చాంపియన్‌ శ్రీజ

28 Jun, 2019 08:48 IST|Sakshi
తెలంగాణ టీటీ ప్లేయర్‌ ఆకుల శ్రీజకు చెక్‌ అందజేస్తున్న కేటీఆర్, వై.శ్రీధర్, జయేశ్‌ రంజన్‌

జాతీయ సీనియర్‌ ర్యాంకింగ్‌ టీటీ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఇన్నాళ్లూ జూనియర్, యూత్‌ స్థాయిల్లో పలు టైటిల్స్‌ సాధించిన తెలంగాణ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి ఆకుల శ్రీజ తొలిసారి సీనియర్‌ స్థాయిలో విజేతగా నిలిచింది. హరియాణాలోని సోనెపట్‌లో గురువారం ముగిసిన జాతీయ సీనియర్‌ ర్యాంకింగ్‌ టీటీ టోర్నమెంట్‌లో 20 ఏళ్ల శ్రీజ మహిళల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున బరిలోకి దిగిన శ్రీజ ఫైనల్లో 6–11, 7–11, 14–12, 13–11, 11–9, 11–9తో సుతీర్థ ముఖర్జీ (హరియాణా)పై విజయం సాధించింది. తొలి రెండు గేమ్‌లను చేజార్చుకున్న శ్రీజ ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో వరుసగా నాలుగు గేముల్లో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.  

రూ. 15 లక్షల ఆర్థిక సహాయం... 
జాతీయ ర్యాంకింగ్‌ టీటీ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా గుర్తింపు పొందిన శ్రీజను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు (కేటీఆర్‌) అభినందించారు. ఈ సందర్భంగా శ్రీజ, కోచ్‌ సోమ్‌నాథ్‌ ఘోష్‌కు శ్రీచైతన్య గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ డైరెక్టర్‌ వై.శ్రీధర్‌ రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్‌బీఐలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉన్న శ్రీజకు కోచ్‌గా సోమ్‌నాథ్‌ ఘోష్‌ వ్యవహరిస్తున్నారు. నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఎల్‌) సంస్థ సహకారంతో కూకట్‌పల్లిలోని సెంట్రల్‌ మాల్‌లో ఘోష్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీని నెలకొల్పారు. ప్రస్తుతం శ్రీజ ఇదే అకాడమీలో శిక్షణ పొందుతోంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ అకాడమీని రాష్ట్ర ఐటీ డిపార్ట్‌మెంట్‌ సీఆర్‌ఓ ఆత్మకూరి అమర్‌నాథ్‌ రెడ్డి ప్రారంభించారు.   

మరిన్ని వార్తలు