'సుందర'కాండ

21 Mar, 2018 01:18 IST|Sakshi
వాషింగ్టన్‌ సుందర్‌

 ఈ కుర్రాడు ‘ఎంవీపీ’మునివేళ్ల మాయాజాలంతో కట్టిపడేస్తున్నాడు 

బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడతారన్న భయం లేదు తానొక ఆఫ్‌ స్పిన్నర్‌నన్న బెరుకు లేదు పరుగులు భారీగా ఇస్తానేమోనన్న ఆందోళన లేదు పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేస్తున్నానన్న ఒత్తిడి లేదు  ఉన్నదల్లా తనపై తనకు నమ్మకమే...! అదే మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ (ఎంవీపీ)ను చేసింది నిదహస్‌ ట్రోఫీలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిపింది అతడే వాషింగ్టన్‌ సుందర్‌!

సాక్షి క్రీడా విభాగం :టి20 మ్యాచ్‌లంటేనే తీవ్ర ఒత్తిడితో కూడుకున్నవి. ఒక్క ఓవర్‌తో ఫలితం తారుమారయ్యేవి. పూర్తిగా బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం కనిపించే చోట, ఏమాత్రం లైన్‌ తప్పినా బౌలర్లకు మిగిలేది చేదు అనుభవమే. ఇక పవర్‌ ప్లేలో బౌలింగ్‌ చేయాలంటే ప్రతిభ కంటే... ఎదురుదాడిని తట్టుకునే మానసిక దృఢత్వం ముఖ్యం. ప్రత్యర్థి జట్లలో ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌ ఎక్కువగా ఉంటే ఆఫ్‌ స్పిన్నర్‌కు మరింత పరీక్ష ఎదురైనట్లే. కానీ, 18 ఏళ్ల వాషింగ్టన్‌ సుందర్‌ వీటన్నింటినీ అధిగమించి విజయవంతమయ్యాడు. మిగతా ప్రధాన బౌలర్లు తమ కోటా పూర్తి చేయడానికే నానా కష్టాలు పడుతుంటే సుందర్‌ మాత్రం అటు పరుగుల కట్టడి, ఇటు వికెట్లూ తీస్తూ అలవోకగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందుకే టోర్నీలో ‘ఎంవీపీ’గా నిలిచాడు. 

అనూహ్యంగానే..
నిదహస్‌ ట్రోఫీ ప్రారంభానికి ముందు సమీకరణాల ప్రకారం చూస్తే వాషింగ్టన్‌కు తుది జట్టులో చోటు కొంత అనుమానంగానే ఉండేది. అయితే, తొలి మ్యాచ్‌లోనే అవకాశం దక్కించుకున్న అతడు ఏకంగా పవర్‌ ప్లేలో బౌలింగ్‌కు దిగి చక్కటి గణాంకాలతో మెప్పించాడు. దీంతో  తర్వాతి మ్యాచ్‌లకూ కొనసాగించక తప్పలేదు. ఈ నమ్మకాన్ని సుందర్‌ ఎక్కడా కోల్పోలేదు. టోర్నీలో ప్రధాన పేసర్లు శార్దుల్‌ ఠాకూర్, ఉనాద్కట్, సిరాజ్‌తో పాటు విజయ్‌ శంకర్‌ కూడా ఓవర్‌కు పది పరుగులిచ్చిన సందర్భాలున్నాయి. చహల్‌ సైతం ఓసారి గాడితప్పాడు. కానీ ఫైనల్‌ సహా అన్ని మ్యాచ్‌ల్లో ప్రారంభ ఓవర్లు వేసిన సుందర్‌ ఎకానమీ 5.7 మాత్రమే. దీన్నిబట్టి అతడెంత కట్టుదిట్టంగా బంతులేశాడో తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాపార్డర్‌ను పెవిలియన్‌కు పంపి టీమిండియా దర్జాగా ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 

‘ముని వేళ్ల’ మాయాజాలం 
ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ 15 బౌలర్లలో ఏడుగురు మణికట్టు (లెగ్‌) స్పిన్నర్లే. బ్యాట్స్‌మెన్‌ను వైవిధ్యం, ఊహాతీత బంతులతో అవుట్‌ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కానీ... సుందర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. అతడి మాయాజాలం అంతా మునివేళ్ల మీదనే ఉంటుంది. బ్యాట్స్‌మన్‌ భారీ షాట్‌కు యత్నిస్తున్నాడని పసిగట్టి వెంటనే బంతి వేగం తగ్గించి, లైన్‌ను మార్చేస్తాడు. నిదహస్‌లో పూర్తిగా ఇదే పద్ధతి పాటించి వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికైతే భవిష్యత్‌ ఆఫ్‌ స్పిన్‌ ఆశాకిరణంగా సుందరే కనిపిస్తున్నాడు. దీనిని అతడెంత మేరకు నిలుపుకొంటాడో చూద్దాం. 

అవసరమైనవాడే... 
సీనియర్‌ అశ్విన్‌ను టెస్టులకే పరిమితం చేశారు. మరోవైపు చహల్‌ లెగ్‌ స్పిన్నర్‌ కాగా, కుల్దీప్‌ ఎడమ చేతివాటం చైనామన్‌ బౌలర్‌. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్‌కు ప్రస్తుతం ఒక ఆఫ్‌ స్పిన్నర్‌ అవసరం చాలా ఉంది. దీనిప్రకారం వన్డేలు, టి20ల్లో సుందర్‌కు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ కావడం, హిట్టింగూ చేయగలగడం ఇతడికి ఉన్న మరో సానుకూలాంశం. అసలు తాను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టింది కూడా బ్యాట్స్‌మన్‌గానే. ఈ నేపథ్యంలో లోయరార్డర్‌లో ఉపయుక్తంగానూ మారగలడు. 

ముందుంది అసలు కాలం 
కెరీర్‌ ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్‌ చేసినా ప్రత్యర్థులు చదివేశాక ఒక్కసారిగా తెరమరుగైన వారిని గతంలో చూశాం. తాను కూడా అలా కాకుండా ఉండాలంటే సుందర్‌ ఎప్పటికప్పుడు మెరుగుపడాలి. ఈ దిశగా ఐపీఎల్‌ అతడికి మంచి అవకాశం. ఎందుకంటే సుందర్‌ ఈసారి విరాట్‌ కోహ్లి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడనున్నాడు. జట్టు కోచ్‌ కివీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ వెటోరీ. ఆధునిక తరం కోచ్‌గా వెటోరీకి పేరుంది. ఆటగాడిగా మెరుగుపడేందుకు ఇంతకుమించిన చాన్స్‌ ఉండదు. కాబట్టి దీనిని రెండు చేతులా అందిపుచ్చుకోవాలి.

పవర్‌ ప్లేలో బౌలింగ్‌ సవాలు లాంటిది. దీనిని గెలిస్తే చాలా సంతృప్తి దక్కుతుంది. క్రికెట్‌ ఆడేది ఇలాంటివాటి కోసమే కదా? బౌలింగ్‌ సందర్భంగా నన్ను నేను బ్యాట్స్‌మన్‌గానే భావించుకుంటా. ప్రత్యర్థి ఏం ఆలోచిస్తున్నాడో, ఎక్కడకు కొట్టబోతున్నాడో పసిగడతా. ఆరు బంతుల్లో కనీసం ఫోర్‌ లేదా సిక్స్‌ కొట్టాలని చూసే బ్యాట్స్‌మన్‌ తీరును అర్ధం చేసుకోవడం ముఖ్యం. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌లు రవిశాస్త్రి, భరత్‌ అరుణ్‌ చాలా పోత్స్రహించారు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో మునివేళ్ల స్పిన్నర్లూ ప్రభావం చూపగలరు          
– వాషింగ్టన్‌ సుందర్‌ 

మరిన్ని వార్తలు