లంక విజయం

2 Jul, 2019 05:01 IST|Sakshi
అవిష్క ఫెర్నాండో

అవిష్క ఫెర్నాండో సెంచరీ

విండీస్‌కు వరుసగా ఏడో ఓటమి

నికోలస్, అలెన్‌ పోరాటం వృథా

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: రేసులో లేని మ్యాచ్‌లో శ్రీలంక పరుగుల డోసు పెంచింది. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి 300 మార్కు దాటింది. చివరకు 23 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీస్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (103 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, కుశాల్‌ పెరీరా (51 బంతుల్లో 64; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. హోల్డర్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసి పోరాడి ఓడింది.

నికోలస్‌ పూరన్‌ (103 బంతుల్లో 118; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టగా, అలెన్‌ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మలింగకు 3 వికెట్లు దక్కాయి. ఫెర్నాండోకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ఇన్నింగ్స్‌ తడబడుతూ సాగింది. ఓపెనర్‌ అంబ్రిస్‌ (5), షైహోప్‌ (5) మలింగ పేస్‌కు తలవంచారు. గేల్‌ (48 బం తుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా త్వరగానే ఔటయ్యాడు. హెట్‌మైర్‌ (38 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎక్కువగా కష్టపడలేదు. దీంతో 84 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. 

ఈ దశలో నికోలస్‌ పూరన్‌ దాటిగా ఆడటం మొదలుపెట్టాడు. అతనికి కెప్టెన్‌ హోల్డర్‌ (26; 4 ఫోర్లు) కాసేపు తోడయ్యాడు. ఐదో వికెట్‌కు 61 పరు గులు జోడించాక హోల్డర్‌ ఔట్‌కాగా...అనంతరం బ్రాత్‌వైట్‌ (8) రనౌటయ్యాడు. అలెన్‌ వచ్చాక పూరన్‌ మరింత రెచ్చిపోయాడు. గెలుపు మలుపు తీసుకుంటున్న దశలో ధాటిగా ఆడుతున్న అలెన్‌ రనౌటయ్యాడు. తర్వాత 92 బంతుల్లో సెంచరీ చేసుకున్న పూరన్‌ ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించడంతో ఓటమి ఖాయమైంది.

సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఇన్నింగ్స్‌: 338/6 (50 ఓవర్లలో) (అవిష్క ఫెర్నాండో 104, కుశాల్‌ పెరీరా 64, తిరిమన్నె 45 నాటౌట్‌; హోల్డర్‌ 2/59)
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: 315/9 (50 ఓవర్లలో) ( పూరన్‌ 118, అలెన్‌ 51, మలింగ 3/55).

>
మరిన్ని వార్తలు