రెండో వన్డేలో 'కంగారు' పడ్డారు!

24 Aug, 2016 22:22 IST|Sakshi
రెండో వన్డేలో 'కంగారు' పడ్డారు!

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో 82 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంక ఘన విజయం సాధించింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 47.2ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ కీపర్ మాథ్యూ వేడ్ హాఫ్ సెంచరీతో(88 బంతుల్లో 76 పరుగులు; 4 ఫోర్లు) ఆకట్టుకున్నా ఇతర బ్యాట్స్ మన్ నుంచి సహకారం లేకపోవడంతో ఓటమిపాలైంది. తొలి వన్డేలో ఓటమిపాలైన లంక రెండో వన్డేలో నెగ్గి సిరీస్ 1-1తో సమం చేసింది. అంతకు ముందు టాస్ గెలిచిన శ్రీలంక 48.5ఓవర్లలో 288 పరుగుల వద్ద ఆలౌటైంది. లంక తన చివరి 5 వికెట్లను 17 పరుగుల వ్యవధిలో కోల్పోవడంతో సాధారణ స్కోరుకు పరిమితమైంది.

లంక ఇన్నింగ్స్:
ఆరంభంలో కాస్త తడబడిన లంక కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ(69 బంతుల్లో 69 పరుగులు: 9 ఫోర్లు),  చండిమల్(67 బంతుల్లో 48 పరుగులు: 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్ కు సెంచరీ(125 పరుగుల) భాగస్వామ్యంతో కోలుకుంది. వీరిద్దరిని ఆసీస్ బౌలర్ జంపా స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడం ఫలితంగా 158 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి లంకకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఆరో వికెట్ కు కుశాల్ పెరీరా(53 బంతుల్లో 54 పరుగులు: 5 ఫోర్లు, 1 సిక్స్),  లంక కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్(60 బంతుల్లో 57 పరుగులు: 1 ఫోర్, 1 సిక్స్) రాణించి సెంచరీ భాగస్వామ్యాన్ని (103పరుగులు) జతచేశారు. చివర్లో ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్కనర్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం, ఒకే ఓవర్లో స్టార్క్ రెండు వికెట్లు తీయడంతో 300 స్కోరు దాటేలా కనిపించిన లంక 288 పరుగులకే పరిమితమైంది.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జంపా, ఫాల్కనర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా, లియాన్ ఒక్క వికెట్ తీశాడు.

ఆసీస్ ఇన్నింగ్స్:
ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ స్మిత్(30), బెయిలీ(27) పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా లంక బౌలర్లు విజృంభించడంతో ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. చివర్లో హెడ్(31) పరవాలేదనిపించాడు. చివరి రెండు వికెట్లను అపాన్సో తన ఖాతాలో వేసుకున్నాడు. 206 పరుగుల వద్ద ఫాల్కనర్(13) ను ఎల్బీడబ్ల్యూగా అపాన్సో వెనక్కి పంపడంతో ఆసీస్ ఆలౌటైంది. లంక బౌలర్లలో అపాన్సో నాలుగు వికెట్లు పడగొట్టాడు. తీశారా పెరీరా 3 వికెట్లు తీయగా, మాథ్యూస్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు