ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్‌..!

7 May, 2018 23:55 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌కు బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య కడవరకూ హోరాహోరీగా సాగిన పోరులో సన్‌రైజర్స్‌ పైచేయి సాధించింది. ఇది సన్‌రైజర్స్‌కు ఎనిమిదో విజయం.  దాంతో సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్‌ బెర్తు ఖాయమైనట్లే. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 146 పరుగులకు ఆలౌటైంది. అయితే లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ తడబాటుకు గురైంది. 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఐదు వికెట్లలో కోహ్లి(39;30 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌), పార్థీవ్‌ పటేల్‌(20;13 బంతుల్లో 4 ఫోర్లు)లు మాత్రమే ఫర్వాలేదనించారు.

కాగా,  ఆరో వికెట్‌కు గ్రాండ్‌ హోమ్‌-మన్‌దీప్‌ సింగ్‌ల జోడి 57 పరుగులు జోడించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. చివరి ఓవర్‌లో ఆర్సీబీ విజయానికి 12 పరుగులు  అవసరమైన తరుణంలో ఆరు పరుగులు మాత్రమే సాధించడంతో ఓటమి తప్పలేదు. సన్‌ రైజర్స్‌ బౌలర్లలో షకిబుల్‌ హసన్‌ రెండు వికెట్లు సాధించగా, సందీప్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ మ్యాచ్‌లో ఓటమితో ఆర్సీబీ ప్లే ఆఫ్‌ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.

అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  కేన్‌ విలియమ్సన్‌(56;39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షకిబుల్‌ హసన్‌(35;32 బంతుల్లో 5 ఫోర్లు)లు మినహా ఎవరూ రాణించకపోవడంతో సన్‌రైజర్స్‌ సాధారణ స్కోరును మాత్రమే నమోదు చేసింది.

సన్‌రైజర్స్‌ ఓపెనర్లు అలెక్స్‌ హేల్స్‌(5), శిఖర్‌ ధావన్‌(13)లు నిరాశపరిచారు. జట్టు 15 పరుగుల వద్ద హేల్స్‌ ఔట్‌ కాగా, ఆపై మరో 23 పరుగుల వ్యవధిలో ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత మనీష్‌ పాండే(5) కూడా విఫలం కావడంతో సన్‌రైజర్స్‌ 48 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తరుణంలో విలియమ్సన్‌-షకిబుల్‌ హసన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి కుదురుగా ఆడుతూ 64 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలోనే విలియమ్సన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

కాగా, విలియమ్సన్‌, షకిబుల్‌లు 12 పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ స్కోరు మందగించింది. యూసఫ్‌ పఠాన్‌(12), సాహా(8)లు కూడా స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరడంతో ప్రధానంగా స్థానిక ఆటగాడు మొహ్మద్‌ సిరాజ్‌ విజృంభించి బౌలింగ్‌ చేశాడు.. నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు వికెట్ల సాధించిన సిరాజ్‌ సన్‌రైజర్స్‌కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లో యూసఫ్‌ పఠాన్‌, సాహా వికెట్లను తీసి సన్‌రైజర్స్‌కు ఝలక్‌ ఇచ్చాడు. అతనికి జతగా సౌతీ మూడు వికెట్లతో సత్తా చాటగా, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌కు తలో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు