జయవర్ధనేపై శ్రీలంక బోర్డు గుర్రు

27 Feb, 2016 18:59 IST|Sakshi
జయవర్ధనేపై శ్రీలంక బోర్డు గుర్రు

కొలంబో: మహేలా జయవర్ధనే.. శ్రీలంక మాజీ కెప్టెన్.  జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి తనదైన ముద్రను సంపాదించుకున్న ఆటగాడు. 2014 చివర్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు మెంటర్గా పనిచేస్తున్నాడు. ఇదే జయవర్ధనేకు కష్టాలు తీసుకొచ్చేటట్లు కనబడుతోంది. 

 

దాదాపు ఏడాదిన్నర క్రితమే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జయవర్ధనే అప్పుడే వేరే జట్టుకు సలహాదారుగా పనిచేయడమేమిటని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) పెద్దలు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒక జట్టుకు కోచ్ తదితర పాత్రలు పోషించాలంటే ఏ క్రికెటర్ అయినా వీడ్కోలు సమయం నుంచి కనీసం రెండేళ్లు కాల వ్యవధి తీసుకుంటాడని జయవర్ధనే తీరును ఎస్ఎల్సీ చైర్మన్ తిలంగా సుమిథిపాలా తప్పుబట్టారు. ఈ రకంగా చేయడం వల్ల ఒక జట్టులోని బలంతో పాటు బలహీనతల కూడా అవతలి జట్టుకు చేరే వేసే ప్రమాదం ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది స్పోర్ట్స్ ఎథిక్స్ కు విఘాతం కల్గిస్తుందని పేర్కొన్నారు.  తన దృష్టిలో కోచ్ గా పని చేసే సామర్థ్యం ఉండాలంటే జట్టు నుంచి బయటకొచ్చిన తరువాత రెండేళ్లు కాలపరిమిత తీసుకోవాలని తిలంగా స్పష్టం చేశాడు. మరోవైపు క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై జయవర్ధనే స్పందించాడు. తాను కేవలం ఇంగ్లండ్ క్రికెటర్లకు సాంకేతికంగా సాయపడటానికి మాత్రమే ఈ బాధ్యతను తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకంగా స్పిన్ విషయంలో వీక్ గా ఉండే ఇంగ్లండ్ను తీర్చిదిద్దడం తన కర్తవ్యంలో ఒక భాగమని స్పష్టం చేశాడు.


ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన సిరీస్లో ఇంగ్లండ్ కు జయవర్ధనే మెంటర్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో వరల్డ్ టీ 20 ఆరంభం కానున్న నేపథ్యంలో శ్రీలంక జట్టు బలహీనతల్ని చేరేవేస్తాడనే భయం క్రికెట్ బోర్డు పెద్దల్లో పట్టుకోవడమే ఈ తాజా వ్యాఖ్యలకు కారణం.

మరిన్ని వార్తలు