'నాపై నిషేధం ఎత్తివేయమని ఆదేశాలివ్వండి'

2 Mar, 2017 13:08 IST|Sakshi
'నాపై నిషేధం ఎత్తివేయమని ఆదేశాలివ్వండి'

కొచ్చి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)చే జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న కేరళ పేసర్ శ్రీశాంత్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు. ఇటీవల తనపై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐ కొత్త పరిపాలన కమిటికీ లేఖ రాసిన శ్రీశాంత్ కు అక్కడ నిరాశే ఎదురుకావడంతో తాజాగా కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.  తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేరళ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.


స్కాట్లాండ్ లీగ్ తరపున ఆడేందుకు శ్రీశాంత్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అతనికి క్లియరెన్స్ లభించాల్సి ఉంది.  ఏప్రిల్ తొలి వారంలో స్కాట్లాండ్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానున్నతరుణంలో తనకు ఎన్ఓసీ కావాలంటూ బీసీసీఐకి  శ్రీశాంత్ విన్నవించాడు. అయితే దీనికి బీసీసీఐ నిరాకరించడంతో శ్రీశాంత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాడు. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు.

 

2013లో శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై జీవితకాలం నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే 2015లో అతడు ఏ తప్పు చేయలేదంటూ ఢిల్లీ కోర్టులో క్లీన్చిట్ లభించింది. కాగా, అతనికి కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించినా,బీసీసీఐ పెద్దలు మాత్రం అతనిపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా పలుమార్లు బీసీసీఐకి  శ్రీశాంత్ విజ్ఞప్తి చేసి విఫలమయ్యాడు. కొన్ని రోజుల క్రితం బీసీసీఐ పాలన వ్యవహారాలను చూస్తున్న వినోద్ రాయ్ కు శ్రీశాంత్ ఓ లేఖ రాసినా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో శ్రీశాంత్ కోర్టు మెట్లెక్కాడు.

మరిన్ని వార్తలు