శ్రీలంక క్లీన్‌స్వీప్‌

1 Aug, 2019 10:09 IST|Sakshi

మూడో వన్డేలోనూ బంగ్లాదేశ్‌ ఓటమి

కొలంబో: ఈ మధ్యే జరిగిన ప్రపంచకప్‌ గుర్తుందిగా! బంగ్లాదేశ్‌ అద్భుతంగా ఆడింది. దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. కివీస్‌ చేతిలో ఓడినా... ఆఖరిదాకా వణికించింది. ఇలా పటిష్ట జట్లపై ప్రతాపం చూపిన బంగ్లాదేశ్‌... నెలతిరిగే లోపే చేవలేని శ్రీలంక చేతిలో ‘జీరో’ అయ్యింది. మూడో వన్డేలోనూ ఓడింది. దీంతో శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 122 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. మాథ్యూస్‌ (90 బంతుల్లో 87; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కుశాల్‌ మెండిస్‌ (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్‌ కరుణరత్నే (46), కుశాల్‌ పెరీరా (42) రాణించారు. బంగ్లా బౌలర్లలో షఫీయుల్‌ ఇస్లామ్, సౌమ్య సర్కార్‌ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 36 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. సౌమ్య సర్కార్‌ (86 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే పోరాడాడు. టెయిలెండర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ (39 నాటౌట్‌) మెరుగనిపించాడు. లంక బౌలర్లలో షనక 3, రజిత, లహిరు చెరో 2 వికెట్లు తీశారు. 

మరిన్ని వార్తలు