బాటిల్‌ మూత... దగ్గు బిళ్ల...!

27 Mar, 2018 00:53 IST|Sakshi

కాదేదీ ట్యాంపరింగ్‌కు అనర్హం! 

వేర్వేరు తరహాలో చేసిన మోసాలు 

ట్యాంపరింగ్‌ చేయాలంటే కాస్త కొత్తగా ఏదైనా ఆలోచించాలమ్మా అనుకున్నారేమో... స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అడ్‌హెసివ్‌ టేపును వాడుకున్నారు. అయితే ఇన్నేళ్లలో బంతిని దెబ్బ తీసేందుకు ‘రొటీన్‌కు భిన్నం’గా ప్రయత్నించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వీటిని చూస్తే ఇలా కూడా బంతి ఆకారాన్ని మార్చవచ్చా అనే సందేహం మీకు రావచ్చు. ట్యాంపరింగ్‌ చరిత్రలో కొన్ని ఆసక్తికర అంశాలను చూస్తే...     
–సాక్షి క్రీడావిభాగం  

►జాన్‌ లేవర్‌ (వ్యాజ్‌లీన్‌): భారత గడ్డపై 1976–77లో జరిగిన సిరీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లను కూడా ఇంగ్లండ్‌ గెలుచుకుంది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ లేవర్‌ వ్యాజ్‌లీన్‌ ద్వారా ఒక వైపు బంతి మెరుపును పెంచేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. లేవర్‌ పదే పదే బంతిని తన నుదుటికి రాయడాన్ని భారత జట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది. తాను చెమట మాత్రమే తుడుచుకున్నానని అతను చెప్పినా... బంతిని పరిశీలించగా దానికి వ్యాజ్‌లీన్‌ రాసి ఉన్నట్లుగా బయటపడింది. అయితే లేవర్‌ కావాలని చేశాడా... లేక అంతకు ముందు చెమట నుంచి తప్పించుకునేందుకు ఫిజియో ఇచ్చిన వ్యాజ్‌లీన్‌ టేప్‌లను నుదుటిపై పెట్టుకోవడం వల్ల జరిగిందా అనేది తేలలేదు.  

►షాహిద్‌ ఆఫ్రిది (దంతాలు): ట్యాంపరింగ్‌లో ఇదో సంచలనం. 2010లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన వన్డేలో కెప్టెన్‌గా ఉన్న ఆఫ్రిది బంతిని పళ్లతో గట్టిగా కొరుకుతూ కనిపించాడు. ముందుగా తప్పు అంగీకరించని ఆఫ్రిది... ఆ తర్వాత మ్యాచ్‌ గెలిచేందుకు చేసిన పనని ఒప్పుకున్నాడు. అతనిపై రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల నిషేధం పడింది.  

►రాహుల్‌ ద్రవిడ్‌ (దగ్గు బిళ్ల): 2004లో బ్రిస్బేన్‌లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. సాధారణంగా మనకు మార్కెట్లో దొరికే హాల్స్, స్ట్రెప్సిల్స్‌ తరహా ట్యాబ్లెట్‌తో బంతిని రుద్దడం కెమెరాల్లో కనిపించింది. దాంతో మ్యాచ్‌ రిఫరీ క్లైవ్‌ లాయిడ్‌ ద్రవిడ్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.  

►క్రిస్‌ ప్రింగిల్‌ (బాటిల్‌ మూత): పాకిస్తాన్‌లో 1990లో పర్యటించిన న్యూజిలాండ్‌ జట్టు పేసర్‌ ప్రింగిల్‌ తనదైన శైలిలో ట్యాంపరింగ్‌ చేశాడు. ఒక బాటిల్‌ మూతను నాలుగు భాగాలుగా కోసి మొన మాత్రమే బయటికి కనిపించేలా వాటికి టేపులు చుట్టి జేబులో పెట్టుకున్నాడు. మ్యాచ్‌లో అనేక సార్లు దాంతో బంతిని గీకి తాను అనుకున్న విధంగా రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టాడు. ఇది బాగా పని చేసి తొలి ఇన్నింగ్స్‌లో ప్రింగిల్‌ 7 వికెట్లు తీయడంతో పాక్‌ 102కే కుప్పకూలింది. సిరీస్‌లో పాక్‌ బౌలర్లు ఇదే తరహాలో ఎన్నో సార్లు చేసినా అంపైర్లు పట్టించుకోకపోవడంతో తాము అలాగే చేయాల్సి వచ్చిందని ప్రింగిల్, కెప్టెన్‌ మార్టిన్‌ క్రో ఆ తర్వాత చెప్పుకున్నారు. రిఫరీలు లేని జమానా కావడంతో ప్రింగిల్‌కు ఎలాంటి శిక్ష పడలేదు. 

సచిన్‌ వివాదం... 
భారత క్రికెట్‌–బాల్‌ ట్యాంపరింగ్‌కు సంబంధించి తీవ్ర వివాదంలో నిలిచిన ఘటన 2001లో జరిగింది. దక్షిణాఫ్రికాతో పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరిగిన రెండో టెస్టులో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడని సచిన్‌ టెండూల్కర్‌పై రిఫరీ మైక్‌ డెన్నిస్‌ ఒక టెస్టు నిషేధం, జరిమానా విధించాడు. జట్టును అదుపులో ఉంచనందుకు కెప్టెన్‌ గంగూలీ, అతిగా అప్పీల్‌ చేసినందుకు మరో నలుగురు భారత క్రికెటర్లు సెహ్వాగ్, హర్భజన్, శివ్‌సుందర్‌ దాస్, దీప్‌ దాస్‌గుప్తాలపై కూడా నిషేధం పడింది. అయితే దీనిపై భారత జట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరీస్‌ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. చివరకు సచిన్‌ తప్పు లేదని తేలడం, ఇరు బోర్డుల మధ్య చర్చల అనంతరం తర్వాతి టెస్టుకు అనధికారిక గుర్తింపు ఇవ్వడంతో భారత్‌ బరిలోకి దిగింది. టెస్టు మూడో రోజు సచిన్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయగా... ఇతర భారత బౌలర్లకంటే సచిన్‌ అద్భుతంగా స్వింగ్‌ చేశాడు. అతని గ్రిప్‌ను చూసేందుకు కెమెరా ఫోకస్‌ చేయగా రెండు సార్లు బొటన వేలితో బంతితో సచిన్‌ ఏదో చేస్తున్నట్లుగా సందేహాస్పదంగా కనిపించింది. దీని ఆధారంగా శిక్ష విధించానని డెన్నిస్‌ చెప్పగా... తాను బంతిపై మట్టిని మాత్రమే తొలగించానని సచిన్‌ వివరణ ఇచ్చాడు. 

► కొత్త పద్ధతుల కోసం ప్రయత్నించకుండా తమ చేతితో, వేలితో బంతిని దెబ్బ తీసిన క్రికెటర్లు కూడా ఉన్నారు. 2000లో దక్షిణాఫ్రికాతో వన్డేలో గోళ్లతో వకార్‌ యూనిస్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ట్యాంపరింగ్‌ చేసి శిక్షకు గురైన తొలి క్రికెటర్‌ వకార్‌ కావడం విశేషం. అతనిపై ఒక మ్యాచ్‌ నిషేధం, 50 శాతం జరిమానా పడింది. 2014లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టులో చేతి వేళ్ళతో బంతి ఆకారాన్ని మార్చిన దక్షిణాఫ్రికా పేసర్‌ ఫిలాండర్‌పై 75 శాతం జరిమానా పడింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ పేసర్‌ బ్రాడ్‌ షూ స్పైక్స్‌తో తొక్కి బంతిని దెబ్బ తీశాడని ఆరోపణలు వచ్చినా అవి రుజువు కాలేదు. బంతిని ఆపడంతో బద్ధకించి తాను కాలు పెట్టానని అతను చెప్పుకున్నాడు.  

►మైక్‌ అథర్టన్‌ (జేబులో మట్టి): దక్షిణాఫ్రికాతో 2004లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ మధ్యలో అథర్టన్‌ అనుమానాస్పద రీతిలో బంతిపై దేనితోనో రుద్దడం బయట పడింది. అయితే ఆ తర్వాత అథర్టన్‌ జేబులో మట్టి ఉన్నట్లుగా తేలింది. తాను బంతి ఆకారాన్ని దెబ్బ తీయలేదని, అర చేతులకు చెమట పట్టినప్పుడు తుడుచుకునేందుకు మాత్రమే మట్టిని ఉపయోగించానని బుకాయించాడు. రిఫరీ ముందు కూడా తప్పు ఒప్పుకోకపోయినా...అతనిపై 2 వేల పౌండ్ల జరిమానా పడింది.  

►డు ప్లెసిస్‌ (ప్యాంట్‌ జిప్‌):  2013లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తూ దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డు ప్లెసిస్‌ పట్టుబడ్డాడు. బంతిని తన ప్యాంట్‌ సైడ్‌ జిప్‌కు బలంగా రాస్తూ దొరికిపోయాడు. 2016లో కూడా ప్లెసిస్‌ మరో తప్పు చేశాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో నోట్లో మింట్‌ చప్పరించి దానితో బంతి మెరుపును పెంచే ప్రయత్నం చేశాడు. తొలిసారి ఫీజులో 50 శాతం, రెండోసారి అతనిపై 100 శాతం జరిమానా పడింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు