దక్షిణాసియా క్రీడల మస్కట్‌గా టిఖోర్

14 Dec, 2015 02:21 IST|Sakshi

ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు క్రీడలు
గువాహటి, షిల్లాంగ్ ఆతిథ్యం

 
గువాహటి: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు జరిగే దక్షిణాసియా క్రీడల మస్కట్, లోగోలను కేంద్ర క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మేఘాలయ క్రీడా మంత్రి జెనిత్ సంగ్మా పాల్గొన్నారు. పోటీలు గువాహటి (అస్సాం), షిల్లాంగ్ (మేఘాలయ) నగరాల్లో జరుగుతాయి. మస్కట్‌గా ‘టిఖోర్’ (ఒంటి కొమ్ముతో ఉండే ఖడ్గమృగం)ను ఎంపిక చేశారు.

లోగోలో పోటీల్లో పాల్గొనే దేశాల సంఖ్యను సూచిస్తూ ఎనిమిది పూరేకులను పొందుపరిచారు. ఓవరాల్‌గా ఎనిమిది దేశాలకు చెందిన 4500 మంది అథ్లెట్లు, అధికారులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. పది రోజుల పాటు 23 ఈవెంట్స్‌లో పోటీలు జరుగుతాయి. చివరిసారి దక్షిణాసియా క్రీడలు 2010లో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగాయి. భారత్ 90 స్వర్ణాలు, 55 రజతాలు, 30 కాంస్య పతకాలతో కలిపి ఓవరాల్‌గా 175 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
 

మరిన్ని వార్తలు