‘జకార్తా’లోనూ జోరు కొనసాగించాలి

17 Apr, 2018 00:46 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం  : అంచనాలకు మించి రాణించిన భారత క్రీడాకారులు గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ను సగర్వంగా ముగించారు. టీమ్‌ క్రీడాంశాల్లో నిరాశపరిచినప్పటికీ వ్యక్తిగత ఈవెంట్స్‌లో మాత్రం దుమ్మురేపారు. తొలిసారే ఈ గేమ్స్‌లో పాల్గొన్న కొందరు స్వర్ణ పతకాలతో మెరిశారు. సీనియర్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపించారు. షూటింగ్‌లో మను భాకర్, అనీశ్‌ భన్వాలా, బాక్సింగ్‌లో గౌరవ్‌ సోలంకి ప్రదర్శనే దీనికి నిదర్శనం. మొత్తం 16 క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు బరిలోకి దిగగా... తొమ్మిది క్రీడాంశాల్లో పతకాలు వచ్చాయి. ఆర్టిస్టిక్, రిథమిక్‌ జిమ్నాస్టిక్స్, సైక్లింగ్, హాకీ, లాన్‌ బాల్స్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్‌ క్రీడాంశాల్లో మనోళ్లకు ఒక్క పతకం కూడా రాలేదు. 

ఆసియా క్రీడా దిగ్గజాలు చైనా, కొరియా, జపాన్‌ ప్రాతినిధ్యం లేని కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ కొన్నేళ్లుగా నిలకడగానే రాణిస్తోంది. టాప్‌–5లో చోటు సంపాదిస్తోంది. అయితే ఈ తరహా ప్రదర్శన చైనా, కొరియా, జపాన్, ఇరాన్, కజకిస్తాన్, చైనీస్‌ తైపీ తదితర దేశాలు పాల్గొనే ఆసియా క్రీడల్లో భారత్‌ పునరావృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి ఆసియా క్రీడలకు ఇండోనేసియా రాజధాని జకార్తా 2022 ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు వేదికగా నిలువనుంది. గోల్డ్‌ కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి మొత్తం 66 పతకాలు నెగ్గి మూడో స్థానాన్ని సంపాదించింది. ఆసియా క్రీడల విషయానికొస్తే 1986 తర్వాత భారత్‌ టాప్‌–5లో ఒక్కసారీ నిలువలేదు. 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌ 11 స్వర్ణాలు, 10 రజతాలు, 36 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలు గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది.  

గోల్డ్‌ కోస్ట్‌లో భారత్‌ పతకాలు గెలిచిన క్రీడాంశాలన్నీ జకార్తా ఆసియా క్రీడల్లోనూ ఉన్నాయి. వీటికి అదనంగా ఆర్చరీ, టెన్నిస్, కబడ్డీ, రోయింగ్‌ క్రీడాంశాల్లో భారత్‌ పతకాలు సాధించే అవకాశాలున్నాయి. కామన్వెల్త్‌ గేమ్స్‌లో లేని ఈ క్రీడాంశాలు ఆసియా క్రీడల్లో ఉన్నాయి. అయితే అన్నింట్లోనూ చైనా, కొరియా, జపాన్‌ల నుంచి భారత్‌కు గట్టిపోటీ ఉంటుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌ అందించిన విశ్వాసంతో మరో నాలుగు నెలల తర్వాత మొదలయ్యే ఆసియా క్రీడల్లోనూ భారత క్రీడాకారులు మురిపించాలని, గతంలోకంటే ఎక్కువగా పతకాల పంట పండించాలని ఆశిద్దాం. 

మరిన్ని వార్తలు