శ్రీజ తీన్‌మార్‌

23 Jul, 2019 07:14 IST|Sakshi

కామన్వెల్త్‌ టీటీ పోటీల్లో మూడు పతకాలు నెగ్గిన తెలంగాణ అమ్మాయి

వ్యక్తిగత విభాగంలోనూ భారత్‌ క్లీన్‌స్వీప్‌

1975 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డు

కటక్‌: సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ వ్యక్తిగత విభాగంలోనూ భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇంతకుముందు టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు నెగ్గగా... సోమవారం ముగిసిన వ్యక్తిగత విభాగంలో అందుబాటులో ఉన్న ఐదు పసిడి పతకాలను భారత క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ మూడు పతకాలు సాధించింది. మహిళల డబుల్స్‌లో మౌసుమి పాల్‌తో జతకట్టి బరిలోకి దిగిన శ్రీజ రజతం సాధించగా... మహిళల సింగిల్స్‌లో సెమీస్‌లో ఓడి ఆమె కాంస్యం సంపాదించింది. ఆదివారం మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ జోడీ సెమీస్‌లో ఓడి కాంస్యం దక్కించుకుంది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో శ్రీజ 8–11, 9–11, 11–9, 8–11, 12–14తో మధురిక పాట్కర్‌ (భారత్‌) చేతిలో ఓడింది. డబుల్స్‌ ఫైనల్లో శ్రీజ–మౌసుమి పాల్‌ ద్వయం 9–11, 8–11, 11–9, 10–12తో పూజా సహస్రబుద్దె–కృత్విక సిన్హా రాయ్‌ (భారత్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది.

పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగంలో వరుసగా హర్మీత్‌ దేశాయ్, అహిక ముఖర్జీ కామన్వెల్త్‌ చాంపియన్స్‌గా అవతరించారు. ఫైనల్స్‌లో హర్మీత్‌ 9–11, 6–11, 11–5, 11–8, 17–15, 7–11, 11–9తో సత్యన్‌ జ్ఞానేశేఖరన్‌ (భారత్‌)పై, అహిక 11–6, 11–4, 11–9, 11–7తో మధురిక (భారత్‌)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో ఆంథోనీ అమల్‌రాజ్‌–మానవ్‌ ఠక్కర్‌ (భారత్‌) జంట 8–11, 11–6, 13–11, 12–10తో సత్యన్‌–శరత్‌ కమల్‌ (భారత్‌) ద్వయంపై గెలిచి టైటిల్‌ గెలిచింది. ఆదివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సత్యన్‌–అర్చన కామత్‌ జంట స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత్‌ అందుబాటులో ఉన్న 7 స్వర్ణాలను సొంతం చేసుకుంది. స్వర్ణాలే కాకుండా భారత క్రీడాకారులు ఐదు రజతాలు, మూడు కాంస్యాలనూ సాధించి 15 పతకాలతో అదరగొట్టారు. 1975లో ఇంగ్లండ్‌ తర్వాత కామన్వెల్త్‌ టీటీ చాంపియన్‌షిప్‌లో అన్ని విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పింది.

మరిన్ని వార్తలు