ధనంజయ మాయాజాలం

13 Aug, 2018 04:57 IST|Sakshi
అఖిల ధనంజయ

ఆరు వికెట్లతో దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన లంక స్పిన్నర్‌

చివరి వన్డేలో 178 పరుగులతో ఆతిథ్య జట్టు ఘన విజయం

కొలంబో: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో శ్రీలంక 178 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఆతిథ్య స్పిన్నర్‌ అఖిల ధనంజయ (6/29) సఫారీని తిప్పేశాడు. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ మాథ్యూస్‌ (97 బంతుల్లో 97 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో ఓపెనర్‌ డిక్‌వెలా (65 బంతుల్లో 43; 5 ఫోర్లు), మెండిస్‌ (38), డిసిల్వా (30) మెరుగ్గా ఆడారు. సఫారీ బౌలర్లలో మల్డర్, ఫెలుక్‌వాయో చెరో 2 వికెట్లు పడగొట్టారు. రబడ, డాలా, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ధనంజయ ఆఫ్‌స్పిన్‌ సుడిలో చిక్కుకుంది. సగం ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. 24.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ డికాక్‌ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. లహిరు కుమారకు 2 వికెట్లు దక్కాయి. ధనంజయ తన కెరీర్‌లో రెండోసారి ఒకే మ్యాచ్‌లో ఆరు వికెట్లను చేజిక్కించుకున్నాడు. అజంత మెండిస్‌ (శ్రీలంక), షాహిద్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌) తర్వాత వన్డే క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మూడో భారీ పరాభవాన్ని చవిచూసింది. అయితే ఐదు వన్డేల సిరీస్‌ను ఇదివరకే నెగ్గిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను 3–2తో ముగించింది. 

మరిన్ని వార్తలు