ఎవరిదో పైచేయి!

4 Jun, 2019 03:44 IST|Sakshi
కరుణరత్నే, గుల్బదిన్‌

నేడు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌

తొలి విజయంపై రెండు జట్ల దృష్టి

మ.3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ చాంపియన్‌. రెండు సార్లు రన్నరప్‌ కూడా! అయితే ఇది గతం. ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నం. మరోవైపు క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ కూనే! కానీ ఎదుగుతున్న తీరు, ఆడుతున్న ఆట చక్కగా ఉంది. ఇరు జట్ల మధ్య నేడు మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో లంకపై అఫ్గాన్‌ పైచేయి సాధించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రెండు జట్ల తొలి మ్యాచ్‌ ప్రదర్శన చూస్తే ఎవరైనా ఈ పోరులో శ్రీలంకకు కష్టాలు తప్పవనే అంటారు. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో శ్రీలంక 10 వికెట్ల తేడాతో కివీస్‌ చేతిలో పరాభవం చవిచూసింది.

కెప్టెన్‌ కరుణరత్నే మినహా ఇంకెవరూ నిలబడే సాహసమే చేయలేదు. 11 మందిలో ఏకంగా ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక బౌలింగ్‌లో లంక ఆశలన్నీ సీనియర్‌ పేసర్‌ మలింగపైనే. కానీ అతను కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో జట్టు పరిస్థితి ఘోరంగా మారింది.  గత మ్యాచ్‌లో డకౌటైన మాథ్యూస్‌ ఆల్‌రౌండర్‌గా విజయవంతమైతేనే జట్టు పరిస్థితిలో మార్పు రావొచ్చు. మరోవైపు గుల్బదిన్‌ నైబ్‌ సారథ్యంలోని అఫ్గానిస్తాన్‌ కూడా తొలి మ్యాచ్‌లో ఓడింది... కానీ ప్రపంచకప్‌లో అద్వితీయమైన రికార్డు ఉన్న ఆసీస్‌ను సమర్థంగా ఎదుర్కొంది.

ఓపెనర్లు షహజాద్, హజ్రతుల్లా డకౌట్‌ కావడం, ఆల్‌రౌండర్‌ నబీ విఫలమవడంతో తడబడింది. లేదంటే మరింత మెరుగైన స్కోరు చేసేది. ఈ మ్యాచ్‌లో వీళ్లంతా కష్టపడితే మాత్రం అఫ్గాన్‌ బోణీ అవకాశాల్ని కొట్టిపారేయలేం. ఇçప్పుడున్న పరిస్థితుల్లో లంక కంటే అఫ్గానే మెరుగైన ఆల్‌రౌండ్‌ జట్టుగా సమతూకంతో ఉంది.  ముఖాముఖిగా ఇప్పటివరకు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ జట్లు మూడుసార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గగా... మరో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ గెలిచింది.

భారత్‌ ‘ఎ’ ఘనవిజయం
హుబ్లీ: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ జట్టు 152 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 430 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 210/7తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక ‘ఎ’ మరో 67 పరుగులు జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్‌ ‘ఎ’ బౌలర్లలో లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ 112 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.

శివమ్‌ దూబేకు రెండు వికెట్లు లభించగా... సందీప్‌ వారియర్, ఆదిత్య సర్వతే, జయంత్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. భారత్‌ ‘ఎ’ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించిన ఆంధ్ర రంజీ క్రికెటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగా... శ్రీలంక ‘ఎ’ 212 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 372 పరుగులు సాధించి శ్రీలంక ‘ఎ’కు 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఈనెల 6న తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.

మరిన్ని వార్తలు