు. మొత్తమ్మీద 8 అర్ధ శతకాలు చేసి నా, ఎవరి నుంచి సెంచరీ నమోదు కాకపోవడంతో ఆసీస్‌ పోరాడగలిగే స్కోర్లూ చేయలేకపోయింది.  

పదును లేక పస తగ్గింది... 
బ్యాటింగ్‌లో జట్టు వైఫల్యం ఆసీస్‌ పేసర్లపైనా ప్రభావం చూపినట్లుంది. స్టార్క్‌ తీరు చూస్తే ఇది వాస్తవమేనన్నట్లుంది. గతేడాది ప్రారంభంలో డర్బన్‌ టెస్టులో 109 పరుగులకే 9 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను పరాజయం పాల్జేసిన స్టార్క్‌... తాజాగా భారత్‌తో ఆడిన స్టార్క్‌ ఒక్కడేనా అన్నట్లుగా సాగింది అతడి బౌలింగ్‌. పేస్‌ ఉన్నా, అందులో పదును లేకపోవడంతో అతడి బౌలింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడలేదు. తొలి రెండు టెస్టులు ఫర్వాలేదనేలా సాగినప్పటికీ తర్వాతర్వాత మరీ పేలవంగా బౌలింగ్‌ చేశాడు. దీంతో చివరి టెస్టులో పైన్‌... స్టార్క్‌ను కాదని పార్ట్‌ టైమర్‌ ఖాజాకు బంతినిచ్చాడు. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో షార్ట్‌ బంతులతో మయాంక్, పుజారాలను ఇబ్బంది పెట్టడం, రహానేను అద్భుత బౌన్సర్‌తో ఔట్‌ చేయడం, 150 కి.మీ. వేగం నమోదు మినహా సిరీస్‌లో స్టార్క్‌ ప్రభావం శూన్యం. మొత్తమ్మీద 13 వికెట్లే పడగొట్టగలిగాడు. చిత్రంగా ఇదే టెస్టులో వందకుపైగా పరుగులిచ్చిన అతడు ఓ దశలో 25 ఓవర్లు వేసినా, అందులో ఒక్క మెయిడెనూ లేకపోయింది. 2018 పూర్తవకుండానే 200 వికెట్ల మైలురాయిని అందుకుంటాడని అంతా భావిస్తే... 2019 వచ్చినా 199 వికెట్ల వద్దే ఆగిపోయాడు. ఏమాత్రం ప్రభావం చూపకపోయినా మరో పేసర్‌ హాజల్‌వుడ్‌ను కొనసాగించి ఆసీస్‌ తప్పు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌కు ఇతడి నుంచి ఇబ్బందులు తప్పవని సిరీస్‌ ప్రారంభానికి ముందు ఊహాగానాలు వచ్చాయి. అయితే, హాజల్‌వుడ్‌ ఏ దశలోనూ ప్రమాదకారిగా కనిపించలేదు. సరికదా... పేలవ ప్రదర్శనలో స్టార్క్‌తో పోటీపడి 13 వికెట్లే తీయగలిగాడు.  

► సిరీస్‌లో కంగారూల తరఫున కమిన్స్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (6/27) నమోదు చేసినప్పటికీ అది మెల్‌బోర్న్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అవసరం లేని సందర్భంలో వచ్చినదే. ఇక అడిలైడ్, పెర్త్‌లో ఏకంగా 16 వికెట్లు నేలకూల్చిన ఆఫ్‌ స్పిన్నర్‌ లయన్‌ను మూడో టెస్టు నుంచి మన ఆటగాళ్లు అటు వ్యూహాత్మకంగా, ఇటు ఎదురుదాడితో దెబ్బకొట్టి ఆసీస్‌ బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించారు.   

►79 తాజాగా ముగిసిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరిది. సిడ్నీ టెస్టులో ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌ చేశాడివి.గత వందేళ్లలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులతో కూడిన సిరీస్‌లలో ఓ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ చేసిన ‘అతి తక్కువ అత్యధిక వ్యక్తిగత’ స్కోరు ఇదే.

►27.90 సిరీస్‌లో ఆస్ట్రేలియా టాప్‌–6 బ్యాట్స్‌మెన్‌ ఉమ్మడి సగటు ఇది. స్వదేశంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌లో గత వందేళ్లలో ఇది వారి మూడో    అత్యల్ప సగటు.

►30.90 కంగారూ ముగ్గురు పేసర్ల సంయుక్త బౌలింగ్‌ సగటు ఇది. వ్యక్తిగతంగా చూస్తే ఇందులో స్టార్క్‌ సగటు (34.53) మరీ ఘోరం. సొంతగడ్డపై అతడికిది మూడో దారుణ ప్రదర్శన. హాజల్‌వుడ్‌ (30.61)ది స్వదేశంలో రెండో చెత్త గణాంకం.  

►1 నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌ బౌలర్లు ఒక్కటంటే ఒక్కటే ఎల్బీడబ్ల్యూ చేయగలిగారు. మూడో టెస్టులో స్పిన్నర్‌ లయన్‌... రహానేను ఈ విధంగా ఔట్‌ చేశాడు. ముగ్గురు పేసర్లు ఒక్కరిని కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకోలేకపోయారు. దీంతో వికెట్‌ లక్ష్యంగా కాకుండా బంతులేస్తున్నారంటూ ఓ దశలో కంగారూ బౌలింగ్‌ ప్రమాణాలపై చర్చ జరిగింది.  

మరిన్ని వార్తలు