ఆలస్యమైనా... అద్భుతమే 

11 Dec, 2018 00:34 IST|Sakshi

1947 నుంచి టీమిండియా 11 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించింది. 44 టెస్టులాడితే ఐదే గెలిచింది. వీటిలోనూ సిరీస్‌లోని మొదటి టెస్టును ఎన్నడూ నెగ్గలేదు. 2003–04 సిరీస్‌లో రెండో టెస్టును నెగ్గి ఆధిక్యంలో నిలవడమే ఇప్పటివరకు అత్యుత్తమం. ఈసారి మాత్రం పరిస్థితులు కలిసొస్తేనేమి? జట్టు బలంగా ఉన్నందుకైతేనేమి? కోహ్లి సేన తొలి మ్యాచ్‌లోనే నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ప్రక్రియలో కొంత ఆలస్యమైనా, అద్భుతం అనదగ్గ రీతిలో ‘సిరీస్‌ వేట’ను ఆరంభించింది. ఇదే ఊపు కొనసాగిస్తే సిరీస్‌ గెలవాలనే చిరకాల కోరికను మూడో టెస్టులోపే ఖాయం చేసుకోవచ్చు. 

వారు న్యాయం చేశారు... 
జట్టు నుంచి పూర్తిగా తీసేయలేక, అలాగని మొత్తానికి కొనసాగించలేని పరిస్థితి పుజారా, రహానేలది. గత రెండు విదేశీ సిరీస్‌లలో వారికిదే అనుభవమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఈ ఇద్దరికీ వ్యక్తిగతంగా చాలా కీలకం. కెప్టెన్‌ కోహ్లి సహా టాపార్డర్‌ విఫలమైన అత్యంత కీలక సందర్భాన తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదడం ద్వారా పుజారా తన సత్తా ఏమిటో చాటాడు. జట్టును సురక్షిత స్థానానికి చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడి పాత్రను తక్కువ చేయలేం. ఇక... ఆధిక్యాన్ని సాధ్యమైనంత మేర పెంచాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్‌లో రహానే చేసిన అర్ధశతకం మెచ్చుకోదగ్గది. ఇది అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరి రాణింపుతో కోహ్లి అరుదైన వైఫల్యం ప్రభావం చూపలేకపోయింది. తక్కువే అయినా, యువ రిషభ్‌ పంత్‌ చేసిన పరుగులూ విలువైనవే. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అతడి ఎదురుదాడి మున్ముందు లయన్‌ లయను దెబ్బతీసేందుకు మిగతా బ్యాట్స్‌మెన్‌కు ఓ మార్గం చూపింది. రెండో ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరుతో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తన స్థానాన్ని కనీసం మరో టెస్టుకైనా పొడిగించుకున్నాడు. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో మన జోరును ఆపడం ఆతిథ్య జట్టు తరం కాలేదు. నోబాల్స్‌ సమస్యను పక్కన పెడితే ఇషాంత్‌ శర్మ ఎప్పటిలానే మెరుపు బంతులేయగా, కొంత ఇబ్బందిపడ్డా షమీ తర్వాత తేరుకుని ప్రభావం చూపాడు. అయితే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్విన్, బుమ్రా గురించే. కొంతకాలంగా విదేశీ పర్యటనల్లో వైఫల్యాలతో ఇబ్బంది ఎదుర్కొంటున్న అశ్విన్‌ ఈ టెస్టుతో దానిని అధిగమించాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లోనే కాదు... సంప్రదాయ క్రికెట్‌లోనూ తాను ప్రమాదకారినని బుమ్రా చాటిచెప్పాడు. అడిలైడ్‌లో కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్‌ గతిని మార్చాడు.  

ఆ రెండు స్థానాలే... 
జట్టుగా సాధించిన ఈ విజయంలోనూ సరిచేసుకోవాల్సిన కొన్ని లోపాలున్నాయి. అందులో మొదటిది ఓపెనింగ్‌ స్థానం. మురళీ విజయ్‌ వైఫల్యాల నుంచి బయటపడలేదు. దీంతో స్థానం కోల్పోక తప్పని పరిస్థితి. రెండో టెస్టు నాటికి కోలుకుంటే పృథ్వీ షా అతడి స్థానంలోకి వచ్చేస్తాడు. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ అరుదైన అవకాశాన్ని మరోసారి చేజార్చుకున్నాడు. ధాటైన బ్యాటింగ్‌తో పరుగులు సాధించడం అటుంచి, టెస్టు క్రికెట్‌కు తగిన ఆటగాడేనా అన్న అనుమానాలు మళ్లీమళ్లీ రేకెత్తిస్తున్నాడు. దీంతో ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్‌ వేయగల హనుమ విహారిని కాదని... రోహిత్‌ను తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బహుశా పెర్త్‌ టెస్టుకు రోహిత్‌నూ పక్కన పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో కుదురుగా ఉన్న  పృథ్వీ, విహారి జత కలిస్తే జట్టు మరింత బలీయం కావడం ఖాయం. తద్వారా ‘సిరీస్‌’ దక్కడమూ ఖాయం. 
–సాక్షి క్రీడావిభాగం  

మరిన్ని వార్తలు