శ్రీలంకతో తొలి టెస్ట్‌: కుప్పకూలిన సఫారీ జట్టు

13 Jul, 2018 20:35 IST|Sakshi
వికెట్‌ తీసిన ఆనందంలో శ్రీలంక ఆటగాళ్లు

గాలె: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లంక బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టగా.. అనంతరం బౌలర్లు చెలరేగారు. శ్రీలంక బౌలర్ల ధాటిక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌటైంది. ఆతిథ్య గడ్డపై ప్రొటీస్‌ జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్‌ కావడం గమనార్హం. వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టును లంక బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.

నైట్‌ వాచ్‌మన్‌ కేశవ్‌ మహారాజ్‌ను ఔట్‌ చేయడంతో రెండో రోజు శ్రీలంక వికెట్ల ఖాతా తెరిచింది. మరో ఓపెనర్‌ ఎల్గర్‌ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మన్‌ ఆమ్లా(15), బవుమా(17), డికాక్‌(3), ఫిలాండర్‌(18) తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ 49(88 బంతుల్లో 5ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో కనీసం వంద పరుగుల మార్క్‌ను ప్రోటీస్‌ జట్టు దాటింది. లంక బౌలర్లలో డి పెరీరా (4/46), కెప్టెన్‌ సురంగ లక్మల్‌(3/21), హెరాత్‌(2/39), లక్షాన్ సందకదన్(1/18) ఆకట్టుకున్నారు. 

అనంతరం 161 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంకకు మరో సారి తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో 
కరుణరత్నే  60( 80 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు సాధించింది.  శ్రీలంక ప్రస్తుతం 272 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రొటీస్‌ బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌ మూడు వికెట్లు తీయగా, రబడా ఒక్క వికెట్‌ సాధించారు. 

మరిన్ని వార్తలు