అశ్విన్‌ ‘బల్లే బల్లే’ చేయిస్తాడా!

5 Apr, 2018 01:15 IST|Sakshi

ఆశల పల్లకిలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌

గేల్, ఫించ్, మిల్లర్, యువరాజ్, లోకేశ్‌ రాహుల్‌... బ్యాటింగ్‌ భారాన్ని మోసేందుకు ఈ స్టార్లు సరిపోతారా? అశ్విన్, అక్షర్, ఆండ్రూ టై బౌలింగ్‌తో ప్రత్యర్థిని  నిలవరించగలరా? సెహ్వాగ్, వెంకటేశ్‌ ప్రసాద్‌ల మార్గనిర్దేశం జట్టును టైటిల్‌ దిశగా తీసుకుపోగలదా? ఐపీఎల్‌ పదేళ్ల ప్రస్థానంలో పడుతూ లేస్తూ సాగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మరోసారి తమ  అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. లీగ్‌లో ఇప్పటి వరకు ముద్దూ ముచ్చట్లకే పరిమితమైన ప్రీతి జింటా మోముపై సంతోషం విరబూయాలంటే స్టార్లంతా చెలరేగాల్సిందే.   

సాక్షి క్రీడా విభాగం:  ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లాగే పక్కనే ఉన్న మరో ఉత్తరాది జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. యువరాజ్‌ సింగ్‌ నాయకత్వంలో తొలి ఐపీఎల్‌లో సెమీస్‌ చేరిన ఆ జట్టు బెయిలీ కెప్టెన్సీలో 2014లో అత్యుత్తమంగా ఫైనల్‌ వరకు వెళ్లగలిగింది. ఆ తర్వాత రెండేళ్లు చివరి స్థానానికే పరిమితమై గత ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో ఫలితం మారాలంటే జట్టు మారాల్సిందేనంటూ ఒక్క అక్షర్‌ పటేల్‌ మినహా అందరినీ వదిలేసింది. ఆ తర్వాత వేలంలో కొందరిని  మళ్లీ తీసుకున్నా... మిగతా జట్లతో పోలిస్తే ఎక్కువ భాగం కొత్తవారు కనిపిస్తోంది పంజాబ్‌ టీమ్‌లోనే.    

అనుకూలం... 
కెప్టెన్‌గా గతంలో ఎప్పుడూ చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా అశ్విన్‌ ఇప్పుడు జట్టును నడిపించబోతున్నాడు. సౌతిండియా ‘తలైవా’గా ఇప్పటివరకు గుర్తింపు ఉన్న అతను, ‘పాజీ’గా ఇప్పుడు పంజాబీ అభిమానుల ఆశలను నిలబెట్టాల్సి ఉంది. అయితే గతంలో కెప్టెన్‌గా ఉండటంతో పాటు సీనియర్‌ అయిన యువరాజ్‌ సింగ్‌ సలహాలు, మెంటార్‌గా సెహ్వాగ్‌ వ్యూహాలు అశ్విన్‌ పనిని సులువు చేస్తాయి. గేల్, మిల్లర్, ఫించ్‌ రూపంలో భారీ హిట్టర్లు ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. దేశవాళీలో పరుగుల వరద పారించిన మయాంక్‌ అగర్వాల్‌తో పాటు టీమిండియా రెగ్యులర్‌ ఆటగాడు రాహుల్‌ కూడా మ్యాచ్‌ ఫలితాన్ని శాసించగలడు.  

ప్రతికూలం: యువరాజ్‌ మెరుపులు ప్రదర్శించి చాలా కాలమైంది. అతను ఎంత వరకు జట్టుకు ఉపయోగపడగలడో చెప్పలేం. స్వయంగా అశ్విన్‌ భారత పరిమిత ఓవర్ల జట్టుకు దూరమైపోయాడు. అతని బౌలింగ్‌లో పదును తగ్గిందనేది వాస్తవం. మిల్లర్‌ సీజన్‌లో ఒక మ్యాచ్‌ మినహా ప్రతీ సారి పంజాబ్‌ను ఇబ్బంది పెట్టినవాడే. ఫించ్‌కు ప్రత్యామ్నాయంగా గేల్‌ అందుబాటులో ఉన్నా... అతని పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.   

జట్టు వివరాలు: అశ్విన్‌ (కెప్టెన్‌), కరుణ్‌ నాయర్, మనోజ్‌ తివారి, మయాంక్, అంకిత్, శరణ్, మయాంక్‌ డగర్, మోహిత్‌ శర్మ, అక్షర్‌ పటేల్, మంజూర్‌ దార్, పర్‌దీప్, యువరాజ్, ఆకాశ్‌దీప్‌ నాథ్, రాహుల్‌ (భారత ఆటగాళ్లు), ఫించ్, మిల్లర్, టై, డ్వార్‌షుస్, జద్రాన్, గేల్, స్టొయినిస్‌ (విదేశీ ఆటగాళ్లు).

మరిన్ని వార్తలు