‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ కేంద్రంగా స్పోర్ట్స్‌ స్కూల్‌

17 Jun, 2020 03:49 IST|Sakshi

ప్రకటించిన కేంద్ర క్రీడా శాఖ

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని మరింత ఫలవంతం చేసేందుకు క్రీడా శాఖ పటిష్ట కార్యాచరణతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు తెలంగాణలో హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ను ‘ఖేలో ఇండియా స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (కేఐఎస్‌సీఈ)’ కేంద్రంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు రాగా మెరుగైన క్రీడా వసతులున్న ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర దక్కింది.

అందులో తెలంగాణలోని హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ ఒకటి. దీనితో పాటు కర్ణాటక, ఒడిశా, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మిజోరామ్, నాగాలాండ్‌ రాష్ట్రాలు కూడా కేఐఎస్‌సీఈలను ఏర్పాటు చేయనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, శిక్షణ, వసతుల ఆధారంగానే వీటిని ఆమోదించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. వీటి అభివృద్ధికి కేంద్రం నుంచి గ్రాంట్‌ లభించనుంది. కేఐఎస్‌సీఈ హోదాకు తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ను ఎంపిక చేయడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు