కివీస్‌ కప్‌ కొట్టేదెప్పుడు!

21 May, 2019 00:28 IST|Sakshi

మంచి బృందంతో ప్రపంచ కప్‌కు...

బ్యాటింగ్‌లో కెప్టెన్‌ విలియమ్సన్, టేలర్‌ కీలకం

బౌల్ట్, సౌతీలపై పేస్‌ భారం

ఆల్‌రౌండర్ల అండ అదనపు బలం  

నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్‌... వైవిధ్యం మేళవించిన పేసర్లు... నాణ్యమైన ఆల్‌ రౌండర్లు... ఇలాంటి ‘ఒక మంచి జట్టు’ లక్షణాలన్నీ కలగలిసినది న్యూజిలాండ్‌. పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ ఒత్తిడిని తట్టుకోగలదు. ప్రపంచ కప్‌లో చక్కటి రికార్డు దీని సొంతం. మొత్తం 11 కప్‌లలో ఆరుసార్లు సెమీఫైనల్, ఒకసారి ఫైనల్‌ చేరిన గణాంకాలే దీనికి నిదర్శనం. అయితే పెద్ద మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం జట్టు ప్రధాన బలహీనత. ఈసారైనా దానిని అధిగమించి కివీస్‌ కప్‌ కొడుతుందో లేదో  వేచి చూడాలి. 

సాక్షి క్రీడా విభాగం: చిన్న జట్లతో పోలిస్తే పెద్దదిగా, పెద్ద జట్లతో చూస్తే చిన్నదిగా కనిపిస్తుంది న్యూజిలాండ్‌. నాణ్యమైన వనరులున్న టీంలపై విజయాలు సాధించడం కివీస్‌కు శక్తికి మించిన పనే అవుతుంది. ఉదాహరణకు... ఈ ప్రపంచ కప్‌లో పాల్గొంటున్న ఐదు (శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, అఫ్గానిస్గాన్‌) జట్లతో న్యూజిలాండ్‌ గత నాలుగేళ్లలో 28 వన్డేలు ఆడింది. వీటిలో 24 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఇవన్నీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు కంటే కింద ఉన్నవే. ఇదే సమయంలో మిగతా టాప్‌ జట్ల (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా)తో జరిగిన 40 మ్యాచ్‌ల్లో 25 ఓడింది. ఇది ఒక విధంగా ఆ జట్టు స్థాయిని చెబుతోంది. 

బలాలు
ఒత్తిడిని తట్టుకోగల అనుభవం, దూకుడును చూపగల యువతరం కలగలిసిన నిండైన బృందం. ఆల్‌రౌండర్లతో కూడిన లోతైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ జట్టు సొంతం. ఓపెనర్లలో మార్టిన్‌ గప్టిల్‌ విధ్వంసక ఆటగాడు. 2015 ప్రపంచ కప్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు. నికోల్స్‌ దూకుడుగా పరుగులు సాధిస్తాడు.     కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఎలాంటి పిచ్‌పైనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నిలదొక్కుకోగలడు. చాప కింద నీరులా పరుగులు చేస్తూనే, ప్రశాంతంగా సారథ్య బాధ్యతలు నిర్వహించే విలియమ్సన్‌ జట్టును సమర్థంగా నడిపించగలడు. రాస్‌ టేలర్, లాథమ్, కొలిన్‌ మున్రో మిడిలార్డర్‌ను మోయగలరు.  గ్రాండ్‌హోమ్, నీషమ్‌ పేస్‌ ఆల్‌రౌండర్లు కాగా, స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌ బ్యాట్‌తోనూ మెరుగ్గా రాణించగలడు.   సాన్‌ట్నర్, ఇష్‌ సోధిల స్పిన్‌ ద్వయం ప్రత్యర్థిని కట్టడి చేస్తుంది.  అనుభవజ్ఞులైన పేసర్లు బౌల్ట్, సౌతీ. ముఖ్యంగా ఇంగ్లండ్‌ వాతావరణంలో బౌల్ట్‌ స్వింగ్‌ రాబడితే ప్రత్యర్థులకు కష్టకాలమే.
 

బలహీతనలు
►విలియమ్సన్‌ ఫామ్‌ కోల్పోవడం ఇబ్బందికరం. ఇటీవల అతడి నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ లేవు. 
► గప్టిల్‌ బ్యాటింగ్‌లో దూకుడుతో పాటు లోపాలూ ఎక్కువే. నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడతాడు. ఓపెనింగ్‌లో ఇతడికి తోడుగా మున్రో, నికోల్స్‌లో ఎవరిని దింపాలనేది ఇంకా సందిగ్ధమే. 
► విలియమ్సన్, రాస్‌ టేలర్‌ త్వరగా ఔటైతే ఇన్నింగ్స్‌ తడబడుతుంది. ఈ ప్రభావం స్కోరుపై పడుతుంది.  
► సౌతీకి పరుగులు ఎక్కువగా ఇచ్చే బలహీనత ఉంది. ప్రపంచ కప్‌లో పూర్తిగా బ్యాటింగ్‌ పిచ్‌లు ఎదురవనున్న నేపథ్యంలో ఇది ప్రతికూల అంశమే. 
►  మిగతా ఇద్దరు పేసర్లు లాకీ ఫెర్గూసన్, మాట్‌ హెన్రీ కొత్తవారు. 

గత రికార్డు 
​​​​​​​►సహ ఆతిథ్యం ఇచ్చిన 2015 ప్రపంచ కప్‌లో ఫైనల్‌ చేరడం ఇప్పటివరకు అతి పెద్ద ఘనత. 
​​​​​​​►అప్పటి సారథి మెకల్లమ్‌ తొలుతే ఔటవడంతో గత కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో తడబడింది. 
​​​​​​​►1975, 79, 92, 99, 2007, 2011లలో సెమీఫైనల్‌ వరకు వచ్చింది. 
​​​​​​​►మార్టిన్‌ క్రో దూకుడైన బ్యాటింగ్, అద్భుత వ్యూహాలతో 1992 ప్రపంచ కప్‌లో భీకరంగా కనిపించిన న్యూజిలాండ్‌... పాకిస్తాన్‌ ధాటికి తలవంచింది.

ప్రపంచ  కప్‌లో ప్రదర్శన 

​​​​​​​►ఆడిన మ్యాచ్‌లు -   79 

​​​​​​​►గెలిచినవి -  48

​​​​​​​►ఓడినవి - 30

​​​​​​​►రద్దు -  1

​​​​​​​►అత్యధిక స్కోరు  - 393

​​​​​​​►అత్యల్ప స్కోరు - 112

​​​​​​​►ఫైనల్‌ - 2015 

​​​​​​​►సెమీఫైనల్స్‌ - 1975, 1979, 1992, 1999, 2007, 2011 

మరిన్ని వార్తలు