శ్రీలంక గట్టెక్కింది

5 Jun, 2019 03:43 IST|Sakshi

చేజేతులా ఓడిన అఫ్గానిస్తాన్‌

34 పరుగులతో పరాజయం

రాణించిన కుశాల్‌ పెరీరా

నువాన్‌ ప్రదీప్‌కు 4 వికెట్లు   

కార్డిఫ్‌: వరల్డ్‌ కప్‌లో మాజీ చాంపియన్‌ శ్రీలంక బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత విమర్శలకు గురైన ఆ జట్టు రెండో పోరులో అఫ్గానిస్తాన్‌ను ఓడించి పరువు కాపాడుకుంది. బౌలింగ్‌లో కనబర్చిన స్ఫూర్తిదాయక ఆటతీరును బ్యాటింగ్‌లో చూపించలేని అఫ్గాన్‌ స్వయంకృతంతో అరుదైన విజయం సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది.  మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 34 పరుగులతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 36.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది.

కుశాల్‌ పెరీరా (81 బంతుల్లో 78; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మొహమ్మద్‌ నబీ (4/30) ప్రత్యర్థిని పడగొట్టాడు. అఫ్గానిస్తాన్‌ విజయలక్ష్యాన్ని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 187 పరుగులుగా నిర్ణయించారు. అఫ్గాన్‌ 32.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. నజీబుల్లా (56 బంతుల్లో 43; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నువాన్‌ ప్రదీప్‌ (4/31), మలింగ (3/39) అఫ్గాన్‌ను దెబ్బ తీశారు. ఒకే ఓవర్లో నబీ 3 వికెట్లు: శ్రీలంక ఓపెనర్లు కుశాల్‌ పెరీరా, కరుణరత్నే (45 బంతుల్లో 30; 3 ఫోర్లు) చక్కటి సమన్వయంతో ఆడుతూ శుభారంభం అందించారు.

మొదటి వికెట్‌కు 13 ఓవర్లలోనే 92 పరుగులు జోడించడం విశేషం. కరుణరత్నేను నబీ ఔట్‌ చేయడంతో లంక తొలి వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 22వ ఓవర్లో నబీ మూడు వికెట్లు తీసి లంకను దెబ్బ కొట్టాడు. ముందుగా తిరిమన్నె బౌల్డ్‌ కాగా... కుశాల్‌ మెండిస్‌ (2), మాథ్యూస్‌ (0) కూడా పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాతి నుంచి లంక పతనం వేగంగా సాగింది. సునాయాస లక్ష్య ఛేదనలో అఫ్గానిస్తాన్‌ బ్యాటింగ్‌ తడబడింది. చేయాల్సిన రన్‌రేట్‌ 4.5 పరుగులే ఉన్నా, ఆ జట్టు ఆటగాళ్లు అనవసర ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు.   

మరిన్ని వార్తలు