దినేశుని నవోదయం

20 Mar, 2018 00:23 IST|Sakshi
దినేశ్‌ కార్తీక్‌

కెరీర్‌లో ఎత్తుపల్లాలు

 ఆత్మవిశ్వాసమే ఆయుధం

‘నిదహస్‌’ ఫైనల్‌తో హీరోగా దినేశ్‌ కార్తీక్‌   

ఎప్పుడో 2004లో జాతీయ జట్టులోకి వచ్చాడు.2006లో భారత్‌ ఆడిన తొలి అంతర్జాతీయ టి20లో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అతడే.ఇంగ్లండ్‌ గడ్డపై 2007లో టెస్టుల్లోనూ మెరిశాడు....అయినా ఇప్పటికీ ‘ఒక్క చాన్స్‌’ కోసం తపన...అటు సహచరులు, ఇటు కుర్రాళ్లతో పోరాటం...ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అలుపెరగని పయనం...ఎట్టకేలకు తానేంటో నిరూపించుకున్న వైనం ...ఆ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌. తన ప్రస్థానం ఇలా...  

సాక్షి క్రీడా విభాగం : ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్, ఇంగ్లండ్‌ సిరీస్‌ ఇలా ప్రతి టోర్నీ నాకు ముఖ్యమే. ఒక్కదాంట్లో విఫలమైనా జట్టుకు దూరమవుతా. ఒత్తిడిని ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయిలో ఆడుతూ పోవడమే నేను చేయగలిగినది’ నిదహస్‌ ట్రోఫీ ఫైనల్‌కు ముందు దినేశ్‌ కార్తీక్‌ వ్యాఖ్యలివి. వీటిని బట్టి జట్టులో చోటుపై అతడెంతటి ఊగిసలాటలో ఉన్నాడో చెప్పొచ్చు. అవును మరి... ఒకటా, రెండా? టీమిండియా తరఫున కార్తీక్‌ అరంగేట్రం చేసి 14 సంవత్సరాలు కావొస్తోంది. అది జట్టు మంచి వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం చూస్తున్న సమయం. అప్పటికి మహేంద్ర సింగ్‌ ధోని కూడా వెలుగులోకి రాలేదు. అయితే... ప్రతిభ ఉన్నా, అదృష్టం తోడు లేక, పెద్దగా అవకాశాలూ రాక సగటు ఆటగాడిగానే మిగిలిపోయాడీ తమిళ తంబి. ఓవైపు క్రీడా జీవితంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటుంటే, మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ అతడు పోరాటం కొనసాగించాడు. తోటివారైన మనోజ్‌ తివారీ, అంబటి రాయుడు, ఇర్ఫాన్‌ పఠాన్‌ జాతీయ జట్టులోకి వచ్చి వెళ్లిపోయినా కార్తీక్‌ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. 31 ఏళ్ల వయసులో గత రంజీ సీజన్‌లో భారీగా పరుగులు చేసి మరోసారి సెలెక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఇప్పుడు మన మహామహ క్రికెటర్లకూ సాధ్యం కాని రీతిలో చివరి బంతికి సిక్స్‌ కొట్టి, కప్‌నూ సాధించిపెట్టి ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిపోయాడు. ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌ అతడి స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. అది ఇకనైనా జట్టులో చోటును స్థిరం చేస్తుందా? 

ధోని కంటే ముందటివాడు... 
ఏళ్లుగా టీమిండియాలోకి వస్తూ పోతూ ఉన్న దినేశ్‌ కెరీర్‌ ఆసాంతం పడుతూ లేస్తూనే సాగింది. ధోని కంటే ముందే, చిన్న వయసులో (18 ఏళ్లు)నే జట్టుకు ఎంపికైనా అతడికి ఏమీ కలిసిరాలేదు. ఫామ్‌ కంటే నిలకడగా అవకాశాలు రాకపోవడమే తనను ఎక్కువగా దెబ్బతీసింది. ఈలోగా ధోని దూసుకెళ్లిపోయాడు. మహి తర్వాత కీపింగ్‌ నైపుణ్యంతో టెస్టుల్లో వృద్ధిమాన్‌ సాహా, ఎడమచేతి వాటం బ్యాటింగ్‌ కారణంగా పార్థివ్‌ పటేల్‌ చోటు కొట్టేశారు. ఇక వన్డేలు, టి 20ల్లో ధోనికి తోడు రిషభ్‌ పంత్, సంజూ శామ్సన్‌ వంటి కుర్రాళ్లు. ఇలా ఎటుచూసినా పోటీనే. ఇలాంటి నేపథ్యంలో రాకరాక అవకాశం వచ్చినా కార్తీక్‌కు అది కత్తి మీద సాములాంటిదే. ఏ మాత్రం విఫలమైనా చోటు మళ్లీ గల్లంతే. అందుకే అతడు పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. 

ఇప్పుడేం చేయాలి? 
అటు పూర్తిస్థాయి కీపర్‌గా కాక, ఇటు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గానూ పరిగణించలేక ఇప్పటివరకు దినేశ్‌ కార్తీక్‌ కెరీర్‌ డోలాయమానంలో ఉండేది. కానీ... నిదహస్‌ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై మెరుపు ఇన్నింగ్స్‌లో అతడి చక్కటి క్రికెటింగ్‌ షాట్లు బ్యాట్స్‌మన్‌గా ఎంతటి పరిపూర్ణుడో చాటాయి. ఫైనల్లో దినేశ్‌ కొట్టిన కొన్ని షాట్లను తానూ ఆడాలనుకుంటున్నట్లు రోహిత్‌ శర్మ చెప్పడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతానికి ప్రపంచకప్‌ జట్టులో ధోనికి స్టాండ్‌బై కీపర్‌గా ఇతడికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనంతరం మహి రిటైరైనా దినేశ్‌ వైపే మొగ్గు ఉంటుందనడంలో సందేహం లేదు. ఈలోగా మరిన్ని అవకాశాలిస్తూ అతడిలో ఆత్మవిశ్వాసం పెంచాలి. అవసరమైతే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా నాలుగో స్థానంలో ఆడించే ప్రయోగం చేయాలి. కార్తీక్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతాకు సారథ్యం వహించనున్నాడు. కెప్టెన్‌గానూ నిరూపించుకుని మరో మెట్టు ఎక్కడానికి అతడికిదో చాన్స్‌. ఇకపై తన క్రీడా ప్రయాణం సాఫీగా సాగాలని... ఫినిషర్‌గా భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం.

ఆ సిక్స్‌ నేను చూడలేదు... 
13వ ఓవర్లో నేను అవుటయ్యాక తనను బ్యాటింగ్‌కు పంపనందుకు దినేశ్‌ కార్తీక్‌ నొచ్చుకున్నాడు. కానీ మ్యాచ్‌ తర్వాత చాలా సంతృప్తిగా కనిపించాడు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉన్న, ఎప్పుడైనా, ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయగల అతడి అవసరం చివర్లో చాలా ఉంటుందనే ఇలా చేశాం. మ్యాచ్‌ను నువ్వే ముగించాలని అతడికి చెప్పా. ఇలాంటి ఆటగాడి అవసరం జట్టుకు చాలా ఉంది. అయితే చివరి బంతికి దినేశ్‌ కార్తీక్‌ కొట్టిన సిక్స్‌ షాట్‌ను నేను చూడలేదు. మ్యాచ్‌ ఫలితం సూపర్‌ ఓవర్‌లో తేలుతుందేమోనని భావించి ప్యాడ్‌లు కట్టుకునేందుకు డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లాను.  
–రోహిత్‌శర్మ, భారత కెప్టెన్‌

ఫైనల్‌ ఇన్నింగ్స్‌ జీవిత కాలం గుర్తుంటుంది. ఏడాదిగా జట్టుతో ఉంటున్నా. మేం చాలా శ్రమించాం. చివరకు టోర్నీని గెలిచాం. బౌలర్లు వేసే బంతులకు తగ్గట్లు నా స్టాన్స్‌ మార్చుకున్నా. దీనికి ప్రతిఫలం దక్కింది. ప్రేక్షకుల నుంచి మాకు అనూహ్య మద్దతు లభించింది. బ్యాటింగ్‌లో అది నాకు ఊపునిచ్చింది. 
– దినేశ్‌ కార్తీక్‌ 

వ్యక్తిగత జీవితంలోనూ...
అదేంటో కాని... దినేశ్‌ కార్తీక్‌ క్రీడా కెరీర్‌లాగే వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదొడుకులున్నాయి. 2007లో 22 ఏళ్ల వయసులోనే చిన్ననాటి స్నేహితురాలు నిఖితను పెళ్లి చేసుకుని ఆశ్చర్యపర్చిన అతడు 2012లో ఆమెతో విడిపోవాల్సి వచ్చింది. తర్వాత నిఖిత తమిళనాడుకే చెందిన భారత క్రికెటర్‌ మురళీ విజయ్‌ను వివాహమాడింది. అనంతరం కార్తీక్‌... భారత స్టార్‌ స్వా్కష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిప్పుడు అన్యోన్యంగా ఉంటున్నారు.   

అభిషేక్‌ నాయర్‌ అండతో... 
ప్రతి ఆటగాడికి కొంతకాలం దుర్దశ ఉంటుంది. దినేశ్‌ కూడా ఆ దశను చవిచూశాడు. 2016 ఐపీఎల్‌ వేలంలో అతడి విలువ రూ.9 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పడిపోయింది. రంజీల్లోనూ విఫలమయ్యాడు.ఈసారి విఫలమైతే ఇక అంతే అనే పరిస్థితుల్లో ఆటతీరు మెరుగుకు ముంబై వెళ్లిన అతడు అభిషేక్‌ నాయర్‌ ఇంట్లోని చిన్న గదిలో ఉండాల్సి వచ్చింది. కనీస వసతులు లేని ఆ గదిలో ఉండేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ప్రవీణ్‌ ఆమ్రే, అమిత్‌ పగ్నిస్, అపూర్వ్‌ దేశాయ్‌ వంటివారి వద్ద శిక్షణ పొందాడు. నాయర్‌ కూడా కొంత తోడ్పడ్డాడు. అక్కడ నేర్చుకున్న సాంకేతిక అంశాలతో దినేశ్‌ ఆట పూర్తిగా మారింది. తర్వాతి రంజీ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 50పైగా సగటుతో 704 పరుగులు చేశాడు. చాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టుకు ఎంపికయ్యాడు. దాదాపు ఏడాదిన్నరగా స్థిరంగా జట్టులో కొనసాగుతున్నాడు.  

దక్షిణాఫ్రికాపై 2006లో టీమిండియా ఆడిన తొలి టి20లో దినేశ్‌ కార్తీక్‌ జట్టు సభ్యుడు. ఈ మ్యాచ్‌తోనే టి20ల్లో అరంగేట్రం చేసిన ఇతడు 28 బంతుల్లో 31 పరుగులు చేసి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గానూ నిలిచాడు. 

మరిన్ని వార్తలు