స్పాన్సర్‌షిప్‌ కొనసాగించేది లేదు

28 Feb, 2017 00:25 IST|Sakshi

స్టార్‌ ఇండియా గ్రూప్‌ స్పష్టీకరణ  

ముంబై: బీసీసీఐకి ప్రస్తుతం ఏదీ కలిసి రావడం లేదు. అటు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బలు.. ఐసీసీలో ఆధిపత్యం కోల్పోవడంతో పాటు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి సేన దారుణ పరాజయం తెలిసిందే. దీనికి జతగా ఇప్పుడు టీమిండియా జెర్సీ హక్కుల కోసం తాము బరిలో ఉండడం లేదని ప్రస్తుత స్పాన్సరర్‌ స్టార్‌ గ్రూప్‌ తేల్చి చెప్పింది. ప్రస్తుతం బీసీసీఐ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, స్పష్టత కనిపించడం లేదని స్టార్‌ ఇండియా చైర్మన్‌ అండ్‌ సీఈవో ఉదయ్‌ శంకర్‌ అన్నారు. దేశవాళీ, గ్లోబల్‌ ప్రసార హక్కుల కోసం కూడా స్టార్‌ గ్రూప్‌ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సహారా 12 ఏళ్ల ఒప్పందం తర్వాత 2013, డిసెంబర్‌లో భారత క్రికెట్‌ అధికారిక స్పాన్సరర్‌గా స్టార్‌ ఇండియా బిడ్‌ గెలుచుకుంది.

దీంతో అప్పటి నుంచి ఆటగాళ్ల దుస్తులపై స్టార్‌ లోగో దర్శనమిస్తోంది. ఇందుకుగాను ద్వైపాక్షిక సిరీస్‌లో జరిగే మ్యాచ్‌కు దాదాపు రూ. 2 కోట్లు, ఐసీసీ టోర్నీల్లో రూ.61 లక్షలు బీసీసీఐకి ఇస్తోంది. ఈ నాలుగేళ్ల ఒప్పందం వచ్చే నెల మార్చి 31తో ముగుస్తుంది. కానీ మరోసారి టీమ్‌ స్పాన్సరర్‌ హక్కుల కోసం మాత్రం బరిలో ఉండే అవకాశం లేదని స్టార్‌ స్పష్టం చేసింది. ఈ దశలో టీమిండియాతో ముందుకెళ్లలేమని వివరించింది.
 

మరిన్ని వార్తలు