సిక్సర్‌ వయా బౌలర్‌ హెడ్‌! 

22 Feb, 2018 01:26 IST|Sakshi

న్యూజిలాండ్‌ క్రికెట్‌లో అనూహ్య ఘటన

ఆక్లాండ్‌: క్రికెట్‌లో ఇకపై బౌలర్లు కూడా హెల్మెట్‌ పెట్టుకొని బంతులు వేయాల్సిన సమయం వచ్చిందేమో!  న్యూజిలాండ్‌ దేశవాళీ క్రికెట్‌లో జరిగిన తాజా సంఘటన అలాంటి ఆందోళనకు కారణంగా మారింది. బ్యాట్స్‌మన్‌ ఆడిన బంతి నేరుగా బౌలర్‌ తలకు తగిలి ఆ తర్వాత సిక్సర్‌గా మారిన అనూహ్య ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఫోర్డ్‌ వన్డే ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్, కాంటర్‌బరీ జట్ల మధ్య జరిగిన మూడో ప్రిలిమినరీ ఫైనల్లో ఇది జరిగింది. ఆక్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జీత్‌ రావల్‌ క్రీజ్‌లో ఉన్న సమయంలో కాంటర్‌బరీ కెప్టెన్‌ ఆండ్రూ ఎలిస్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ బౌలింగ్‌ చేసేందుకు వచ్చాడు. మూడో బంతిని భారీ సిక్సర్‌ బాదిన రావల్, తర్వాతి బంతిని లాఫ్టెడ్‌ డ్రైవ్‌ ఆడాడు. అది నేరుగా బౌలర్‌ తల ముందు భాగంలో తగిలి బౌండరీ దాటింది. అంపైర్‌ దానిని ముందు ఫోర్‌గా ప్రకటించినా... ఆ తర్వాత అది సిక్స్‌గా తేలింది! ఆ వెంటనే ఎలిస్‌ ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షల కోసం మైదానం వీడాడు.

ప్రమాదం లేదని తేలడంతో తిరిగొచ్చి ఆ తర్వాత మరో ఆరు ఓవర్లు బౌల్‌ చేయడంతో పాటు బ్యాటింగ్‌లో 25 బంతులు ఎదుర్కొని 14 పరుగులు కూడా చేశాడు. ఎలిస్‌కు పెద్ద ప్రమాదం జరగకపోవడంతో బ్యాట్స్‌మన్‌ రావల్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ‘ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అతను మ్యాచ్‌లో కొనసాగడం నా బెంగ తీర్చింది. అయితే ఇలాంటి గాయం తగిలిన సందర్భాల్లో కాస్త ఆలస్యంగా తలకు సంబంధించిన సమస్యలు బయటపడతాయి. అయితే అది కూడా జరగకూడదని ప్రార్థిస్తున్నా’ అని అతను చెప్పాడు. జీత్‌ రావల్‌ 149 పరుగుల సహాయంతో ఈ మ్యాచ్‌లో ఆక్లాండ్‌ 107 పరుగుల తేడాతో కాంటర్‌బరీపై విజయం సాధించింది.    

మరిన్ని వార్తలు