క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు

26 Mar, 2018 17:38 IST|Sakshi
టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్

సాక్షి, న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌ వివాదం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ తీవ్రంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ అనేది ఇప్పుడే కనిపెట్టిన విషయమే కాదని, దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతుందన్నాడు. టీమిండియాకు కూడా బాల్ ట్యాంపరింగ్ తెలుసునని, వారికి ఇది కొత్తేమీ కాదన్నాడు శ్రీశాంత్. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌ పాల్పడ్డ బాల్ ట్యాంపరింగ్ వివాదంపై స్పందించిన భారత క్రికెటర్లు, మాజీలు ఓ సారి తన వివాదంపై కూడా స్పందిస్తే మంచిదన్నాడు.

ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్‌ స్మిత్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి అతడిని తొలగిస్తూ అజింక్యా రహానేకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీఎల్ సమయం ఆసన్నమైంది కనుక.. ఇప్పుడైనా తనపై విధించిన క్రికెట్‌ బ్యాన్‌పై నిర్ణయం తీసుకోవాలన్నాడు. ఐసీసీ, బీసీసీఐ పెద్దలు తనకు క్రికెట్ మళ్లీ ఆడే అవకాశం ఇవ్వాలని కోరాడు. బాల్ ట్యాంపరింగ్ క్లబ్ స్థాయి క్రికెట్‌లోనూ ఉందని, ఆసీస్  జట్టు చేసిన ట్యాంపరింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని తెలిపాడు. శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్‌లోనూ ఆడుతున్న వారిలో ఆరుగురు నుంచి 10 మంది టాప్‌ ప్లేయర్లకు ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని శ్రీశాంత్ గతంలో ఆరోపించాడు. కానీ బీసీసీఐ తన ఒక్కడిపైనే కక్ష సాధించిందని.. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు కూడా నమోదు చేశారని చెప్పాడు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. 

2013 జూలైలో ఐపీఎల్‌-6 సందర్భంగా స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌, అజిత్‌ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. అప్పటి నుంచి క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు శ్రీశాంత్.

మరిన్ని వార్తలు