జయసూర్యపై తీవ్ర ఆరోపణలు

16 Oct, 2018 00:32 IST|Sakshi

అవినీతి నిరోధక కోడ్‌ కింద రెండు అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ  

దుబాయ్‌: శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. అవినీతి నిరోధక కోడ్‌ కింద అతనిపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండు వేర్వేరు అభియోగాలు నమోదు చేసింది. ఆర్టికల్‌ 2.4.6 ప్రకారం ఐసీసీ యాంటీ కరప్షన్‌ యూనిట్‌ (ఏసీయూ) చేస్తున్న విచారణకు సరిగా సహకరించకపోవడం, కావాల్సిన సమాచారం ఇవ్వకపోవడం ఒకటి కాగా... ఆర్టికల్‌ 2.4.7 ప్రకారం విచారణను అడ్డుకోవడం లేదా ఆలస్యం చేయడంతో పాటు విచారణకు ఉపయోగపడే సమాచారాన్ని ధ్వంసం చేయడం అనేది రెండో అభియోగం. వీటికి 14 రోజుల్లోగా జయసూర్య సమాధానం ఇవ్వాల్సి ఉంది. లంక స్టార్‌ క్రికెటర్‌పై ఏ విషయంలో ఇలాంటి అభియోగాలు నమోదు చేయాల్సి వచ్చిందో ఐసీసీ స్పష్టంగా చెప్పలేదు.

అయితే గత ఏడాది కాలంగా శ్రీలంక క్రికెట్‌పై ఐసీసీ జరుపుతున్న విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. అతని ఫోన్‌ను తమకు అందించాలని కూడా ఏసీయూ కోరగా జయసూర్య దానిపై స్పందించలేదు. 2017 సెప్టెంబర్‌ వరకు లంక చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలతో జయసూర్యకు ఉన్న సంబంధాలపై కూడా విచారణ జరుగుతోంది.   49 ఏళ్ల జయసూర్య ఓపెనర్‌గా పలు రికార్డులు సృష్టించాడు. 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టి20 మ్యాచ్‌లలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు 1996 ప్రపంచ కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్‌ తర్వాత 2010లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. 

>
మరిన్ని వార్తలు