క్రీడాకారులకు స్పాన్సర్లు అవసరం: సింధు 

31 Jan, 2020 12:02 IST|Sakshi

హైదరాబాద్‌: క్రీడాకారులు పెద్ద టోర్నీల్లో మెరుగ్గా రాణించేందుకు స్పాన్సర్ల ప్రోత్సాహం అవసరమని పద్మభూషణ్, ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు వ్యాఖ్యానించింది. స్థానిక రాడిసన్‌ హోటల్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో సింధు అభిబస్‌.కామ్‌ ట్రెయిన్‌ టికెటింగ్‌ సరీ్వస్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నారులు క్రీడల్లోకి వస్తారు. కానీ వారు మరింత బాగా రాణించేందుకు  స్పాన్సర్లు దోహదపడతారు. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టుకు అభిబస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్పాన్సర్‌గా వ్యవహరించడం అభినందనీయం’ అని ఆమె పేర్కొంది. అభిబస్‌ యాప్‌ను నెలకు 5 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని సంస్థ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ శర్మ అన్నారు. అభిబస్‌.కామ్, అభిబస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా బస్‌ టికెట్‌తో పాటు దేశంలోని ఏ స్టేషన్‌కైనా రైలు టికెట్‌ను బుక్‌ చేసుకునే వీలుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సిక్కి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.   

రాష్ట్ర స్థాయి షూటింగ్‌ టోర్నీ ప్రారంభం 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ గురువారం ప్రారంభమైంది. బిగ్‌ బోర్‌ ఈవెంట్‌లలో జరిగే ఈ టోర్నీని తెలంగాణ రైఫిల్‌ సంఘం అధ్యక్షుడు అమిత్‌ సంఘీ ప్రారంభించారు. ఈ పోటీలకు నూతనంగా ఏర్పాటైన షూటింగ్‌ రేంజ్‌ ఆతిథ్యమిచి్చంది. రంగారెడ్డి జిల్లా సంఘీనగర్‌లో కొత్తగా నిర్మించిన ‘అమన్‌ సంఘీ 300మీ. బిగ్‌ బోర్‌ షూటింగ్‌ రేంజ్‌’ ఈ పోటీలకు వేదికైంది. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపు 100 మంది షూటర్లు పాల్గొంటున్నారు. ఇందులో రాణించిన వారు ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు జరిగే సౌత్‌జోన్‌ టోర్నీలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. 

సింధు వర్సెస్‌ తై జు యింగ్‌
ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణులు, కోర్టులో సమఉజ్జీలు... సింధు, తై జు యింగ్‌. వీరిద్దరి మధ్య జరిగే సమరంపై అందరికీ ఆసక్తే. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌ మెగా టోర్నీలో తై జు యింగ్‌పై గెలుపొంది సింధు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో భాగంగా వీరిద్దరూ నేడు మరోసారి తలపడనున్నారు. గచ్చి»ౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ బెంగళూరు రాప్టర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ ఆడుతుంది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాభిమానులంతా మహిళల సింగిల్స్‌లో భాగంగా ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సింధు, వరల్డ్‌ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ మధ్య నగరంలో జరిగే మ్యాచ్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. 

సింధు కూడా ఈ మ్యాచ్‌ కోసం సన్నద్ధంగా ఉన్నానని పేర్కొం ది. ‘తై జు యింగ్‌ తో ఆడటం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది. అంత సులభంగా విజయం దక్కదు. శ్రమించాల్సి వస్తుంది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడనుండటం నాకు కలిసొచ్చే అంశం. మా మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం. ఈ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నా’ అని సింధు వివరించింది. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు ఈ సీజన్‌లో వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బెంగళూరు బరిలో దిగుతోంది. దీనిపై స్పందిస్తూ తై జు యింగ్‌ ‘ఈ మ్యాచ్‌లో గెలవడం మాకు చాలా ముఖ్యం. సింధుతో నేడు జరిగే మ్యాచ్‌ మిగతా మ్యాచ్‌ల కంటే విభిన్నంగా ఉంటుంది. పీబీఎల్‌ అంటే టీమ్‌ గేమ్‌. జట్టుగా ఆడాల్సి ఉంది’ అని పేర్కొంది.     

మరిన్ని వార్తలు