శ్రీజేష్‌కు భారత హాకీ పగ్గాలు

13 Jul, 2016 00:12 IST|Sakshi
శ్రీజేష్‌కు భారత హాకీ పగ్గాలు

మహిళల జట్టుకు సుశీలా చాను నాయకత్వం
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ప్రకటించారు. సర్దార్ సింగ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి సీనియర్ గోల్ కీపర్ శ్రీజేష్‌కు నాయకత్వం అప్పగించారు. అయితే తుది జట్టులో మాత్రం తను చోటు దక్కించుకున్నాడు. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో శ్రీజేష్ నేతృత్వంలోనే భారత్ రజతం సాధించింది. సునీల్ వైస్‌కెప్టెన్‌గా ఉంటాడు. ‘కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో సర్దార్  ఒలింపిక్స్‌లో విశేషంగా రాణిస్తాడని నమ్ముతున్నాను.

కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం సర్దారే తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తరహా ఆటతీరునే ఒలింపిక్స్‌లోనూ ప్రదర్శిస్తాం’ అని కోచ్ ఓల్ట్‌మన్స్ తెలిపారు. అలాగే జట్ల ప్రకటనతో పాటు ఆటగాళ్ల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ హాకీ బృందానికి దేశం తరఫున, ప్రధాని మోదీ తరఫున శుభాకాంక్షలు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి విజయ్ గోయల్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు లియాండ్రో నెగెరే, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సాయ్ డీజీ ఇంజేటి శ్రీనివాస్, ఐఓఏ ప్రధాన కార్యదర్శి, రాజీవ్ మెహతా, మాజీ హాకీ ఒలింపియన్స్ పాల్గొన్నారు.
 
రీతూ రాణిపై వేటు: మరోవైపు మహిళల జట్టుకు చాలాకాలంగా కెప్టెన్‌గా కొనసాగుతున్న రీతూ రాణిపై ఊహించినట్టుగానే వేటు పడింది. సుశీలా చాను తన స్థానంలో సారథిగా వ్యవహరించనుంది. క్రమశిక్షణాచర్యల కింద రీతూపై హాకీ ఇండియా చర్యలు తీసుకుంది. 1980 మాస్కో గేమ్స్‌లో చివరిసారిగా మహిళల జట్టు ఒలింపిక్స్‌లో పాల్గొంది.
 
పురుషుల జట్టు: శ్రీజేష్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్, రూపిందర్‌పాల్, కొతజిత్ సింగ్, సురేందర్, మన్‌ప్రీత్, సర్దార్ సింగ్, వీఆర్ రఘునాథ్, ఎస్‌కే ఉతప్ప, డానిష్ ముజ్తబా, దేవిందర్ వాల్మీకి, ఎస్‌వీ సునీల్, ఆకాశ్‌దీప్, చింగ్లెన్‌సన, రమణ్‌దీప్, తిమ్మయ్య.
 
మహిళల జట్టు: సుశీలా చాను (కెప్టెన్), నవ్‌జ్యోత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, మోనిక, నిక్కీ ప్రధాన్, అనురాధ దేవి, సవిత, పూనమ్ రాణి, వందన, దీపికా, నమిత, రేణుకా యాదవ్, సునీత లక్రా, రాణి రాంపాల్, ప్రీతి దూబే, లిలిమ మింజ్.

మరిన్ని వార్తలు