లంక క్రికెటర్లకు జయసూర్య వార్నింగ్!

9 Feb, 2017 15:42 IST|Sakshi
లంక క్రికెటర్లకు జయసూర్య వార్నింగ్!

కొలంబో: ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై ఆ దేశంతో జరుగుతున్న సిరీస్లలో జట్టు ఆటతీరుపై శ్రీలంక చీఫ్ సెలక్టర్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య స్పందించాడు. వరుస వైఫల్యాలను చవిచూస్తున్న లంక ఆటగాళ్లను హెచ్చరించాడు. విదేశాలలో నెగ్గడం మరిచిపోతే కేవలం లంకలో మాత్రమే క్రికెట్ ఆడతారని ఆటపై దృష్టిపెట్టాలని దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న క్రికెటర్లకు సూచించాడు.  ట్వంటీ20 సిరీస్ను 2-1 తో నెగ్గిన లంకేయులు.. టెస్టుల్లో క్లీన్ స్వీప్ కావడం, ఐదు వన్డేల సిరీస్ లో ఇప్పటికే 4-0తో దారుణ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఉప ఖండంలో ఎక్కువగా స్పిన్ పిచ్ లకు ఆటగాళ్లు అలవాటు పడ్డారని, ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో 15 మంది టాప్ వికెట్ టేకర్స్లో 14 మంది స్పిన్నర్లేనని గుర్తు చేశాడు. ఈ కారణంగానే తమ ఆటగాళ్లు సఫారీ గడ్డపై కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో జట్టును వైఫల్యాలు వెంటాడాయని అభిప్రాయపడ్డాడు. నాలుగో వన్డేలో తరంగ సెంచరీ మినహా ఏ లంక ఆటగాడు టెస్టులు, వన్డేల్లో ఈ పర్యటనలో సెంచరీ నమోదు చేయలేదన్నాడు. దీనికి డొమెస్టిక్ క్రికెట్ను తప్పుపట్టకూడదని చెప్పాడు. తమ ఆటగాళ్లు ఎక్కడైనా ఆడగలరని, కేవలం లంక గడ్డపై అనే అపవాదు వేయడం సరికాదని విమర్శకులను ఉద్దేశించి జయసూర్య వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు