టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

9 Sep, 2017 14:04 IST|Sakshi
టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

కొలంబో: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య బుధవారం జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో టాస్ విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. టాస్ ను శ్రీలంక గెలిస్తే, భారత్ గెలిచినట్లు భారీ తప్పిదం చేశారంటూ జాతీయ మీడియాలో వార్త హల్ చల్ చేసింది.

టాస్ ను వేసే క్రమంలో ఆతిథ్య జట్టు కెప్టెన్ ఉపుల్ తరంగా-భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే తరంగా కాయిన్ తీసుకుని గాల్లోకి విసరగా, అప్పుడు కోహ్లి హెడ్స్ ను ఎంచుకున్నాడు. కాగా, అది చూసిన  రిఫరీ పాయ్ క్రాఫ్ట్ తొలుత టైల్స్  ఇండియా అంటూ తికమక పడగా, అక్కడ అధికారిక వ్యాఖ్యాతగా ఉన్న మురళీ కార్తీక్ అయోమయానికి గురై కోహ్లి తో చర్చ కొనసాగించారు. ఈ క్రమంలోనే కోహ్లి తొలుత ఫీల్డింగ్ తీసుకున్నారు.

కాగా, టాస్ అయోమయానికి తెరదించాలనే ఉద్దేశంతో శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.  ఈ మేరకు రిఫరీ నుంచి ఎటువంటి తప్పిదం జరగలేదంటూ వివరణ ఇచ్చే యత్నం చేసింది. ఇదిలా ఉంచితే, ఆ వీడియోలో పాయ్ క్రాఫ్ట్  టైల్స్ ఇండియా అన్నారా?లేక హెడ్స్ ఇండియా అన్నారా అనేది మాత్రం ఇప్పటికీ పూర్తిగా స్పష్టత లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.