ఆఖరి వన్డేలో లంక జయభేరి

27 Jul, 2015 00:57 IST|Sakshi
ఆఖరి వన్డేలో లంక జయభేరి

 3-2తో సిరీస్ పాక్ కైవసం  
 చెలరేగిన పెరీరా, మ్యాథ్యూస్

 హంబన్‌టోటా: కుశాల్ పెరీరా (109 బంతుల్లో 116; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడు... మ్యాథ్యూస్ (40 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా చెలరేగడంతో ఆదివారం జరిగిన ఐదో వన్డేలో శ్రీలంక 165 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్ 3-2తో దక్కించుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 4 వికెట్లకు 368 పరుగులు చేసింది. పాక్‌పై లంకకు ఇదే అత్యధిక స్కోరు. పెరీరా, దిల్షాన్ (70 బంతుల్లో 62; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 164 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తిరిమన్నే (30), చండిమల్ (29) విఫలమైనా... మ్యాథ్యూస్, సిరివర్ధన (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశారు.
 
 ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించారు. చివరి 11 ఓవర్లలో రికార్డు స్థాయిలో 136 పరుగులు సమకూరడంతో లంక భారీ స్కోరు ఖాయమైంది. దిల్షాన్... లంక తరఫున 10 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో 11వ బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు. రాహత్ అలీ 2 వికెట్లు తీశాడు. తర్వాత పాకిస్తాన్ 37.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హఫీజ్ (37) టాప్ స్కోరర్. అజర్ అలీ (35), రిజ్వాన్ (29), సర్ఫరాజ్ (27) మోస్తరుగా ఆడారు. లంక బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాక్ కోలుకోలేకపోయింది. 140 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన పాక్ 63 పరుగులకే చివరి ఐదు వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. సేననాయకే 3, తిసారా 2 వికెట్లు తీశారు. కుశాల్ పెరీరాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

మరిన్ని వార్తలు