అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్‌

20 May, 2019 05:03 IST|Sakshi

ఇది పూర్తిగా వ్యక్తిగతం

‘సుప్రీం’ తీర్పే ధైర్యం

అథ్లెటిక్స్‌ కెరీర్‌ను కొనసాగిస్తా  

న్యూఢిల్లీ: భారత వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపుకెక్కిన ద్యుతీ చంద్‌ తన స్వలింగ సహజీవనంపై  పెదవి విప్పింది. ఓ టీనేజ్‌ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా చెప్పింది. ఇటీవల కాలంలో కొందరు క్రీడాకారిణులు ఇలా బయటపడిన సంగతి తెలిసిందే. కొందరైతే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలో సహజీవనంపై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్‌ ద్యుతీనే కావడం గమనార్హం! ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్‌ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది.

భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ వెల్లడించింది. తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆమె తన సోదరుడి భార్య నచ్చకపోతే ఇంటిలో నుంచి గెంటేసిందని చెప్పింది. తనను ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించిందని వెల్లడించింది. అయితే మేజర్‌ అయిన తను స్వతంత్రంగా ఉండాలనే నిర్ణయించుకున్నానని... అందుకే బహిరంగంగా తన సహజీవనంపై మాట్లాడుతున్నానని ద్యుతీ చెప్పుకొచ్చింది. ‘ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఎప్పటిలాగే నా కెరీర్‌ను కొనసాగిస్తాను. వచ్చే నెలలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొంటాను. ప్రపంచ చాంపియన్‌షిప్, టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాను.

నా భాగస్వామి అనుమతితోనే సహజీవనాన్ని బహిర్గతం చేశాను. ఇలా బయట పడటానికి మరో కారణం కూడా ఉంది. గతంలో పింకీ ప్రమాణిక్‌ అనే మహిళా అథ్లెట్‌ తన సహచర అథ్లెట్‌ను బలాత్కారం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది. అందుకే అన్ని ఆలోచించాకే, భాగస్వామితో చర్చించాకే మా బంధాన్ని బయటపెట్టాను. పైగా సుప్రీం కోర్టు తీర్పుకూడా మేం బయటపడేందుకు ధైర్యాన్నిచ్చింది’ అని ద్యుతీచంద్‌ వివరించింది. గతంలో ఆమె కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కొంది. పురుష హార్మోన్లు ఉన్నట్లు తేలడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఐఏఏఎఫ్‌) ఆమెపై నిషేధం విధించింది.

దీన్ని ఆమె ఆర్బిట్రేషన్‌ కోర్టులో సవాలు చేసి విజయం సాధించి మళ్లీ ట్రాక్‌లో అడుగుపెట్టింది. గతేడాది సుప్రీం కోర్టు మేజర్లయిన వారిమధ్య స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. అయితే ఒకే లింగానికి చెందిన ఇరువురి మధ్య పెళ్లికి మాత్రం భారత్‌లో చట్టబద్ధత లేదు.  తెలంగాణ కోచ్‌ నాగపురి రమేశ్‌ మార్గదర్శనంలో పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న ద్యుతీ చంద్‌ గత ఏడాది జకార్తా ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు గెలిచింది. ఇటీవల దోహాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం నెగ్గింది.

మరిన్ని వార్తలు