శ్రీశాంత్‌కు భారీ ఊరట

20 Aug, 2019 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ: స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్న భారత పేసర్‌ శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్లకు కుదిస్తూ బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్‌ అతనిపై ఉన్న జీవిత కాల నిషేధాన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే ఏడేళ్ల నిషేధం సరిపోతుందని స్పష్టం చేశారు. ఫలితంగా వచ్చే ఏడాది ఆగస్టు నెలకు శ్రీశాంత్‌పై ఉన్న నిషేధం తొలగిపోనుంది.

‘నిషేధ కాలంలో శ్రీశాంత్‌ ఎటువంటి క్రికెట్‌ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాంతో పాటు బీసీసీఐ యాక్టివిటీలకు కూడా దూరంగా ఉన్నాడు. దాంతో అతనిపై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశాం. ఇది 2013 సెప్టెంబర్ట్‌ 13వ తేదీ నుంచి వర్తిస్తుంది’ అని డీకే జైన్‌ తెలిపారు. ప్రస్తుతం 36వ ఒడిలో ఉన్న శ్రీశాంత్‌ తనపై అన్యాయంగా ఫిక్సింగ్‌ ఆరోపణలు మోపి ఇరికించారని పోరాడుతూనే ఉన్నాడు. దీనిపై పలుమార్లు సుప్రీంకోర్టుకు వెళ్లి తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరాడు. దానిలో భాగంగానే  శ్రీశాంత్‌కు శిక్ష తగ్గించే విషయంపై ఆలోచించాలని బీసీసీఐకి సూచించిన సుప్రీం కోర్టు ఆ అధికారాన్ని అంబుడ్స్‌మన్‌కు అప్పగించింది. ఎట్టకేలకు తనపై ఉన్న నిషేధం తగ్గడంతో శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించినట్లయ్యింది. 2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు