ఆర్సీబీ లోగోపై సన్‌రైజర్స్‌ ఫన్నీ కామెంట్‌

14 Feb, 2020 15:49 IST|Sakshi

లోగో మారింది.. పేరు కూడా మారుతుందా?

బెంగళూరు:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కొత్త సీజన్ ఆరంభానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్న తరుణంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీ కొత్త లోగోను ఆవిష్కరించింది.  ‘మీరు ఎదురు చూసిన క్షణం ఇదే. కొత్త ఆర్సీబీ.. కొత్త దశాబ్దం.. కొత్త లోగో అంటూ పేర్కొంది. అయితే ఆర్సీబీ కొత్త లోగోపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫన్నీగా రిప్లే ఇచ్చింది. ‘ ఈసాల లోగో చాలా బాగుంది’ అంటూ బెయిర్‌ స్టో, డేవిడ్‌ వార్నర్‌ల ఫోటోను పోస్ట్‌ చేసింది.2008 నుంచి ఆర్సీబీ లోగో మారడం ఇది మూడోసారి.

ఆర్సీబీ తమ మార్పుల్లో భాగంగా సోషల్ మీడియా అకౌంట్స్‌లోనూ ప్రొఫైల్ ఫొటోల్ని మార్చడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. కనీసం ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి సమాచారం ఇవ్వకుండానే వాటిని తొలగించింది ఆర్సీబీ. దీనిపై కోహ్లి సైతం ఆశ్చర‍్యం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి మిన్నుకుండిపోయాడు. అయితే ప్రస్తుతానికి ఆర్సీబీ లోగో మార్చగా, తమ అదృష్టాన్ని మార్చడానికి పేరులో కూడా ఏమైనా స్వల్ప మార్పులు ఉంటాయేమో చూడాలి. ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్‌ టైటిల్‌ కూడా సొంతం చేపసుకోలేకపోవడంతో ఆర్సీబీ మార్పులు చేపట్టడానికి సిద్ధమైంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గతంలో తమ ఫ్రాంచైజీ పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చడాన్ని ఆర్సీబీ ఉదాహరణగా తీసుకున్నట్లే కనబడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మారిన తర్వాత ఆ జట్టు మెరుగైన ఫలితాలు సాధించింది. దాంతో ఆర్సీబీ కూడా తమ ఫేట్‌ను లోగోలతో, పేరుతో మార్చుకోవాలని చూస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. ఇప్పటి వరకూ 12 సీజన్లు ముగిశాయి. 2016లో ఫైనల్‌కి చేరిన ఆర్సీబీ.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరుస్తోంది. 2019 సీజన్‌లో వరుస పరాజయాల్ని చవిచూసిన ఆ జట్టు.. కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. ఐపీఎల్ 2020 సీజన్‌లోనైనా టైటిల్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. మార్చి 29వ  తేదీ నుంచి ఐపీఎల్‌ ఆరంభం కానుంది. (ఇక్కడ చదవండి: ‘ఆర్‌సీబీ’ పేరులో మార్పు?)

మరిన్ని వార్తలు